Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 42


                     జగన్నాథుని రథచక్రాలు

పతితులార!
భ్రష్టులార
బాధాసర్ప దష్టులార!
బ్రదుకు కాలి,
పనికిమాలి,
శనిదేవత రథచక్రపు
టిరుసులలో పడి నలిగిన
దీనులార!
హీనులార!
కూడు లేని గూడు లేని
పక్షులార! భిక్షులార!
సఖులవలన పరిచ్యుతులు,
జనులవలన తిరస్కృతులు,
సంఘానికి బహిష్కృతులు -
జితాసువులు,
చ్యుతాశయులు,
హృతాశ్రయులు,
హతాశులై
ఏడవకం డేడవకండి!
మీ రక్తం, కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం డేడవకండి!
ఓ వ్యథా నివిష్టులార!
ఓ కథా వశిష్టులార!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
ఏడవకం డేడవకండి!

వస్తున్నా యొస్తున్నాయి....
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్!
జగన్నాథుని రథచక్రాల్!
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రా
లొస్తున్నా యొస్తున్నాయి!

పతితులార!
భ్రష్టులార!
మొయిల్దారిని
బయల్దేరిన
రథచక్రాల్, రథచక్రా
లొస్తున్నా యొస్తున్నాయి!

సింహాచలం కదిలింది,
హిమాలయం కరిగింది,
వింధ్యాచలం పగిలింది -
సింహాచలం,
హిమాచలం,
వింధ్యాచలం, సంధ్యాచలం....
మహానగా లెగురుతున్నాయి!
మహారథం కదులుతున్నాది!
చూర్ణమాన
ఘూర్ణమాన
దీర్ణమాన గిరిశిఖరాల్
గిర గిర గిర తిరుగుతున్నాయి!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
రారండో! రండో! రండి!

ఊరవతల నీరింకిన
చెరువుపక్క, చెట్టునీడ -
గోనెలతో, కుండలతో,
ఎటు చూస్తే అటు చీకటి,
అటు దుఃఖం, పటు నిరాశ-
చెరసాలలు, ఉరికొయ్యలు,
కాలువలో ఆత్మహత్య!
దగాపడిన తమ్ములార!
మీ బాధలు నే నెరుగుదును...
వడలో, కడు
జడిలో, పెను
చలిలో తెగనవసి కుములు
మీ బాధలు, మీ గాథలు


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS