Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 40


    "ఆ తల్లికి మొదటినుండీ కష్టాలే. ఎన్నడు సుఖపడింది పాపం? పిల్లలు కలుగలేదని కొన్నాళ్ళు కనిపించిన రాయికల్లా మొక్కింది. అదొక ఘోష. కన్నకొడుకు చేతికి రాకుండాపోయి అదొక ఏడుపు. ఆఖరికి పసుపు కుంకుమలు కూడా దోచాడు భగవంతుడు. ప్చ్! పగవారికి కూడా రారాదమ్మా ఈ కష్టాలు!"

    చూడవచ్చిన వారిలో సానుభూతి వాక్యాలు.

    అదేమిటో, భర్త కళేబరం వద్ద శిలలా కూర్చొంది కృష్ణవేణి. ఏడుపు లేదు, కంట నీరులేదు. గాజుకళ్ళతో ఇహ లోకానికి అతీతమైన పతిదేవుల ముఖంలోకి చూస్తున్నది.

    చూడవచ్చిన వారికి విడ్డూరమైంది.

    ఆ నిశ్చలమూర్తి వెనుక ఏదైనా విప్లవం రేగుతున్నదేమో? దేవదాసి ఉలిక్కిపడి అత్త భుజాలు పట్టి కుదిపింది. "అత్తా!"

    మేనకోడలి వక్షానికి ఆనుకొని కళ్ళు మూసుకొంది కృష్ణవేణి.

    మూసిన కనురెప్పల వెనుక ఏవో దృశ్యాలు, సంఘటనలు కదలిపోతున్నాయి.

    తన అత్తగారికంటే మామగారు ముందు పోయారు. పార్వతీదేవిలా కళకళలాడే అత్తయ్య వైధవ్యం పొందింది.

    ముక్కున బేసరి, చెవులకు ఎర్రరాళ్ళ దుద్దులు మాటీలు, మెడ తిరగకుండా నగలు. అన్నింటా కొట్టొచ్చినట్లు కనబడేనుదుట వెడల్పాటి కుంకుమబొట్టు, కొప్పునిండా పువ్వులు చుట్టి ఆ నిండుముత్తయిదు దేవీమూర్తివలె గోచరించేది.

    భర్త చనిపోయిన పదవనాడు సువాసినీ చిహ్నాలు తొలగించారు ఆమెకు.

    "మీ ముందు వినయంగా మెడవంచి, మూడుముళ్ళు వేయించుకొని, మీ కష్టసుఖాలలో భాగస్వామినయ్యి ఇంతకాలం మీ చేయిపట్టుకు సాగాను. మీరిచ్చిన ప్రతిఫలం ఏమిటి? యింత నిర్భాగ్యపు బ్రతుకునా? మీరే నేనయ్యి జీవించానే? నన్నిలావిడిచి వెళ్ళడానికి మీ మనస్సెలా ఒప్పింది? మిమ్మల్ని విడిచి నేనుండగలననే? అది నా వల్ల అయ్యేపనా? నాకెవరున్నారని? ఏ ఆశతో జీవించను? ఉహుఁ, నేనుండలేను, అనుకొన్నది కృష్ణవేణి. మూసిన కనురెప్పల క్రిందనుండి అశృవులు స్రవిస్తున్నాయి. ఎండిన పెదవులు అదేపనిగా కంపిస్తున్నాయి.

    తెల తెలవారుతున్నది.

    క్రితంరోజే వచ్చిన శ్రీలక్ష్మి. సూర్యదేవులు తమ ఇంటి ఆడపడుచుకు సంభవించిన దుఃఖంచూచి కుములుతున్నారు. ఓ ప్రక్క, సూర్యదేవులు మనసు కుదుటపరుచుకొంటూ అన్నారు.

    "ఇక శవసంస్కారానికి ప్రయత్నాలు చేయవద్దూ? గోవిందస్వామీ, తలా ఓ దిక్కు పంపించవయ్యా! శవాన్ని ఎంతసేపు పెట్టుకు కూర్చుంటాం?"

    "మీ బావను పంపించేయాలని అంత తొందరగా ఉందా సూర్యుడు?" గొల్లుమంది కృష్ణవేణి.

    సూర్యదేవులు నోట్లో ఉత్తరీయం కుక్కుకొన్నారు.

    మెల్లగాలేచి తూలుతూనే రెండడుగులు వేసింది కృష్ణవేణి.

    "అత్తయ్య పెరట్లోకి వెడుతుందేమో? వెంట వెళ్ళు, దేవతా" శ్రీలక్ష్మి చెప్పింది దేవదాసితో.

    "వద్దు నాతో ఎవరూవద్దు నా గదిలో ఏకాంతంగా కొద్దిసేపు కూర్చోనివ్వండి, కొద్దిసేపు?" లేచి అనుసరించబోయిన దేవదాసిని వారించి, వెళ్ళిపోయింది కృష్ణవేణి.

    "ఇక కొద్ది క్షణాల్లో భర్త భౌతికకాయం దూరమైపోతుంది. ఈసమయంలో ఏకాంతాన్ని అభిలషిస్తున్నదంటే అర్ధమేమిటి?" అనుమానం కొందరికి వచ్చిందేకాని రాత్రినుండి నిద్రలేమిచే వారిబుర్రలు చురుకుగా పనిచేయలేదు.

    ఇంటిముందు అంతా సిద్ధమై ఇక శవాన్ని లేపేదే అన్న సమయంలో, సూర్యదేవులు "అక్కను పిలవండి" అన్నారు.
    శ్రీలక్ష్మి వెళ్ళి తలుపులు తట్టింది. "వదినా, ఇకరావూ చివరి చూపులకు?" అన్నది దుఃఖస్వరాన.

    లోపలినుండి జవాబు లేదు. లోపల గడియపెట్టివుంది. అప్పుడు తెలిసివచ్చింది ఆమెను వంటరిగా వదిలి తామెందుకు మందబుద్ధులయ్యారో? "లోపల ఏమి అఘాయిత్యం తలపెట్టలేదుకదా!"

    గాబరాగా కేకపెట్టింది శ్రీలక్ష్మి. "వదిన ఏదో కొంపముంచుతున్నట్లుంది లోపల -  రండి రండి!"

    రాత్రినుండీ శవం దగ్గరే ఉండిపోయిన అందరూ పరుగు పరుగున వచ్చారు. ఎవరు పిలిచినా తలుపులు తెరుచుకోలేదు. గునపాలు, గొడ్డళ్ళు క్షణాలలో వచ్చాయి. తలుపులు విరిగిపడ్డాయి.

    లోపల ఎటువంటి భీభత్సభయానక దృశ్యం?

    "అక్కా, ఎంతపని చేశావు?"

    "వదినా. ఇంత సాహసం చేస్తావనుకోలేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS