"సరే... నేనే చెప్పేస్తా ఆ రోమన్ గవర్నరు పేరు పిలాట్."
"చరిత్రలో క్రీస్తుపూర్వం 44వ సంవత్సరం మార్చి పదిహేనో తేదీకున్న ప్రాముఖ్యమేమిటి?"
"జూలియస్ సీజర్ హత్యకు గురి అయిన రోజది."
"ఇట్స్ మార్వలెస్ ఆదిత్యా! ఇప్పటికే మీరు నన్ను మించి ఆధిక్యంలో వున్నారు మిగిలిన మూడు ప్రశ్నలన్నీ తప్పకుండా చెప్పాలి."
ఏకాగ్రంగా చూస్తున్నాడు.
"జాంబియా దేశపు వైశాల్యం ఎంత?"
"అడిగేవాడికి చెప్పేవాడు లోకువన్నట్టుగా ఉంది ఈ ప్రశ్న..." చిరుకోపంగా అన్నాడు ఆదిత్య.
"ఎందుకలా అంటున్నారు?"
"ప్రపంచంలో చాలా దేశాలున్నాయి ప్రణయా! వైశాల్యాల గురించి ఇలా అడిగేది క్విజ్ ని సేడిస్టిక్ వా నిర్వహించే వ్యక్తులే."
"తెలీదని చెప్పొచ్చుగా?"
"ఈ మాట అంటున్నది తెలీక కాదు ప్రణయా! మీ బావ మెంటల్ కండిషన్ని ఎస్టిమేట్ చేస్తున్నాను." చెప్పాడు నవ్వుతూ. "జాంబియా దేశం వైశాల్యం రెండు లక్షల తొంభై వేల అయిదు వందల ఎనభై నాలుగు చదరపు మైళ్ళు."
"చెప్పగలిగే అలా ఆవేశపడతారేం?"
"అదే జింబాబ్వే గురించి అడిగివుంటే చెప్పలేకపోయేవాడిని ప్రణయా! మొన్నెప్పుడో మనం ఫేస్ చేసిన క్విజ్ పోటీలకోసం ఓ అయిదు దేశాల వైశాల్యాలు గుర్తు పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు అడిగింది ఆ అయిదు దేశాలలో ఒక దేశం వైశాల్యం గురించి ఇందాకెప్పుడో నేనన్నది ఇదే అడిగిన ప్రశ్న ప్రిపేరైన కొద్దివాటిలోదయితే ఆ వ్యక్తి ఎక్కువ స్కోరే చేస్తుంటాడు. నిజంగా కష్టపడే వాడికన్నా."
జవాబు తెలిసీ ఆదిత్య ఇలా మాట్లాడటంలో ఆమె తప్పు పట్టలేక పోయింది.
నిజమే కొన్ని ప్రశ్నలు క్విజ్ కి అర్ధమైనవికావు.
"మనం ఉత్తరాలపైన అంటించుకునే స్టాంప్స్ మొట్టమొదట ఏ దేశంలో ఎప్పుడు అమలులోకి వచ్చింది?"
"క్రీస్తుశకం 1840 మే ఆరో తేదీన బ్రిటన్ దేశం అంటించే స్టాంప్స్ అమలులోకి తీసుకొచ్చింది."
ఇప్పటికే గెలిచాడు ఆదిత్య అయినా చివరి ప్రశ్న అడిగింది.
"ఒక స్టాంపుపైన ముద్ర పొరపాటుమూలంగా లక్షమంది మరణించారు."
"1932లో పెరుగ్వే స్టాంప్ పైన చాకో అనే ప్రాంతం మేప్ లా ముద్రితమైంది. నిజానికి ఆ ప్రాంతం గురించి అప్పటికే బొలీవియా, పెరుగ్వేల మధ్య చాలా గొడవ జరుగుతూంది. ఇంకా తేలని చాకో టెర్రిటరీ తమదని పెరుగ్వే స్టాంప్ పైన ముద్రించుకోవడంతో బొలీవియా దండయాత్ర చేసింది పెరుగ్వే పైన. రెండు దేశాలకి చెందిన లక్షమంది సైనికులు చనిపోయారు. ఆ తరువాత 1938లో రెండు దేశాల మధ్య శాంతి ఒడంబడిక జరిగింది. ఆ టెర్రిటరీ తొంభైశాతం పెరుగ్వేకి చెందేట్టు ఆ ఒడంబడిక నిర్ణీతమైంది."
"హార్టీ కంగ్రాట్స్ ఆదిత్యా! మీరు గెలిచారు!" ఉత్సాహంగా అంది ప్రణయ. "కాదు.... తప్పకుండా రేపు గెలవబోతున్నారు."
పరవశించిపోలేదు ఆదిత్య. ఇక్కడ గెలుపును మరోచోట గెలుపుతో అన్వయించుకోవడానికి అవకాశం లేని ఇలాంటి పరీక్షల్లో విజయం ఎప్పుడూ ఒకే పక్క మొగ్గుతుందన్న నమ్మకం లేకపోయినందుకేమో నిర్లిప్తంగా లేచాడు. "పోటీ వెంటనే ఏర్పాటు చేయొద్దు ప్రణయా! నాకు ఓ వారం గడువు కావాలి."
"అదేం?"
"మరికాస్త ప్రిపేరవుతాను."
"భయంగా వుందా?"
మృదువుగా నవ్వాడు. "అవును.... మిమ్మల్ని పోగొట్టుకుంటానేమో అని."
క్షణంపాటు ప్రణయ నేత్రాలు అరమోడ్పులయ్యాయి. నిజానికి ఆమె కూడా ధైర్యంగా వుండలేకపోయింది.
అయినా ఆ రాత్రే ఫోన్ చేసింది రోహిత్ కి. "నువ్వు ఎదురుచూస్తున్న పోటీని మరో అయిదు రోజుల్లో అంటే వచ్చే సోమవారం సాయంకాలం మా ఇంట్లోనే ఏర్పాటు చేస్తున్నాను రోహిత్! ప్రిపేర్ కా."
"ప్రిపరేషన్ కావల్సింది నీ కాండిడేట్ కి ప్రణయా! నేను ఈ క్షణంలో అయినా సిద్దమే."
అతడి ఛాలెంజ్ మరింత కంగారుపెట్టింది దానికి కారణం రోహిత్ ఇప్పుడింకా అనుభవాన్ని సంపాదించడం మాత్రమేకాదు, బ్రిటన్ మొత్తంలో మొదటి శ్రేణి క్విజ్ మాస్టర్ గా ఎదిగిపోయిన వ్యక్తి అని ఆమెకు తెలుసు కాబట్టి.
ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా నిద్రపోలేక పోయింది.
* * *
మరుసటిరోజు ఉదయం పదిగంటలకల్లా యూనివర్శిటీకి వచ్చిన ప్రబంధ దూకుడుగా వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లోకి దూసుకుపోయింది.
రిజిస్ట్రార్ తో కలిసి ఏదో చర్చిస్తున్న వీసీ అపాయింట్ మెంటు లేకుండా అలా మరో స్టూడెంట్ వచ్చివుంటే విరుచుకు పడేవాడే కాని, వచ్చింది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కావడంతో ఆవేశాన్ని చాలా నిగ్రహంతో అదిమిపెట్టుకున్నారు.
"ఏంటమ్మా?" అన్నాడు విఐపిలా రిసీవ్ చేసుకుంటూ "ఏదో పనివుంటే తప్ప నువ్వు రావని తెలుసు."
"మీతో మాట్లాడాలి."
అప్పటికే బయట స్టూడెంట్స్ గుంపులుగా చేసి దూరంనుంచే గమనిస్తున్నారిదంతా.
"ఆ గోడల మీద రాతలగురించి నీకు కోప మొచ్చిందనుకుంటాను. సహజమే, పరువుగల ఏ ఆడపిల్ల అయినా ఇలాగే రియాక్టవుతుంది" ఆమె రాకకు గల ఆంతర్యాన్ని తనే ఊహించాలనుకున్నాడుగాని అర్దోక్తిగా ఖండించింది.
"రాసింది నా గురించి కాదుగా?" అలా ఆదిత్యతో తన పేరు ముడిపెట్టి వుంటే ఇంత రియాక్టు అయ్యేదాన్ని కాదన్నట్టుగా వుంది ఆమె స్టేట్ మెంటు. "కాబట్టి నేను వచ్చింది అందుక్కాదని మీరు అర్ధం చేసుకోవాలి."
