Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 40



    అవి నీకు లేకపోతే నీదో ప్రత్యేకమైన జాతిగా భావిస్తాను.

     నన్నెక్కడనించి తీసుకొచ్చావో అక్కడ విడిచిపెట్టు.

     లేకపోతే ఈ రాయితో నీ కారు అద్దాలన్నీ పగలకొడతాను.

    అవసరం అనుకొంటే నీ బుర్ర కూడా పగల కొట్టడానికి వెనుకాడను."

     ఆమె ఉద్రేకంతో అంటుంటే ప్రశాంత్ కి అనుమానం వచ్చింది.

     ఆమె పిచ్చిదేమోననే అనుమానం కలిగింది.

     ఆమె మొహంలోకి చూస్తుంటే ఆమె నిజంగానే అన్నంత పని చేస్తుందేమో ననిపిస్తుంది.

     అతనిలో ఏదో గగుర్పాటు.

     "ఓ. కే. కారెక్కు." అన్నాడు.

     విజయ కారెక్కి కూర్చుంది.

     "ఓ.కే. మిస్టర్ ప్రశాంత్. నన్నింకేం మాట్లాడించకు.

     నన్ను ఎర్రమంజిల్ దగ్గర దించేయ్ చాలు" అంది. ప్రశాంత్ కోపంగా చూసి కారుని ముందుకి ఉరికించాడు.
                 21
    "యూ ఆర్ కరెక్ట్ అంకుల్.
     ప్రశాంత్ నేను అనుకొన్నట్టు అభిమానించదగిన వ్యక్తి కాదు."అంది విజయ.

     డి. డి. ఆర్. చిన్నగా మందహాసం చేశాడు.

     "నువ్వు కొంచెం తొందరపడ్డావు బేబీ!

     మరి కాస్త ముందుకి వెళితే ఆ రాస్కెల్ బోగట్టా మొత్తం మనకి తెలిసేది!" అన్నాడు డి. డి. ఆర్.

     "ఆ మిగిలిన విషయాలని నేను తెలుసుకొంటచాను బావగారు" అన్నాడు రంగారావు. అతని గొంతులో ఓ విధమైన పట్టుదల.

     "వాడు ఇంటికి తీసుకెళ్తాడనుకొన్నాను. కానీ నేషనల్ హైవే దారి పట్టాడు. దాంతో నేను భయపడ్డాను" అంది విజయ.

     "భయం దేనికమ్మా! నీ వెనక నేను లేనా? వందగజాలదూరంలో మోటార్ సైకిల్ పైన కారుని ఫాలో చేస్తూనే వున్నాను కదా!" అన్నాడు రంగారావు.

     "నిజమే మామయ్య, కానీ పొరపాటున 'మిస్' అయితే" అంది సందేహంగా విజయ.

     "అవ్వను. నీడలా వాడిని వెంటాడడమే ధ్యేయంగా పెట్టుకొన్నాను.

     వాడికి మనశ్సాంతి లేకుండా చేయడం ఎలా అనే ఆలోచిస్తున్నాను."

     కఠినంగా అన్నాడు రంగారావు.

     "ఇంతకీ ఆ అమ్మాయి ఎలా వుంది?" అడిగాడు. డి. డి. ఆర్.

     "కోలుకొంటోంది. నేను కొంచెం ఆలస్యం చేస్తే భారతి రైలు చక్రాలకింద తునాతునకలై పోయేది పూర్ గర్ల్.
 
     మై గాడ్స్ గ్రేస్ ఐ సేవ్ డ్ హర్" ఆ రోజు  భారతిని తను ఎలా కాపాడగలిగింది గుర్తుకొచ్చింది.

                       22

     రంగారావు అనుమానంతో బారతిని ఫాలో చేశాడు.

     ఆమె ప్రశాంత్ వుంటున్న అపార్ట్ మెంట్స్ కాంప్లెక్స్ లోకి వెళ్లగానే సందు చివర నిలబడ్డాడు.

     తిరిగి భారతి రాకకోసం ఎదురు చూడసాగాడు.

     గంటన్నర తర్వాత భారతి ఏడుస్తూ రోడ్డుమీద పరుగులాంటి నడకతో వెళ్లడం చూశాడు. ఆమె వెనకే రెండు నిమిషాలకి కంగారుగా మరో అమ్మాయి రోడ్డుమీదకి వచ్చింది.

     ఆ అమ్మాయి అటు ఇటూ చూస్తూ రంగారావుని పలకరించింది.

     "ఇప్పుడే ఓ అమ్మాయి బయటికి వచ్చింది. ఎటువేపు  వెళ్లిందో చూశారా?" అడిగింది.
 
    "చూశాను భారతి గురించేనా నువ్వు అడుగుతోంది?" అన్నాడు రంగారావు.

     ఆమె కళ్లు పెద్దవి చేసి చూసిందతని వైపు.

     "అవును. భారతి మీకెలా తెలుసు!"

    "ఆమె నాకు కావాల్సిన మనిషి. "

     "ఐసీ. అయితే ఆమెని మనం కాపాడాలి. లేకపోతే ఆమె ఆత్మ హత్య చేసుకొనే ప్రమాదం వుంది" అంది కంగారుగా.

    రంగారావు బాంబుపడినట్లు ఉలిక్కిపడ్డాడు.

    "అని మీకెలా తెలుసు?"

    "ప్లీజ్. అవన్నీ తర్వాత చెపుతాను. ముందు పదండి" ఆమె అతని చేయిపట్టి లాగింది.

     ఆమె దగ్గర విస్కీవాసన వస్తోంది.

     అడగు వేయలేకపోతోంది.

     తూలిపోతోంది.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS