Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 43


    
    "నిజమే నీగురించి కానప్పుడు నువ్వెందుకు రియాక్టు కావాలి?" తన ఎస్టిమేషన్ ఇలా తగలడినందుకు బాహాటంగా తన బాధను ప్రకటించాడు.
    
    "మరి?"
    
    "నేను వచ్చింది మొన్న జరిగిన క్విజ్ కాంపిటీషన్ గురించి మాట్లాడటానికి..."
    
    "అవును సిల్వర్ స్పాట్ కంపెనీవాళ్ళు నిరవధికంగా రాష్ట్రస్థాయి పోటీని వాయిదా వేశారని తెలిసింది."
    
    "ఎందుకు వాయిదా వేశారని నే నడగడం లేదు."
    
    తత్తరపడిపోయాడు. వీసీ ప్రతి వాక్యాన్నీ బుల్లెట్ లా సంధిస్తూంది ప్రబంధ.
    
    "యూనివర్శిటీ ప్రొఫెసర్స్ అన్నాక తప్పనిసరిగా కాస్త నైతిక విలువల్ని పాటించాలి."
    
    ఈ వాక్యానికి అర్ధం బోధపడలేదు వీసీకి. అయినా సమర్ధించాడు. "మరేం... లేకపోతే విద్యార్ధులకి మార్గదర్శకులు కాలేరు."
    
    "ప్రొఫెసర్ రాధాకృష్ణ చాలా అవినీతిపరుడు."
    
    కంగుతిన్నాడు వీసీ.
    
    "అసలు క్విజ్ మాస్టర్ గా మీరు అతన్ని నియమించాల్సింది కాదు."
    
    "అసలు..." ఒక విద్యార్ధిని ఒంటరిగా ఓ ప్రొఫెసర్ పైన అభియోగాన్ని లేవనెత్తుతూంది. అదీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు. "ఏం తప్పు చేశాడో చెబితే..."
    
    "అతనికి వైస్ ఛాన్సలర్ కావాలన్న ఆలోచన గట్టిగా వుందని సౌదామిని చెప్పింది మననం చేసుకుంటూ గడగడా మాట్లాదేసింది. "అందుకు మా డాడీని కాకా పట్టాలనుకున్నారు. కాబట్టి చివరి బిట్ క్వశ్చన్సు అడిగేటప్పుడు నేను గెలవాలన్న ఆలోచనతో తాను పక్షపాతాన్ని ప్రదర్శించారు."
    
    "కాని గెలిచింది నువ్వేగా?"
    
    "నేను కోరేది అలాంటి గెలుపు కాదు."
    
    వీసీకి చూచాయగా ఈ విషయం ముందే తెలిసింది. కాని రిటైర్మెంట్ కి ముందు కొరివితో తల గోక్కోవడం ఎందుకని తెలియనట్టు నటిస్తున్నాడు. రెండ్రోజుల క్రితం హోంమినిస్టర్ పద్మనాభంగారు స్వయంగా ఫోన్ చేసి ఈ విషయం మాట్లాడినా లోతుగా వెళితే ముఖ్యమంత్రిగారికి కోప కారణ మవుతుందని ఏం చేయాలో తెలీక తాత్సారం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రబంధ కూడా అదే విషయం గురించి చర్చిస్తూంది.
    
    అయితే ఓ సమస్య తీరిపోయినట్టు రిలీఫ్ పొందాడు వీసీ సరాసరి వచ్చి నిలదీసింది సీఎం కూతురే కాబట్టి ఆ పోటీ చెల్లదని రద్దుచేసినా ఇక గొడవలేదు.
    
    "అలాగా ప్రబంధా! ఎంత పనిచేశారు!" అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించి "అయితే పోటీ చెల్లదని రద్దు చేస్తాను. మళ్ళీ నిర్వహిస్తాను" అన్నాడు.
    
    "అది మాత్రమే చాలదు వీసీ గారూ! ఇకముందు మరే ప్రొఫెసర్ ఇలామ్టి పిచ్చిపని చేయకుండా గుణపాఠం చెప్పాలి. అందుకు ఓ కమీషన్ వేసి ప్రొఫెసర్ రాధాకృష్ణపైన ఎంక్వయిరీ ప్రారంభించాలి. తప్పదు! లేదూ అంటే మా డాడీచేత అలాంటి ఏర్పాటు చేయిస్తాను."
    
    "వద్దు మిస్ ప్రబంధా!" ఈసారి నిజంగా కంగారుపడ్డాడు. "ఇంత చిన్న విషయం మీ డాడీదాకా వెళ్లడమెందుకు? నేను ఎంక్వయిరీ కమిటీని వేసి తీరుతాను. కాబట్టి నువ్వు ఆవేశపడకు."
    
    ఆమె వచ్చిన పని అయినట్టు వెనక్కి మరలబోతుంటే ద్వారందాకా వచ్చి వీ.సీ. ఆమెను అభినందిస్తున్నట్టుగా అన్నాడు "పోటీలో గెలిచి కూడా నువ్విలాంటి ప్రయత్నానికి పూనుకున్నావూ అంటే నువ్వో ఆణిముత్యానివి ప్రబంధా! నీలాంటి స్టూడెంటు ఉన్నందుకు ఈ యూనివర్సిటీ ప్రతిష్ట పెరిగింది."
    
    ఆ మాటలతో ప్రబంధ అహం చల్లారటమే కాదు, సౌదామిని చెప్పినట్టు చిన్న అలజడి రేపినందుకు చాలా సంతోషపడిపోయింది.
    
    మధ్యాహ్నానికల్లా వీ సీ. నోటీస్ పంపించాడు అన్ని కాలేజీలకి.
    
    యూనివర్శిటీ మెయిన్ నోటీస్ బోర్డులో డిస్ ప్లే చేసిన వార్తతో నిజంగానే అదో సంచలనంలా విద్యార్ధుల్లోకి వ్యాపించింది.
    
    సూరి బృందం ఎంతో సంబరపడటమేగాక, దీనికి ముఖ్యకారణం ప్రబంధ అని తెలుసుకుని ఆమెను వ్యక్తిగతంగా అభినందించారు కూడా.
    
    నిజమే, విద్యార్ధుల్లో ప్రబంధ ఇమేజ్ పెరిగిపోయింది. ప్రతి మంచి పనికీ పర్యవసానం ఎలావుండేదీ ఆమె తెలుసుకోవటం కాదుగాని, సౌదామినిలాంటి అద్భుతమైన గైడ్ తనకు దొరికినందుకు చాలా గర్వపడి పోయింది.
    
    అయితే, అందరికన్నా ఎక్కువ కలవరపడిన శౌరి ముందు చెల్లిని అనుమానించలేక సరాసరి ప్రొఫెసర్ రాధాకృష్ణ దగ్గరకు వెళ్ళాడు.
    
    అప్పటికే రాధాకృష్ణ వీ.సీ హెచ్చరికని వినడమే గాక, త్వరలో తనపైన ఓ ఎంక్వయిరీ కమిటీని వేస్తున్నందుకు చాలా అశాంతితో నలిగిపోతున్నాడు కూడా.
    
    "చివరికి మీచెల్లెలు ఇంత పనిచేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను శౌరీ! ఏం ఆశించి ఈ పనికి పూనుకుందో నాకు అర్ధంకాలేదు" ఆనందు కలవరపడుతూ.
    
    ఆ సాయంకాలం చేల్లిపైన విరుచుకుపడ్డాడు శౌరి- "నీకేమన్నా పిచ్చి పట్టిందా?" అంటూ.
    
    "ఇలాంటి గెలుపు నాకు అక్కర్లేదు."
    
    "అలా గెలిచానని ఎందుకనుకుంటున్నావు?"
    
    "మొన్న రాత్రి నువ్వూ, సుధీర్ మాట్లాడుకుంటున్న మాటలతోనే ఆ విషయం నాకు అర్దమైపోయింది."
    
    "అందుకని నన్ను... నన్ను కాదు ఆ ప్రొఫెసర్ ని అందరిముందూ వెధవాయిని చేస్తావా?" అన్నాడు తొట్రుపాటుతో.
    
    "అన్నయ్యా!" మొండిగా చెప్పింది ప్రబంధ- "నేను జీవితంలో కోరుకునేది ఏదైనా నాకు నేనుగా సాధించాలనుకోవాలనుకుంటాను తప్ప రికమండేషన్ తో కాదు సో! ఇక ఆ విషయం మరిచిపో..."
    
    "అదికాదే..."
    
    "గుర్తుందా అన్నయ్యా? నేను తొలిరోజు సూరితో వాగ్యుద్దానికి దిగింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురిగానే అంతా సాధిస్తున్నానని అతడన్నాడనేగా? ఇప్పుడు నువ్వు నీ ప్రయత్నంతో నన్ను గెలిపించి ఆ మాట నిజం చేశావు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS