Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 41


    "ఎలా వుంది?" అని అతనడగాలనుకున్నాడు. కానీ చిత్రంగా ఆమె తనని కుశల ప్రశ్నలడుగుతోంది.


    "రాత్రి నన్నో దెయ్యం పట్టింది" అన్నాడు.


    భారతి అతనికేసి చిత్రంగా చూసింది.


    "దెయ్యమా?"    


    "అవును నిద్రపోనివ్వని దెయ్యం"


    "ఎందుకు"


    "భారతీ!" ఆ పిలుపు చాలా గంభీరంగా వుంది. తనమీద అధికారం వున్నట్లుగా సంభోదన.


    విస్మయంగా చూసిందతన్ని.


    "రాత్రి ఏం జరిగిందో నీకు తెలుసా?" సూటిగా అడిగాడు.


    భారతి తలొంచుకుంది.


    "గుర్తులేదా?" మళ్ళీ అఢిగాడు.


    భారతి మెల్లగా తలెత్తి చూసింది. ఆమె కళ్ళలో కన్నీటిముత్యాలు. వణుకుతున్న గొంతులో చెప్పింది.


    "ఆ రాస్కెల్ నన్ను మోసంచేసి డ్రింక్ లో ఏదో కలిసి తాగించాడు బావా! అంతకంటే నాకేం తెలీదు" అంది.


    "ఆ తర్వాత కథ నేను చెప్పనా?"


    భారతి అతని మాటలకి మాట్లాడలేదు.


    "నాకు ఉద్యోగం వచ్చింది భారతీ, నీతో ఆ విషయం చెప్పాలని చాలాసేపు చూశాను. నువ్వు ఎంతకీ రాకపోతే నీకోసం అలా రోడ్డుమీదకి వచ్చాను."


    భారతి వింటోంది.


    "ఓ ఆటో నాకు కొద్దిదూరంలో వచ్చి ఆగింది. అందులోంచి బోసు దిగి, నిన్ను దింపాడు వళ్ళు తెలీని స్థితిలో వున్న నిన్ను పట్టుకొని వాడింట్లోకి తీసుకెళుతున్నాడు."


    "వాడింటికా?" ఆశ్చర్యంగా అడిగింది.


    "అవును."


    "దేనికి?"


    "నీ జీవితాన్ని కాటేయడానికి"


    భారతి మొహం సిగ్గుతోనూ అవమానంతోనూ ఎర్రబడింది.


    సారధి భారతి మొహంలోకి చూసి బాధపడ్డాడు. అన్న మాటలు ఆమెని గానీ బాధించినాయా అని లిప్తకాలం పాటు ఆలోచించాడు.


    అనునయంగా చెప్పాడు.


    "నీ అదృష్టం చాలా గొప్పది భారతీ, మెరుపులా ఓ ఫియెట్ కారొచ్చింది. అందులోంచి ఒకతను దిగి బోసుగాడి మీద మెరుపుదాడి చేసి వాడిని చావ బాదాడు. నిన్ను కాపాడి నాకు అప్పగించాడు."


    భారతి సారధికేసి చూసి తల దించుకుంది.


    తనని కాపాడిన వ్యక్తి ఎవరని ఆమె అడక్కపోవడం చూసి సారధి......


    "నీ నూరేళ్ళ బతుకునీ కాపాడిన ఆతనెవరో తెలుసుకోవాలని నీకు లేదా?" అని అడిగాడు.


    అతను భారతి ఊహకందని మనిషికాదు.


    ఖచ్చితంగా ఆ సమయంలో మనోహరే వచ్చి తనని కాపాడి ఉంటాడని భారతికి తెలుసు. అతనిపట్ల ఎంత ద్వేషం ఉన్నా ఆ క్షణంలో మాత్రం అతని పట్ల ఆమె గుండెలో ఏదో మారుమూల కృతజ్ఞతాభావం కదలాడింది.


    కానీ...... కానీ..... అంతలోనే వెర్రిగా అరవాలనిపించింది.


    "నేనసలు ఆటో ఎక్కిందే అతన్ని తప్పించుకోడానికి" అని


    కానీ ఆ మాటలు ఆమె గొంతు గాటి బయటికి రాలేదు.


    "అతని పేరు మనోహర్. మీ యూనివర్శిటీ స్టూడెంటే" చెప్పాడు సారధి.


    భారతి విన్నది.


    ఆమెకి తెలుస్తూనే ఉన్నది.


    తను తెలివితక్కువగా ప్రవర్తించింది.


    తనంటే మనోహర్ కి ఏవగింపు కలగాలన్న తలంపుతో బోసుని అడ్డు పెట్టుకుని చిన్న నాటకం ఆడాలనుకొన్నదే కానీ, కంచె చేను మేసినట్టుగా ఆ రాస్కెలే తన జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకుంటాడని ఊహించలేదు.


    మనోహర్ తో ఖచ్చితంగా రానని చెబితే ఏ గొడవా ఉండేది కాదు. అనవసరంగా తనే తొందరపడింది. బోసు నిజరూపం ఏమిటో తెలిసిపోయింది.


    బావ చెప్పినట్టుగా ఆ క్షణంలో మనోహర్ వచ్చి తనని కాపాడకపోతే ఈ పాటికి తనేమయిపోయి వుండేది?


    గుర్తుకొస్తేనే అసహ్యంగా వుంది. ఆలోచిస్తూంటే కంపరంగా ఉంది. వాడు కనబడితే చెప్పుతో కొట్టాలనుకుంది.


    "బావా!"


    "ఏమిటి?"


    "ఇదంతా మమ్మీకి తెలుసా?" అడిగింది.


    ఆమె కళ్ళల్లో గూడు కట్టుకొంటున్న భయం తాలూకు భావాలని అతను చదవగలిగాడు.


    "తెలీదు" అంటూ ఆమెకి తెలీకుండా తను తీసుకొన్న జాగ్రత్త గురించి ఆమెకి చెప్పాడు.


    ఆమె మనసు బావపట్ల అభిమానంతో నిండిపోయింది.


    భారతి లేచి నుంచుంది. అతని రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ముద్దుపెట్టుకుంది.


    భారతి వీపు పైన ఆప్యాయంగా చేత్తో తట్టాడు సారధి.


    "నేనీవేళ వెళ్ళిపోతున్నాను. నిజానికి వెళ్ళాలనిపించడం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు అమాయకురాలివి. లోకం అంటే అవగాహన లేని పసిదానివి. నేనిక్కడే వుండి నీ జీవితం ఓ దారికొచ్చే వరకూ నా గుండెల్లో దాచుకొని కాపాడాలని వుంది"


    "ఆ అభిమానం చాలు బావా" అంది.


    "నాకెందుకో దిగులుగానూ, భయంగానూ వుంది భారతీ. వాడు మళ్ళీ నీ జోలికి రాకుండా వుంటాడా?" అతని గొంతు వణికింది.


    భారతి అతని భుజంపైన తల ఆన్చింది.


    ఏం జరిగినా అత్తయ్య గంతులేస్తుందే తప్ప, అర్థం చేసుకోడానికి ప్రయత్నించదు. ఒకటి గుర్తుపెట్టుకో జరిగినదాన్ని గురించి బాధపడకు, జరగవలసిన దాన్ని గురించి జాగ్రత్తగా వుండు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS