అవగాహన నాకవుతాయి!
పతితులార!
భ్రష్టులార!
దగాపడిన తమ్ములార!
మీ కోసం కలం పట్టి,
ఆకాశపు దారులంట
అడావుడిగ వెళిపోయే,
అరచుకుంటు వెళిపోయే
జగన్నాథుని రథచక్రాల్,
రథచక్ర ప్రళయఘోష
భూమార్గం పట్టిస్తాను!
భూకంపం పుట్టిస్తాను!
నట ధూర్జటి
నిటాలాక్షి పగిలిందట!
నిటాలాగ్ని రగిలిందట!
నిటాలాగ్ని!
నిటాలార్చి!
నిటాలాక్షి పటాలుమని
ప్రపంచాన్ని భయపెట్టింది!
అరె ఝూఁ! ఝూఁ!
ఝటక్, ఫటక్.....
హింసనచణ
ధ్వంసరచన
ధ్వంసనచణ
హింస రచన!
విషవాయువు, మర ఫిరంగి,
టార్పీడో, టోర్నాడో!
అది విలయం,
అది సమరం,
అటో యిటో తెగిపోతుంది
సంరంభం,
సంక్షోభం,
సమ్మర్దన, సంఘర్షణ!
హాలాహలం పొగచూరింది!
కోలాహలం చెలరేగింది
పతితులార!
భ్రష్టులార!
ఇది సవనం,
ఇది సమరం!
ఈ యెగిరిన ఇనుప డేగ,
ఈ పండిన మంట పంట-
ద్రోహాలను తూలగొట్టి,
దోషాలను తుడిచిపెట్టి,
స్వాతంత్ర్యం,
సమభావం,
సౌభ్రాత్రం,
సౌహార్దం
పునాదులై ఇళ్ళు లేచి,
జనావళికి శుభం పూచి-
శాంతి, శాంతి, కాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది.
ఈ స్వప్నం నిజమవుతుంది!
ఈ స్వర్గం ఋజువవుతుంది!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
దగాపడిన తమ్ములార!
ఏడవకం డేడవకండి!
వచ్చేశాయ్, వచ్చేశాయ్,
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్,
జగన్నాథుని రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రాల్,
రారండో! రండో! రండి!
ఈ లోకం మీదేనండి!
మీ రాజ్యం మీ రేలండి!
- 1940
* సమాప్తం *
