జాలి, ప్రేమ, కరుణ లాంటి గుణాలు అబ్బాయి. ఇతరుల కష్టాల్ని చూసి చలించిపోయే స్థితికి వచ్చాడు. వ్యాపారంలోని మోసాలకు స్వస్తి చెప్పాడు.
సత్యవతిని ఇంకా ప్రేమించడానికి ఎంత సున్నితంగా తయారవ్వాలా అన్న ధ్యాస తప్ప అతనికి మరేమీ పట్టడం లేదు.
వారం రోజులకి వ్యాపారం అయిపోయింది. మరో నెలకు మొదటి కంతు ప్రారంభమవుతుంది. అప్పుడొస్తే రైతులు మొదటి వాయిదా చెల్లిస్తారు.
అతనికి స్వగ్రామంలో తల్లి మాత్రం వుంది. తోబుట్టువులు ఎవరూ లేరు. మేనమామ ఒకడున్నాడు. ఆయన తన కూతురు రేణుకని సీతారామయ్యకి కట్టబెట్టాలని చాలారోజుల్నుంచీ తాపత్రయపడుతున్నాడు. అయితే రేణుకని ఎందుకు చేసుకోవాలో సీతారామయ్యకి అర్థం కాలేదు. ఆమెలో తనని ఆకర్షించే ఏ గుణమూ అతనికి కనపడలేదు.
అందుకే ముప్ఫై అయిదేళ్ళొచ్చినా ఇంకా పెళ్ళి చేసుకోలేకపోయాడు.
వ్యాపారం అయిపోగానే గెడవలోళ్ళు అంతా ఊర్లకు బయల్దేరాడు. సీతారామయ్య మాత్రం తను పోనని సత్యవతి దగ్గర మారం చేశాడు. చివరికి ఆమె బలవంతం మీద ఒప్పించింది.
అలా సీతారామయ్య వూరెళ్లాడు.
అయినా ఏం లాభం? నెలరోజులకు రావలసినవాడు పదిహేను రోజులకంతా వచ్చేశాడు.
అతన్ని చూస్తూనే రైతులకు గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. అప్పుడే నెల అయిపోయిందా అని నోళ్ళు నొక్కుకున్నారు. ఎన్నిసార్లు లెక్కలేసినా పదిహేను రోజులే వస్తున్నాయి. ఆ తర్వాత తెలిసింది వాళ్ళకి సీతారామయ్య వచ్చింది గడువు డబ్బు కోసం కాదని, సత్యవతి కోసమని.
"నాకు తెలుసు నువ్వు వచ్చేస్తావని" అంది కోపంగా సత్యవతి సీతారామయ్యని చూడగానే.
"అందుకే ముందుగా షరతు పెట్టాను. ఇలా అయితే నీ వ్యాపారం అయినట్టే" అంది అతడు ఏమీ మాట్లాడలేకపోయేసరికి.
"ఇక వ్యాపారం ఏముంది? గడువు ప్రకారం డబ్బు వసూలు చేసుకోవడమే కదా?" అన్నాడు నెమ్మదిగా.
ఇక ఆమె కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమెకీ అతన్ని చూడకుండా వుండటం కష్టంగా వుంది. కానీ ఇలా అయితే తాము నలుగురిలో నవ్వుల పాలవుతామనే ఆమె భయమంతా.
ఆమె అనుకున్నంతా అయింది.
ఊరికంతా విషయం తెలిసిపోయింది.
తమ ఊరికానివాడు వచ్చి సత్యవతి లాంటి పిల్లతో గడపడం కొంత మందికి కోపాన్ని తెప్పించింది. కానీ ఏం చేయగలరు? నెమ్మదిగా ఆ విషయాన్ని సత్యవతి తండ్రికి తెలియజేశారు.
ఆయన ఆ విషయం వినగానే ఉగ్రుడైపోయాడు. ఇంటికెళ్ళి కూతురిని నిలదీశాడు.
ఆయన కోపానికి భయపడకుండా ఎదురెళ్ళింది సత్యవతి తల్లి.
"ఆ పిల్లను నోటికొచ్చినట్లు తిడుతున్నావు. ఏంది కథా? అది మాత్రం ఏం చేస్తుంది? బంగారం ఆశతో భర్త అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఉప్పూ, కారం తినే శరీరం - దానికి మాత్రం కోరికలుండవా? నా కూతురు కాబట్టి ఇన్ని సంవత్సరాలయినా మనసును వశం తప్పకుండా పెట్టుకుంది.
అదే నీకు చెప్పిన వెధవల కూతుళ్ళయితే కర్మకాండ రోజే వేరే మగాడ్ని పక్కలోకి రప్పించుకునేవాళ్ళు. పౌరుషాలు చాలుగానీ వెళ్ళెళ్ళు" అని ఆమె భర్తని తోసుకుంటూ వెళ్లి వీధిలోకి నెట్టింది.
ఇంట్లో అందరికీ తెలిసిపోవడంతో అచ్చు అల్లుడిలా అయిపోయినాడు సీతారామయ్య.
సినిమాలు, షికార్లతో హాయిగా కాలం గడిచిపోతోంది వాళ్ళిద్దరికీ. గడువుల డబ్బు వసూలు చేసుకుంటూ, వ్యవసాయం కూడా ప్రారంభించాడు సీతారామయ్య. ఆర్నెల్లు గడిచిపోయాయి.
రెండ్రోజుల్లో వస్తానని వెళ్ళిన సీతారామయ్య తిరిగి రాకపోవడంతో అతని తల్లి, మేనమామ వచ్చారు.
వాళ్ళు ఊర్లో దిగగానే చెప్పాల్సిందంతా చెప్పారు ఊర్లో కొంతమంది "ఆ సత్యవతి మీవాడిని వల్లో వేసుకుంది. కంతుల కింద వసూలయిన డబ్బంతా ఆ పిల్లకే పెట్టేస్తున్నాడు.
ఇక మీవాడి మీద ఆశ వదులుకోండి. మీ అబ్బాయి ఆ ఇంటి అల్లుడైపోయాడు. ఇంట్లో అందరూ ఆమోదం చేశారు. చెట్టాపట్టాలేసుకుని ఇద్దరూ టౌన్ కూడా తిరిగొస్తున్నారు.
"అది - ఆ వగలాడి మీవాడికి మందు పెట్టేసి వుంటుందని మా అనుమానం"
ఇలా తమకు తోచినదంతా చెప్పారు. తల్లీ, మేనమామ సత్యవతి ఇంటికి వెళ్ళకుండా దేవాలయం దగ్గరికి పిలిపించారు.
"రెండ్రోజుల్లో వస్తానని వచ్చిన వాడివి ఇంకా ఇక్కడ రాచకార్యాలు తీరలేదా?" తల్లి సాగదీస్తూ అడిగింది.
"వచ్చే నెలలో ముహూర్తాలు పెట్టుకోవాలనుకుంటున్నాం. నువ్వు ఓ ముక్క సరేనని అన్నావంటే పెళ్ళి పనులు మొదలుపెడతాం"
"నేను రాను. రేణుకని అసలే పెళ్ళి చేసుకోను" ఇక మాట్లాడవలసింది ఏమీ లేనట్లు తిరిగి వెళ్లబోయాడు సీతారామయ్య.
అతని మాటలు విని "ఈ ఊళ్ళో ఎవరినో మరిగి నా కూతుర్ని పెళ్ళి చేసుకోనని అంటున్నావని తెలుసు. ఇలాంటివన్నీ ఎన్నిరోజులో సాగవు. బెల్లం అయిపోగానే ఒక్క చీమ కూడా వుండదు" కసిగా అన్నాడు సీతారామయ్య మేనమామ.
"ఆమె గురించి చీప్ గా ఒక్కమాట మాట్లాడినా నే వూరుకోను. తలలు పగులుతాయ్!"
సీతారామయ్య కోసం చూసి ఆ పెద్దాయన జడుసుకున్నాడు.
"అవేం మాటలురా పెద్దా - చిన్నా లేకుండా? ఇప్పుడు మేము ఏమయినా నిన్ను చెట్టు లెక్కమంటున్నామా? పుట్టలెక్కమంటున్నామా? ఊరికి వచ్చి ఆ మూడు ముళ్ళూ వేసుకోరా అంటున్నాం. అంతేకదా!" తల్లి అనునయంతో చెప్పింది.
"ఊరికి రానని నేననడం లేదు. వస్తే గిస్తే సత్యవతితోపాటు వస్తాను. రేణుకకు వేరే పెళ్ళి చేసేయండి" అన్నాడు ఖచ్చితంగా.
"అంతేనంటావా? అయినా ఆ వెధవముండను పెళ్ళి చేసుకుంటావా?" మేనమామ కూడా సీరియస్ అయిపోయాడు.
"వెధవముండ అనకు, నీకూ ఒక కూతురుంది. ఏదో ఖర్మకాలి మొగుడు చచ్చినంత మాత్రాన ఆడదాని బ్రతుకంతేనా? ఎవరు చెప్పారు మీకు? వాళ్ళూ మనుషులేనని గుర్తుపెట్టుకో"
"అయినా నా కూతురికి అలాంటి దురదృష్టం ఎందుకు పడుతుంది? అది బంగారుతల్లి"
"బంగారుతల్లో, ఇత్తడి చెల్లో నాకనవసరం. ఇక మీరు బయల్దేరవచ్చు"
"నువ్వు వెళ్ళమనేంతవరకు మేమెందుకుంటాం? ఇప్పుడే వెళ్ళిపోతాం. అలాంటి నీతిలేని పిల్ల నీకు మాత్రం పంగనామాలు పెట్టకుండా వుంటుందా? ఎప్పుడో నువ్వే బుద్ధి తెలుసుకుని వస్తావని మేం వూరుకోం. అది పెట్టిన మందును నీచేత కక్కించి, నా కూతురు మెళ్ళో నువ్వు మూడుముళ్ళూ వేయించేవరకు నేను నిద్రపోను" అని కోపంతో పైకి లేచాడు ఆయన. సీతారామయ్య అక్కడ్నుంచి వచ్చేశాడు.
