Previous Page Next Page 
రామాయణము పేజి 41

               

                                                             లక్ష్మణుని మూర్ఛ
    రావణునకు తటాలున తొలినాటి విషయము జ్ఞప్తికి వచ్చింది. "నిన్నటి దినమున మరణించిన వానరులను బ్రతికించుకొనుటకు రాముడు  హనుమంతుని ద్రోణగిరికి పంపినాడు.  తమ్ముని  బ్రతికించుకొనుటకు రాముడు నేడు కూడ హనుమంతుని ఆ కొండకు పంపును. హనుమంతుని ప్రయాణమునకు ఆటంకమును కలిగించవలెను".
    బ్రహ్మాస్త్రము వలన  కూలిన లక్ష్మలాది వానరుల తిరిగి  బ్రతికి నారనియూ ఇంద్రజిత్తు ప్రయత్నమా విధముగా నిష్పలమైన దనియూ తెలిసికొన్న రావణుడు విచారించినాడు. అతని  కారాత్రి దుస్వప్నములతో నిండిన కలత నిద్రయే ప్రాప్తించినది.
    మరునాటి ఉదయమున నాతడు దైర్యమును కూడదీసికొని హతశేషులైన యోధులతో రణ భూమికి పోయి  అభిముఖమున మొహరింపబడియున్న రాముని అపార సేనాసముద్రమును పరికించినాడు. అందొక  చోట లక్ష్మణుని  ప్రక్కనున్న  తన అనుజుడు విభీషణుడు కనిపించినాడు. రావణుడు అగ్రహముతో "ఈ భ్రాతృద్రోహిని బ్రతుకనిచ్చినచో వీని వలన నాకూనూ నావారికినీ లంకాపురికినీ చేటు కలుగును. నా పట్టమహిషి మండోదరి తండ్రియూ నాకు మామయూ అగు  మహాభాగుడు మయుడు  ప్రసాదించిన ఆయుధము  మహా శక్తిమంతమగు శక్తి- ఇప్పుడు  నావద్ద ఉన్నది. ఆ శక్తిని ప్రయోగించి ఈ భ్రాతృద్రోహిని అంతమొందించెదణు!'
    రావణుడా శక్తిని విభీషణుని మీదకు విసరినాడు. లక్ష్మణుడు దానిని చూచినాడు. అతడు "శ్రీ రాముడు  ఈ రాక్షసోత్తమునకు కలుగకుండ చూచుట నా విధి అనుకొనుచు ముందుకుపోయి  విభీషణున కడ్డముగా నిలిచినాడు.
    రావణుడు ప్రయోగించిన శక్తి అత్యంత  రయమున  వచ్చి  లక్ష్మణునకు తగిలినది. లక్ష్మణుడు  మూర్చిల్లుచు నేలపై పడినాడు. శ్రీ రాముడు పరుగు పరుగున వచ్చి విగత జివునివలె కన్పట్టుచున్న అనుజుని శిరమును తన  ఒడియందుంచుకొని విలపించ సాగినాడు. "నేను అయోధ్యకు తిరిగిపోయి జనని సుమిత్రాదేవిని చూడబోయినప్పుడా పూజ్యురాలు  'నా బిడ్డ లక్ష్మణుడేడి?' యని అడుగగా ఏమని  జావాబు నివ్వగలను? కైకేయి తన వరములో నిన్ను  వనవాసము చేయవలెనని అడుగలేదు కదా? నీవు  వచ్చుట ఎందులకు?' అన్న విన్నావు కావు! పదునాలుగేండ్రు నిద్రయూ, సరియైన ఆహారమునూ  లేకుండ నాకు సేవ చేసినావు. నిన్ను నేను  నేడు కాపాడుకొనలేకపోయినాణు!".... సుగ్రీవుని మేనమామ  సుషేణుడను వానర శ్రేష్ఠుడు శ్రీ రాముని ముందు నిలిచి "రామాప్రభూ దుఃఖించకుము. దుఃఖము బుద్దిని పనిచేయనీయదు. ఆపద యందు దైర్యమును చిక్కబట్టుకొని తక్షణ కర్తవ్యమును నిర్ణయించుకోనవలెను... నిన్నటి దినమున బ్రహ్మాస్త్రముచే ప్రాణావశిష్టులైన వనచర సమూహమును రక్షించుకొనుటకు ఓషధులను తెమ్మని హనుమంతుని ద్రోణగిరికి పంపగా ఆ మహాబలుడు గిరినే పెకలించి తెచ్చినాడు. జాంబవంతుడు తనకు కావలసిన యోషధులను తీసికొన్న పిమ్మట వాయుపుత్రుడా గిరిని తీసికొని పోయి యథాస్ధానమున అమర్చి వచ్చినాడు. ఆ అద్రియందె 'మృత సంజీవని' యను యోషధి యున్నది. సమయము మించిపోకుండ  వేగవంతుడగు హనుమంతుడినే ఆ కొండకు మరల పంపి ఆ యోషధి రాజమును రప్పించుము. నేను దానిని ఉపయోగించి చికిత్స చేసి లక్ష్మణస్వామిని మూర్ఛ నుండి తేఱుకొన జేసెదను" అన్నాడు.
    శ్రీరాముడు హనుమంతుని రప్పించి విషయమంతయు వివరించినాడు. హనుమంతుడు "రామప్రభూ ధైర్యమును చిక్కబట్టుకొనుము. నేనిదే ద్రోణ గిరికి పోవుచున్నాను" అని ఎగిరి ఆకాశ మార్గమున గిరి వైపు పోయినాడు. తాను ప్రయోగించిన ఆయుధము లక్ష్మణుని కూల్చినదన్న వార్త రావణునకు శ్రవణానందకరమైనది. "తమ్ముడు మరణించెనన్న దిగులుతో నున్న రాముని నేను నేటి యుద్ధములో సులభముగా వధించగలను. సుగ్రీవునకింక సమర మందాసక్తియుండదు".
    రావణునకు తటాలున తొలినాటి విషయము జ్ఞప్తికి వచ్చినది. "నిన్నటి దినమున మరణించిన వానరులను బ్రతికించుకొనుటకు రాముడు హనుమంతుని ద్రోణగిరికి పంపినాడు. తమ్ముని బ్రతికించుకొనుటకు రాముడు హనుమంతుని ద్రోణగిరికి పంపినాడు. తమ్ముని బ్రతికించుకొనుటకు రాముడు నేడు కూడ హనుమంతుని ఆ కొండకు పంపును. హనుమంతుని ప్రయాణమునకు ఆటంకమును కలిగించవలెను".
    ఆ సంకల్పముతో రావణుడు తన సైన్యమును తన కుమారుడు అతికాయున కప్పగించి తాను 'కాలనేమి'యను యనుచరుని వద్దకు పోయినాడు. విషయ మంతనూ వివరించి "కాలనేమీ, నీ తెలివినీ, మాయలను ప్రయోగించి హనుమంతుడా కొండను చేరుకొనకుండ చూడవలెను" అని ఆదేశించినాడు.
    కాలనేమి: దానవేంద్రా తెలివిమంతుడగు హనుమంతుని ముందు ణా ఆటలు సాగవు. నేను రామ కార్యమున కడ్డుతగులు చుంటినని గ్రహించుటతోనే అతడు నన్నంత మొందించును.
    రావణుడు: (ఆగ్రహముతో) నా మాటను పాటించనిచో ఇప్పుడు నేనే నిన్ను అంతమొందించెదను!
    కాలనేమి: (తనలో) ఈ దురాత్ముడు మున్ను మారీచుని యెడలనిట్లే ప్రవర్తించినాడు! వీనిచే చచ్చుటకన్న హనుమంతుని చేతి మరణమె మేలు (రావణునితో) ప్రభూ, ఆగ్రహము వలదు. ప్రాణములపై 'తీపిని వదలి మీ యిచ్చానుసారమే చేసెదను...నేనీక్షణముననె పోయి ద్రోణగిరి మార్గమును చేరుకొందును. రావణుడు సంతోషించి రణభూమికి తిరిగి పోయినాడు. కాలనేమి ద్రోణాద్రికి పోవు పథమున నొక చోట విశాలమగు ఒక ఆరామమునూ అందొక ఆశ్రమమునూ కల్పించినాడు. తన దానవ రూపమును వదలి మునిగా మారినాడు. పద్మాసనమున కూర్చొని ధ్యానమును నటించుచు హనుమంతుని రాకకై నిరీక్షించినాడు.
    హనుమంతుడేగుదెంచి "నిన్నటి దినమున నిక్కడ నేనీ ఆరామమును కాని ఆశ్రమమును కాని చూడలేదు. నేను నేను దారిని తప్పిపోలేడు కద!" అనుకొనుచు నాతడు ఆశ్రమమును ప్రవేశించి కవట మునికి నమస్కరించి "మహాత్మా దాహముగా నున్నది. సమీపమున సరోవరమున్నచో దారిని తెలుపుడు' అని కోరినాడు. కపట ముని తన కమండలమును విషపూరితమగు జలముతో నింపితెచ్చి ఈ మధుర జలమును గ్రోలి నీ పిపాసను తీర్చుకొనుము" అన్నాడు. హనుమంతుడు "స్వామీ నాకీ నీరు చాలదు. కొలనుకు మార్గమును తెలుపుడు" అన్నాడు. కపట ముని ఒక శిష్యుని కల్పించి "వత్సా వటవృక్షము చెంతగల సరస్సునకీ కపిశ్రేష్ఠుని కొనిపొమ్ము" అని ఆదేశించినాడు.
    మారుతి తటాకమును ప్రవేశించి జలమును గ్రోలుచుండగా అందుగల ఆడు మొసలి అతని పట్టుకొని భక్షించబోయినది, వాయుపుత్రుడు తన బలమైన హస్తములతో ఆ మకరము నోటి డిప్పలను రెంటినీ దొరకపుచ్చుకొని దాని శరీరమును నిలువునా చీల్చివైచి ప్రాణములను పోగొట్టినాడు.
    మకరి దేహము నుండి ఒక గంధర్వ సుందరి వెలువడి "ప్లవంగ పుంగవా నేను శాపము వలన మొసలినై ఈ తటాకమున బడితిని. నేడు నీ యనుగ్రహము వలన నాకు శాపవిముక్తి కలిగినది... నిన్నీ కొలనునకు పంపినవాడు మునికాడు. నిన్ను మకరిచే కబళింపచేయ దలచిన కాలనేమి యను రాక్షసుడు. నీవు ద్రోణాద్రిని చేరకుండ విఘ్నమును కలిగించుమని రావణుడు వీనినాదేశించి పంపినాడు" అని చెప్పినది.
    ...పిమ్మట ఆమె హనుమంతుని వద్ద వీడ్కోలును పొంది పోయి తన లోకమును చేరుకొన్నది.
    వాయుపుత్రుడు వాయువేగమున నెగిరివచ్చి ముని వేషధారి ముందు వ్రాలినాడు. వేషధారి "కపిశ్రేష్ఠా ఆలస్యమైనదేమి? నేను దివ్యదృష్టినంతయూ తెలిసికొన్నాను. నీవు మృతసంజీవని కొరకు ద్రోణగిరి వరకును పోనక్కరలేదు. నేను నీకొక మంత్రమును పదేశించెదను. దానిని పఠించి ప్రార్ధించినచో అద్రియే నీకాయోషధి రాజమును పంపును, నీవు ఉపదేశమును పొంది నాకు గురుదక్షిణను సమర్పించి ఇచ్చట నుండియే తిరిగిపోవచ్చును" అన్నాడు. హనుమంతుడు "కాలనేమీ ఉపదేశమును పొందకుండగనె దక్షిణ నర్పించెదను, గైకొనుము!" అని తన ముష్ఠిఘాతములతో వాని తలను వ్రయ్యలు కావించి ప్రాణములను పోగొట్టినాడు. కాలనేమి రావణునితో వచించినట్లే జరిగినది.
    హనుమంతుడు 'ఆలస్యమైనది!' అనుకొనుచు ఇనుమడించిన వేగముతో పోయి ద్రోణాద్రిని చేరుకొన్నాడు. ఓషధి నన్వేషించుటకు ఆగక తొలినాడు వలెనే అద్రిని హస్తమందుంచుకొని రణభూమికి తిరిగివచ్చి సుషేణుని ముందుంచినాడు. సుషేణుడు కొండను చొరబడి మృతసంజీవనిని దొరకబుచ్చుకొని లక్ష్మణుడు మూర్చిల్లియున్న చోటునకు పోయి చికిత్సను చేసినాడు. లక్ష్మణుడు నిద్ర నుండి మేల్కొనిన వానివలె లేచి కూర్చున్నాడు. శ్రీరాముడు 'మారుతీ, నీ ఋణమును తీర్చుకొనలేను" అని కృతజ్ఞతను తెలుపుచూ కౌగిలించుకొన్నాడు. సుషేణునకు పునః పునఃధన్యవాదములు తెలిపినాడు. హనుమంతుడు ద్రోణగిరిని యథాస్థానమున నిలిపి తిరిగి వచ్చినాడు.

    పిమ్మట శ్రీరాముడు విభీషణునితో "మిత్రమా లక్ష్మణుడు నీరసము నుండి పూర్తిగా కోలుకొను వరకునూ నీవిచటనే యుండి కాపాడవలెనని కోరుచున్నాను. నేను పోయి రణరంగమున యుద్ధమునకు సందిద్ధుడై నిలిచియున్న రావణుని ఎదుర్కొనవలెను" అని చెప్పి దానవేంద్రునకు అభిముఖుడై పోయినాడు. లక్ష్మణుడు బ్రతికెనన్న యానందము శ్రీరాముని యందు ఉత్సాహమును ఇనుమడించ జేసినది.
    హనుమంతుడు ద్రోణగిరితో తిరిగివచ్చుట గమనించిన రావణుడు "కాలనేమి కృతార్ధుడు కాలేదని తెల్లమగుచున్నది. వాయుపుత్రుడు వానిని వధించియే యుండును. నేనొక స్వామిభక్తి పరాయణుని కోల్పోయినాను!" అని దిగులుచెందినాడు. ధానుష్కుడై సమీపించుచున్న శ్రీరాముని చూచినాడు. "నేడీ నరుని పోరున సంహరించెదను"
    నాడు జరిగిన రామ రావణ సంగ్రామము భయంకరముగ నున్నది. రాముడు రావణుని ఆయుధములను మార్గమధ్యముననె తృంచినాడు. రావణుని యందలసట గోచరించినది.
    శ్రీరాముడు: (మెచ్చుకొనుచు) దానవేంద్రా, నీ సమర విద్యానైపుణ్యము ప్రశంసనీయముగా నున్నది! కాని నీయందిప్పుడు అలయిక కనబడుచున్నది. నేడు పోయి విశ్రమించి రేపు రమ్ము.
    రావణుడు సిగ్గుతో తలవంచుకొని రణరంగము నుండి నిష్క్రమించినాడు. "ఈ రాముడు నరుడు కాడా? దానవవైరియగు నారాయణుడె మానవ రూపమున అవతరించెనని చెప్పుకొనుచున్నారు. నిజమేనా?"... రావణుడు సంశయాత్ముడై కలతను చెందినాడు. "నేను నా వరమున నరులను వానరులను చేర్చక ఏల వదలినాను?"
                        *         *          *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS