Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 41


    "కాని నాకిది వృత్తి కాదు. సాధించాలనుకున్న ఒకే ఒక్క లక్ష్యం."


    "నీకెలా చెప్పను శశాంకా... అదంత సులభం కాదు" ఆమె గొంతు వణికింది.


    "సమస్యకి సమాధానం వెదుక్కునే వాడు గెలుపు సాధిస్తాడు. సమాధానంలో సమస్యని వెదుక్కోవాలనుకునే వాడు ఓడిపోతాడు. గెలుపుకీ ఓటమికీ వున్న చిన్న తేడా అదే వినీలా"


    "అద్భుతమైన నీ థియరీని నేను ప్రశ్నించడం లేదు... కానీ నీ ఆశావాదాన్ని అడుగడుగునా దెబ్బతీయగల బలమైన అండర్ వరల్డది."


    "వినీలా!" ఓటమి అన్నది మరణమే అయితే దానికి సైతం తను సిద్ధమేనన్న నిర్వేదంతో ఆమెను చూసాడు.


    "1945లో అరుణ్ శ్రీధర్ వైద్య డిఫెన్స్ లో చేరేటప్పుడు తల్లి వద్దని మరీ మరీ వాదించింది. అయినా అడుగుపెట్టాడు. చాలా తక్కువ మంది చేరుకోగల అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. చివరికి రిటైరయ్యాక టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు వదిలాడు. అతడు గెలిచాడంటావా? ఓడిపోయాడంటావా వినీలా... అతడి తల్లి తర్కం ప్రకారం ఓడితే చరిత్ర మిగుల్చుకున్న అతనివేపు తర్కంతో ఆలోచిస్తే గెలిచాడు. నీ తర్కాన్ని నేను ఖండించడంలేదు. నా స్థానంలో నిలబడి ఆలోచించమంటున్నాను."


    గడుస్తున్నకాలం అతణ్ణెంత మొండివాడిగా మారుస్తున్నదీ తన తర్కాన్ని సమర్ధించుకునే ప్రవృత్తి ఎంత బలంగా అతనిలో రూపుదిద్దుకుంటున్నదీ అర్థమైపోయింది వినీలకి.


    "వినీలా" విష్పరింగ్ లా వినిపించింది శశాంక కంఠం. "నేను అవివేకిలా మాటాడుతున్నానని నువ్వనుకున్నా నాకభ్యంతరం లేదు. జ్ఞానమన్నది అనుభవంతో సాధించగలిగేదే అయితే దానికి ముందు స్థాయి అవివేకమే కావాలి. అలాంటప్పుడు తెలుసుకునే ప్రాసెస్ లో కొంత పోగొట్టుకున్నా ఎంత పోగొట్టుకున్నదీ తెలీని అవివేకమే అతణ్ణి ముందుకు నడిపిస్తుంది" క్షణం ఆగేడు.


    "ప్రమాదాన్ని ముందే వూహించి నువ్వు చేసిన సహాయానికి థాంక్స్."


    విభ్రాంతిగా చూసింది.


    "నాకు తెలుసు. నేను కుమార్ దాదాని కలవడం నువ్వు ముందే వూహించావని. కాబట్టే నన్ను రక్షించడానికి పోలీసులకు ఫోన్ చేసి సకాలంలో రంగంలోకి రప్పించావని."


    ప్రతి అనుభవమూ అతడి మనసు నెంత పదును పెడుతున్నదీ క్రమంగా తెలుసుకుంటున్న వినీల ఆ సమయంలో ఆలోచిస్తున్నది ఇప్పటి అతని మానసిక స్థితిని గురించి కాదు. తర్వాత జరగబోయే ప్రమాదాలను గురించి.


    ఆ ఆలోచనతోనే తలతిప్పి వెనక్కి చూసింది. అలా చూసింది రగులుతున్న ఒక యజ్ఞంలో అతడ్ని సమిధ చేయబోతున్న గూండాల గురించి కాని, ఆమెకు దూరంగా వస్తున్న పోలీస్ కారు కనిపించింది.  

 

    "కారాపు" తొట్రుపాటుగా అంది. ఆగిన వెంటనే "పోలీసులు వెంటాడుతున్నారు. పక్క సందులో నుంచి జనం మధ్య కలసి వెళ్ళిపోండి" అంటూ శశాంక ఆలోచించుకునే వ్యవధి సైతం ఇవ్వకుండా తాను డ్రైవింగ్ సీటులో కూర్చుంది డ్రైవర్ దిగిపోగానే.


    శశాంక డ్రైవర్ తో సహా రద్దీగా వున్న సందులోకి వెళ్ళగానే ఫియట్ ని ముందుకు దూకించింది కాని ఓ ఫర్లాంగ్ దూరం వెళ్ళకముందే లారీ అడ్డం రావడంతో ఆపేసింది.


    అప్పటికే కారు దిగి ఆమెను సమీపించిన పోలీస్ అధికారి అవినాశ్ "హల్లో" అంటూ పలకరించాడు.


    "మీరు జర్నలిస్ట్ వినీల కదూ!"  


    వినీల కంగారును అదుపు చేసుకుంటూ తలూపింది.


    "మీరే ఫోన్ చేసి వుంటారని ఊహించాను."


    ఏ ఆధారంతో ఇదంతా గెస్ చేయగలిగాడో అర్థంకాక నిశ్చేష్టగా చూసింది.


    "ముఖ కవళికల్ని బట్టి నేరస్థుల్ని గుర్తించగల నా అంచనా తప్పు కాదన్న నమ్మకంతో మీరు కారులోని వ్యక్తుల్ని దింపి అలా సందులోకి పంపినా, నాకు ఎదురుపడకూడదని ప్రయత్నించినా మిమ్మల్ని దోషిగా భావించకుండా విడిచి వెడుతున్నాను" సాలోచనగా చూసాడు.


    "కాని ఒక్క మాట శశాంకని రక్షించాలని మీరు చేసిన ఈ ప్రయత్నం అభినందించదగ్గదే కాని చట్టం నుంచి తనను తాను కాపాడుకునే స్థితి మాత్రం అతడికి రాకుండా చూడండి వీలైతే."


    కుమార్ దాదా 'అడ్డా' నుంచి తప్పించుకుంటున్న శశాంకని తను గమనించాడని అతడు చెప్పలేదు.


    కేవలం పది నిముషాల వ్యవధిలో కుమార్ దాదాని కారు వెనక వచ్చిన మరో పోలీస్ వేన్ లో పంపించి ఫియట్ ని అనుసరిస్తూ వచ్చిన అవినాశ్ ఇదంతా ఎనలైటికల్ గా ఆలోచిస్తూ మాట్లాడాడు.


    అదే అవినాశ్ కున్న ప్రత్యేకతని తెలీని నేరస్థులు కంగారుపడి అసలు విషయాల్ని కక్కేసేది ఆలాంటప్పుడే.


    బేలెన్స్ డ్ గా ప్రవర్తించి మౌనంతో చాలా విషయాల్ని దాచేయగల్గిన వినీల చూస్తూ వుండిపోయింది అవినాశ్ వెళ్ళడాన్ని.


    కొన్ని క్షణాల క్రితం దాకా గూండాల విషయమే ఆలోచించిన వినీల ఇప్పుడు శశాంక పేరు పోలీస్ రికార్డ్సులోకి వెళ్ళడాన్ని అంగీకరించలేకపోయింది.


    సరిగ్గా ఆమె ఇక్కడ యిలా ఆలోచిస్తున్న సమయంలో అక్కడ గల్లీలో శశాంకని పోలీసులు తరుముతున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS