Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 41


                                                          నీడలు

చూడు, చూడు, నీడలు!
నీడలు, పొగ మేడలు!
యుగ యుగాల దోపిడిలో,
నరనరాల రాపిడిలో -
వగదూరిన,
పొగచూరిన
శాసనాల జాడలు!
జాలిజార్చు గోడలు!

చూడు, చూడు, నీడలు!
నీడలు, పొగ మేడలు!

                                  * * *

చూడు, చూడు నీడలు
పేదవాళ్ళ వాడలు!

నరనరాల వేదనలో
తరతరాల రోదనలో -
బక్క చిక్కి!
బక్క చచ్చి
పడిన బతుకు గోడలు!
పాడుపడ్డ వాడలు!
చూడు, చూడు, నీడలు!
పేదవాళ్ళ వాడలు!

                                * * *

చూడు, చూడు, నీడలు!
పూలు లేని కాడలు!
తరతరాల చెరసాలల
రకరకాల తెరచాటుల
పొదిగిటిలో
ఒదిగిలిపడు
నిర్భాగ్యపు నీడలు!
ఎడారిలో ఓడలు!

చూడు, చూడు, నీడలు!
పూలులేని కాడలు!

                      * * *

చూడు, చూడు, వ్రీడలు!
పీడలతో క్రీడలు!
చూడు, చూడు, నీడలు!
సూర్యునితో క్రీడలు!
సూర్యునిలో సూదులతో
క్రీడలాడు నీడలు!

                                                                             19-6-1947

                                                    * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS