Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 40

    "అవునమ్మా పగలు పదిగంటల సమయం! ఈ కాలం పిల్లలకి హుషారొస్తే వేళాపాళ ఏమీ ఉండవు" అంటూ సుమిత్ర వంక చూసిందామె.

    "అమ్మాయి దగ్గర అవుతోంది. వింటే బావుండదు. ఊరుకో" అందావిడ.

    సుమిత్ర వారి మాటలు విని చాల సంతోషించింది.

    తన కూతురు నిర్లక్ష్యం చేయబడిన భార్య అనిపించుకోవటం ఆమెకు ఎంతో బాధాకరమయిన సంగతి! దుఃఖకరమయిన వార్త అది!

    ఇప్పుడు వారు అనుకుంటున్న మాటలు తనకి కావాలి!

    గాయత్రి వారి దగ్గరగా వచ్చింది.

    "పెళ్ళి అయింతరువాత అమ్మాయికి లక్ష్మీ కళ వచ్చింది" అంది ప పుణ్యస్త్రీ!

    "కాకముందు ఎలా ఉందేమిటి?" అని ప్రశ్నించింది సుమిత్ర. వాస్తవానికి పొగడ్తకోసం ఒక మాట అని ఇలా ఇరుకున పడిపోతానని లక్ష్మీకళ గురించి మాటాడిన ఆవిడ అనుకోలేదు. ఈ మాటతో ఇరుకున పడిపోయింది.

    కాని రవంత అయినా వెనుకడుగు వేయలేదు.

    "పెళ్ళి కాకముందు రతీదేవిలా ఉండేది" అంది.

    ఆ పొగడ్తలు సుమిత్రకు ఊరట కలిగించాయి!

    గాయత్రి నేలమీద ముత్తయిదువుల మధ్య కూర్చుంది. సుమిత్ర ఒక్కర్తే సోఫామీద ఉంది. మిగిలిన వారంతా తివాచిపరచి కూర్చున్నారు.

    వారితోపాటుగా కలిసిపోయి కూర్చుంది.

    "అలా సోఫాలో కూర్చో తల్లీ" అంది ఒకావిడ.

    "మీ ఆశీస్సుల కోసం వచ్చాను. మీ మధ్యనే కూర్చుంటాను" అంది గాయత్రి.

    వినయ విధేయతలు నిండిన ఆ కంఠస్వరం ఆ సమాధానం యిచ్చే తీరు ఆ మాట చెప్పే ఒద్దికా పుణ్య వనితలకు బాగా నచ్చాయి.

    ఒకరు నగలు సవరించారు. ఒకరు ముంగురులు సవరించారు.

    "బొట్టు చెదిరిపోయిందేమిటమ్మా?" అని మరొకరు పరామర్శించారు.

    అన్నింటికి చిరునవ్వులు సమాధానాలుగా అందిస్తూ కూర్చుంది గాయత్రి!

    "దానికేం భాగ్యం తల్లీ! ఈ డాక్టర్లు హాస్పటల్స్ పెరిగి ఇప్పుడు అంతా మర్చిపోయారు, కాని పూర్వం నా చిన్నతనంలో పిల్లలకోసం క్రొత్తగా పెళ్ళయిన వధువులు అందరూ ఇలాంటి వ్రతాలు నోచేవారు.

    ఇప్పుడా ఆచారమే కన్పించట్లేదు ఎక్కడా?

    పిల్లలు ఎక్కువ అయినా డాక్టర్ల దగ్గరకు పరుగు తీయటం.

    పిల్లలు తక్కువయినా డాక్టర్ల దగ్గరకు పరుగు తీయటం.

    చిత్రమయిన కాలం వచ్చింది. శ్రద్ధగా ఈ నోము నోచుకుంటే డాక్టర్లతో పనేముంటుంది?? అందావిడ!

    "ఈ మాటలు చాదస్తం" అని కొందరు అనుకున్నారు.

    "ఈవిడ చెప్తోంది నిజమే!" అని మరికొందరు అనుకున్నారు.

    నోము నోచుకున్నందువల్ల పుణ్యమే కాని నష్టం ఏముంటుంది అని అందరూ అనుకున్నారు. డాక్టర్లు పరీక్షించటం అవసరమయిన చర్యలు తీసుకోవటం అనివార్యం అయినా వాటి దారి వాటిది. ఈ నోములదారి వీటిదే. అని అనుకొంది సుమిత్ర.

    కొద్దిసేపు చర్చలు చేశాక సంతానలక్ష్మి నోము నోయించాలి అని తీర్మానించారు.

    ఎలా చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం వెతుకుతున్నారు.

    ముందుగా లక్ష్మీదేవి రూపుతో ప్రారంభించి ఆ తరువాత అట్టహాసంగా ఆడంబరంగా చేసే కార్యక్రమంగా అది రూపు దిద్దుకుంది.

    ఇంటిముందు పందిళ్ళు వేయించారు. ప్రతిరోజు పూజలు వ్రతాల దగ్గర కూర్చుని దానాలు అవీ పట్టేందుకు వచ్చిన ముత్తయిదువులకు అక్కడే బస ఏర్పాటు చేశారు.

    సుమిత్ర ఏ కార్యక్రమం చేపట్టినా అది భారీగా ఉంటుంది. ఎక్కడా రాజీపడకుండా ఆదర్శవంతంగా చేస్తారు. అది చూసేందుకు చాలామంది వస్తున్నారు.

    వాల్మీకి ఆ ఇంటిలో ఒక శిశువు పారాడే వరకూ ఆడవాళ్ళ ఇద్దరికి శాంతి ఉండదని వారిద్దరూ ఇలాగే ఏవో ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేపడుతుంటారని గ్రహించాడు. ఈ అయిదు రోజులు తనని ఇంటిపట్టున ఉండవలసిందిగా కోరటంలో సుమిత్రాదేవిగారి అంతర్యం ఏమిటో అతనికి అర్ధమయింది.

    గాయత్రిని అనుక్షణం పీడించటం ప్రారంభించాడు.

    స్టోర్ రూంకి వెళ్ళాలంటే వారి గది ముందునించే వెళ్ళాలి.

    ఉదయం ఆరు గంటలనించి సాయంత్రం ఎనిమిది గంటలవరకూ పూజలు ముత్తయిదువుల హడావుడిలో తిరుగుతోంది గాయత్రి! అలసిపోయి గదిలోకి వస్తుంది. అతడామెను కవ్వించి లాలించి ముద్దు మురిపాలు ప్రదర్శించి ఎన్ని చేసినా పదిగంటలు దాటే వేళకు నిద్ర ముంచు కొచ్చేస్తోంది.

    పగటిపూట చిన్న చిన్న కార్యక్రమాలు ఏవయినా ఉంటే పట్నం వెళ్ళి చూచుకు రావాలనుకున్నాడు మొదట. కాని వారి మనసులు గ్రహించి అటువంటి ప్రయత్నం మానుకున్నాడు. అతని మనసు మారింది.

    కార్యక్రమాలు మారాయి. ఆలోచనలు ఏపు మీదికి వచ్చాయి.

    పనులు హడావిడిలో తిరుగుతూ స్టోర్ రూంలోకి కాని మరో పనిమీద కాని గాయత్రి ఆ వైపుకి వస్తే చెంగుపట్టి లాగేయటం మొదలెట్టాడు.

    ఏ సమయం కాని సమయంలో కాలంకాని కాలంలో కూడా అతడలా లాగేయటాన్ని గమనించింది వర్ధని. తలుపులు బోల్టులు బిగించి ఉండటాన్ని కూడా గమనించింది.

    "అమ్మగారూ! అబ్బాయిగారికి పగలు రాత్రి అనే భేదంలేదు. గాయత్రిగారు చాలా అదృష్టవంతులు అనుకోవచ్చు" అని సుమిత్రకి ఉప్పు అందించింది.

    సుమిత్ర ఈ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ చాలా సంతోషించింది. అలాంటి శుభతరుణం ఈ యింటిలో జరగాలనే ఆమె కోరిక.

    ఇదిగో అక్షంతలు మరల వస్తానని పూజలోంచి లేచి వెళ్ళిన  గాయత్రి కోసం ఎదురు చూస్తుంటారు పుణ్యస్త్రీలు. చాలా సేపటి తరువాత మళ్ళీ తలంటు పోసుకుని చీర మార్చుకుని తయారవుతుంది గాయత్రి.

    "అక్షతలు కలిపి తీసుకువస్తానని పోయావు. ఇంతసేపు ఏం చేస్తున్నావమ్మా!" అని అడుగుతారు ముత్తయిదువలు! వారికి ఏవో సమాధానాలు చెబుతుంది.

    గాయత్రికి అవసరమయినప్పుడయినా అబద్ధాలు చెప్పటం ఎదుటి వాళ్ళ నోరు క్షణాలమీద మూయించటం అలవాటు ఉండదు. ఆమని చలాకీతనం ఆమెకు లేదు. అబద్ధాలు కల్పించటంలో తొట్రు పడుతుంది.

    ముత్తయిదువలు చెవులు కొరుక్కుంటారు, ఏవో చెప్పుకుంటారు.

    "మళ్ళీ పూజలు మొదలు అవుతాయి. కొంతసేపటికి ఆ వయిపుగా పోక తప్పదు. వాల్మీకి గదిలోకి లాగేయటమూ తప్పదు.

    పనులు పరిస్థితులు అలా కలిసి రాకపోతే గుబులు ఎత్తినట్లుగా ఏదో ఒక పని మిష కల్పించుకుని మరీ మేడ మీదికి పరుగుతీస్తుంది గాయత్రి. పనివాళ్ళ చేత చేయించుకోవలసిన పని కూడా వారికి చెప్పదు తనే పరుగు తీస్తుంది.

    వేటగాడు వలపెట్టుకుని మాటు వేసిన విధంగా ఉంటాడు వాల్మీకి.

    గాయత్రి ఆ వయిపున కన్పిస్తే చాలు! ఆహ్వానిస్తాడు.

    ఆరడి పెడతాడు, బ్రతిమాలుకుంటుంది. వినడు! కార్యక్రమం యధావిధిగా కొనసాగవలసిందే! ఆమెకుకూడా అది యిష్టమే! ఆడపిల్ల గాయత్రి మీద అడ్డంకులు పెట్టింది. అది కూడ కుంటి సాకులు.

    ఈ విధంగా ఒక పండుగలా నాలుగు రోజులు గడిచాయి.

    "ఈరోజు ఫాం హౌస్ కి వెడదాం" అన్నాడు వాల్మీకి.

    "దొరగారికి మనసు అలా పోయిందేం?" అంది గాయత్రి.

    "నీకు అభ్యంతరం అయితే వొద్దులే."

    "మీ వెంట ఫాంహౌస్ లో ఒకరోజు గడిపేందుకు నాకు అభ్యంతరం ఏమిటి? అమ్మగారితో చెప్పి వెళ్ళిపోదాం" సుమిత్ర అనుమతి యిచ్చింది సంతోషంగా.

    "ఫాంహౌస్ కి వారు వెళ్ళిన తరువాత ఏదో పనిమీద వర్ధనిని అక్కడకు పంపించింది. ఆమె తిరిగి వచ్చాక చాలా విశేషాలు చెప్పింది.

    ఫాంహౌస్ గాయత్రి, వాల్మీకిలకి బృందావనం అయింది.

    అక్కడ కూడ వారు సాగించింది రాసక్రీడలే!

    "అమ్మగారూ! వాల్మీకిగారి ఫాంహౌస్ లో క్రొత్తగా ఏర్పాగా ఏర్పాటు చేయించిన ఫౌంటెన్ లు నీరు ఎంత ఎత్తుకు చిమ్ముతున్నాయండి! పక్కన ఉంటే తుంపరలు మీద కూడా పడుతున్నాయి. గార్డెన్ కి మంచి కళ కూడ వచ్చింది.

    అల్లుడుగారు అమ్మాయిగారు అక్కడుంటే బృందావనంలో రాధాకృష్ణులు ఉన్నట్లుగా అనిపిస్తోందండి! అక్కడే మరికొంతకాలం ఉంటే ఎంత బాగుంటుందో కదా" అని అభివర్ణించింది వర్ధిని.

    మగవాళ్ళకి బృందావనాలు అప్పుడప్పుడు గుర్తుకురాక మానవు. కాని వాళ్ళకి అక్కడే కాలు కుదురుతుందా? మగవాళ్ళకి కాళ్ళలో చక్రాలుంటాయట. మతుల్లో చాపల్యం ఉంటుందట. నిలకడగా గావించుకుంటారు.

    చిన్నతనం ఆటలన్నీ మరచి బృందావనాన్ని గోపికలకి వదిలేసి కృష్ణుడంతటివాడు మధురకు వెళ్ళాడు. అక్కడ వారందరిని వదిలేసి అష్ట భార్యలతో ద్వారకలో కాపురం పెట్టాడు. అది చాలదని నరకాసురుణ్ణి వేధించి అతని చెరలో ఉన్న పదహారు వేలమందిని యాదవ రాజ్యానికి తీసుకువచ్చాడు. ఆ కధలన్నీ వివరించేది ఏమిటనుకున్నావు!

    మగవాడి మనసునే అంది సుమిత్ర నవ్వుతూ.

    అమ్మగారిలాగే అంటూ ఉంటారు కానిఅంతటి ఆనందంలో ఓలలాడుతున్న దంపతులు ఫాంహౌస్ ని విడిచి అప్పుడే ఎందుకు వస్తారు అనుకుంది వర్ధిని!

    కాని ఆమె మాటలు నిజం కాలేదు.

    సుమిత్రగారి మాటలే యదార్ధం అయినాయి.

    ఉదయమే జీపులో ఒంటరిగా తిరిగి వచ్చింది గాయత్రి!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS