Previous Page Next Page 
పరిహారం పేజి 40


    "అబ్బ! నీదుత్త పాపిష్టి మనసే, ఛాయా!" విసుగు వ్యక్తం చేసింది రజని." అందంగా ఉన్నంత మాత్రాన సంబంధాలు ఏర్పడవు! అది వాళ్ళవాళ్ళ సంస్కారాన్ని బట్టి వుంటుంది.
                                                                               15
    కోమలమ్మ చెప్పిన పని చెయ్యడం, పనిలేనప్పుడు తరగతి పుస్తకాలు చదువుకోవడం పారిజాతకు రోజులు యాంత్రికంగా  దొర్లిపోతున్నాయి. ఒక్కపని విషయంలో తప్ప మిగతా విషయాలలో దయగానే చూస్తుంది కోమలమ్మ. వేళకు తిన్నావా అని కనుక్కోవడం, ఏమిటో చిక్కిపోతున్నావు, లేనిపోని బెంగపెట్టుకోకు హాయిగా చదువుకో అంటూ ప్రేమ వ్యక్తపరుస్తూ వుంటుంది.
    పారిజాతను కోమలమ్మ చేరదీయడం మహా ఆశ్చర్య కరమైన సంగతి. ఆ కాంపౌండులో కాపురాలుండేవాళ్ళందరికీ పారిజాత మనోహర్ ప్రేమించుకున్నారని. కోమలమ్మ కారణంగానే వాళ్ళు పెళ్ళిచేసుకోలేకపోయారని ఈ సంగతి గురించి వాళ్ళంతా కథలుగా చెప్పుకుంటూంటారు. ఏమైనా కోమలమ్మ తెలివితక్కువది కాదు. ఏదో గొప్పయెత్తు తోటే పారిజాతను తన దగ్గరుంచుకొంది. ఆ ఎత్తు ఏమిటో వాళ్ళ అంచనాకు అందడంలేదు.
    పారిజాత తెల్లవారుజామున్నే లేచి గేదెల షెడ్డు శుభ్రం చేయడం గేదెలకు కుడితీ మేతా చూడడం చేస్తూండేది మొదట్లో. ఒక రోజు మరొకపనికూడా అప్పగించింది.ఆ పిల్లకు కోమలమ్మ. సూరమ్మ అనే ఆవిడ పాలుపితికి పాలు కొనేవాళ్ళకు పోసివచ్చేది. ఈ మధ్య ఆవిడ పాలలో నీళ్ళు ఎక్కువగా కలిపి, ఎక్కువగా కలిపిననీళ్ళకు వచ్చే డబ్బులు ఆవిడ తీసుకొంటున్నట్టు తెలిసింది కోమలమ్మకు. వెంటనే సూరమ్మను పనిలోంచి తీసివేసి, ఆ పని పారిజాతకు అప్పగించింది. పాల బిందెలు గంపలో పెట్టుకొని అలా ఇంటింటికీ తిరిగి పాలు పోసి రావడమంటే మొదట్లో కష్టంగా ఉండేది పారిజాతకు. నెమ్మదిగా అలవాటైంది.
    ఈ మధ్య పారిజాతలో చాలామార్పు వచ్చేసింది. ఇదివరకు స్నేహితులుగావున్న వాళ్ళతోకూడా మాట్లాడడం మానేసింది. నవ్వు సంతోషం అనేవి మచ్చుకైనా కనిపించడంలేదు ఆపిల్లలో, ఎలాగో ఈ స్కూల్ ఫైనల్ పరీక్ష పాసై ఎక్కడో ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకొని వెళ్ళిపోవాలన్న ఆశ దేనికైనా ఓర్చుకుపోయే సహనాన్నీ, పట్టుదలనూ నేర్పింది.
    ఒకరోజు పారిజాత పాలుపోయడానికి వెళ్ళి ఏడుస్తూ తిరిగి వచ్చింది.
    "ఏమిటే? ఏం జరిగింది?" కోమలమ్మ ప్రశ్నించింది.
    "ఇంకేపని అయినా చెప్పు. అత్తా! రేపటినుండి నేను పాలు తీసుకెళ్ళను"
    "ఏమైంది!"
    "రత్నప్రసాద్ వాళ్ళింట్లో ఆయన భార్య పురిటికి పుట్టింటికి పోయింది. ఆవిడవచ్చేదాకా ఆవిడలేనిలోటు తీర్చమంటూ ప్రసాద్ గారు తలుపుమూసి మీదపడొచ్చాడు."
    "ఒసే పారూ! నేనో మాట చెబుతాను వింటావా?"
    "చెప్పత్తా!"
    "భగవంతుడు నీ కింత అందం పెట్టి నీ కెన్ని కష్టాలు పెట్టాడు. ఇహ లాభంలేదే! ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరిగా బ్రతకవలసిన దానివి కావు. ఏదో ఉద్యోగం సంపాదించుకొని నీ కాళ్ళమీద నువ్వు నిలబడాలని తాపత్రయ పడుతున్నావు. కాని, నిన్ను అలా బ్రతకనివ్వదు పాడు లోకం, నిన్నూ నీ అందాన్ని రక్షఇంచుకోడానికి నీకు భర్త అనే వాడు ఉండక తప్పదు. లోగడ రంగనాధం తన కొడుక్కు నిన్ను చేసుకొంటానని మీ నాన్నను అడిగినట్లు నాకు తెలిసింది. నువ్వప్పుడు ఎందుకు ఒప్పుకోలేదో కూడా నాకు తెలుసు?"
    పారిజాత ముఖం వెలవెల బోయింది. ఆమె మనసు విప్పి మాట్లాడుతోందో, ఇదొక ఎత్తుతో మాట్లాడుతోందో తెలియలేదు.
    "నేను రంగనాధాన్ని పిలిచి మాట్లాడనా?"
    "ఏం మాట్లాడతావత్తా!"
    "నిన్ను గిరిధర్ కు చేసుకొనే సంగతి గురించి! చెప్పు మాట్లాడనా?"
    "............................."
    "ఒప్పుకో, పారూ! మొదట్లో నువ్వంటే అంతులేని ద్వేషంగా ఉండేది. మనూ నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసి నప్పుడు నేను పడిన బాధ, నువ్వంటే కలిగిన కసి అంతా ఇంతా కాదు, ఇప్పుడు నీ అమాయకమైన ముఖం, నీ వినయం చూస్తుంటే నిన్ను అన్యాయం చేశానన్న బాద నా హృదయాన్ని తొలుస్తూంది. మనూకి నేననుకొన్న దాని కంటే మంచి సంబంధమే కుదిరి ఒకింటివాడు అవుతున్నాడు. నువ్వుకూడా ఒకింటి దానివైతే నేను నిన్ను అన్యాయం చేశానన్న బాధనుండి విముక్తి దొరుకుతుంది. ఓ వెయ్యిపదిహేను వందలు పెట్టి నేనే నా చేతుల మీదుగా పెళ్ళి జరిపిస్తాను. ఈ విదంగా నీకు నేను చేసిన ద్రోహానికి పరిహారం చెల్లించనీ!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS