Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 41


    "మమ్మల్ని విడిచిపెట్టొద్దు మొర్రో అని అన్నారు వాళ్ళు"

    
    "అవును సార్!"


    "పైగా వాళ్ళు మరో మాట కూడా అన్నారు. మమ్మల్ని విడిచిపెడితే బాస్ గాడు మా అంతు చూస్తాడు అని మమ్మల్ని వదిలిపెట్టొద్దు అని ఎంతగా ప్రాధేయపడి అడిగినా, నేను వినిపించుకోకుండా విడిచిపెట్టాను. ఇప్పుడు నా ఆలోచన ఏమిటంటే ఆ బాస్ గాడు వీళ్ళిద్దర్నీ బంధించి వుంటాడు అని...నీ అభిప్రాయం ఏమిటి?"


    "మీ అభిప్రాయమే నా అభిప్రాయం సార్!"


    "మనిద్దరి అభిప్రాయాలూ కలిశాయి కాబట్టి మనం ఇప్పుడొక పనిచేయాలి"


    "చేద్దాం సార్! చెప్పండి"


    "మనవాళ్ళిద్దర్నీ బాస్ గాడు ఎత్తికెళ్ళాడు కాబట్టి మనిద్దరం మారువేషాలతో బయలుదేరి వెళ్ళి వాళ్ళిద్దరిని వెతికి విడిచిపెడితే, అటు బాస్ దొరుకుతాడు ఇటు వీళ్ళు స్టేషన్ కి వచ్చి హాజరు వేయించుకుంటూ వుంటారు.


    నా మాటలలోని సత్యం అప్పుడు లోకానికి బోధపడుతుంది" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు తన ఐడియా చెప్పాడు.


    "ఈయన క్రితం జన్మలో స్టేజీ ఎక్కి రోజుకో నాటకం ఆడి వుంటాడు. లేదు లేదు. బహుశా ప్రతి నాటకానికి తెరలాగే వాడయ్యి వుంటాడు.


    మారు వేషాలు, నాటకాలు మారువేషాలు నాటకాలు అని జపిస్తూ ఆ స్టేజీ ప్రక్కనే ఎప్పుడో తనువు చాలించి వుంటాడు. కాకపోతే ఈ జన్మలో తెలుగు సినిమా హీరో కొడుకయి పుట్టాల్సింది పోయి ఇదుగో ఇలా ఈ ఉద్యోగంలోకి వచ్చిపడ్డాడు.


    పూర్వజన్మ వాసనలు ఎక్కడికి పోతాయి? అందుకే అలా ముక్కు ఎగబీలుస్తూ క్షణానికి ఒక డైలాగ్ వదుల్తూ నిమిషానికి ఒక రకంగా ఫేస్ మారుస్తూ మా దుంప తెంచుతున్నాడు"


    ఎదురుగా ఉన్న ఇన్ స్పెక్టర్ మాట మరిచిపోయి అహోబిలం ఆలోచనల్లో పడిపోయాడు.


    అహోబిలం ముఖంలోకి పరీక్షగా చూస్తూ__


    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?" కాస్త కరుగ్గా అడిగాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.


    "వేషాలు సార్! వేషాలు సార్!" అని పొరపాటున నోరు జారినందుకు నాలుక కొడుక్కున్నాడు అహోబిలం.


    "గుడ్! ఈ మధ్య నీ బుద్ధి పదును తేలింది. నీ ఆలోచనలు దారిలో పడ్డాయి. నేను మారువేషాల గురించే ఆలోచిస్తున్నాను. నీవూ మారువేషాల గురించే ఆలోచిస్తున్నావు.


    ఒక్కోసారి ఇలా చెపితే అలా అల్లుకుపోతావు. నీలో నాకు నచ్చిన సుగుణం ఇదే" అన్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఆలోచనలు ఏ విధంగా సాగుతున్నాయో అహోబిలానికి అర్థమయింది.


    అర్జంటుగా ఏదో ఒక మారువేషం వేయకపోతే ఇన్ స్పెక్టర్ మహా శమలుం గారికి మతి పోతుంది.


    మతి గతి తప్పితే కిందవాళ్ళ గతి అధోగతే.


    పాపం ఇన్ స్పెక్టర్ వర్ధనరావుగారు మంచివారే.

    
    చూస్తూ చూస్తూ అపకారం చెయ్యడు. అలా అని పుణ్యానికి ఉపకారం చెయ్యడు.


    ఆశ బారెడు. ఆలోచన మూరెడు.


    ఇదివరకంటే కొన్ని కేసుల్లో అవసరం నిమిత్తం మారువేషాలు వేయటం జరిగింది.


    అవి సక్సెస్ అయ్యాయి.


    ఎప్పుడో ఏదో కేసులో మారువేషం వేస్తే అది సక్సెస్ అయిందని... అలా ప్రతి కేసుకి మారువేషాలు తగిలించుకుంటూపోతే చివరికి ఆయన ఇన్ స్పెక్టర్ అని తాను హెడ్ కానిస్టేబుల్ నని మర్చిపోయి నాటకాల ట్రూప్ లో చేరిపోవట జరుగుతుందేమో! ఆ తర్వాత నాటకం మధ్యలో శ్రీరాముడి పాత్రలో వుండగా పూర్వజన్మ వాసనలుగా పోలీసు వాసన గుర్తుకురాగా స్టేజి మీద శ్రీరాముడు గట్టిగా విజిల్ వేస్తే, నా సామిరంగ అప్పుడు ఆడియన్స్ అంతా...


    అంతవరకే ఆలోచించిన అహోబిలం పైకే ఫక్కున నవ్వేశాడు.


    అహోబిలం ఎందుకు నవ్వాడో తెలియని ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ముక్కు ముఖము ఎర్రపడ్డాయి. ముక్కు ఒకసారి గట్టిగా ఎగబీల్చి "స్టాపిట్" అన్నాడు గాండ్రింపుగ.


    అహోబిలం సైలెన్స్ అయిపోయాడు.


    "ఇప్పుడు చెప్పు ఎందుకు నవ్వావ్!"


    "అది కాదు సార్!"


    "వద్దు సంజాయిషీ వద్దు. ఎందుకు నవ్వావు!"


    "సార్!"


    "వద్దు ఆపై మాటలు వద్దు. నన్ను చూసేనా నవ్వింది ?" ముక్కుతమ్మెలు టిక టిక లాడిస్తూ అహోబిలాన్ని కింద నించి పైదాకా పైనుంచి కిందదాక తీవ్రంగా అండ్ తీక్షణంగా చూస్తూ అడిగాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS