Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 40


    "అదెలా? సంసారమే ఓ ఆటా పాటా అని ఎలా అనుకొంటారు?" అతడి ధోరణికి విస్తుపోతున్నట్టుగా అంది.

    "అంటే సంసారాన్నే ఓ సంగీతంగా మలుచుకోవాలని అర్దం!"

    "నేను సంగీతం నేర్చుకోవద్దనే కదా మీ మాటల అర్దం!"

    "ఇప్పుడు నువ్వు సంగీతం నేర్చుకొని ఏం చేయాలి? కచ్చేరీలు చేస్తావా?"

    "అంత ప్రావీణ్యాన్ని సంపాదించుకొన్న రోజుకచేరీలు చేస్తాను. ఏ విద్య అయినా నేర్చుకొనేది ప్రదర్శించడానికి కాకపోతే ఇంకెందుకు?"

    "ఈ రోజు సంగీత కచేరీలు చేస్తానంటావు! రేపు డాన్సు ప్రోగ్రాములిస్తానంటావు? వద్దంటే తప్పేమిటంటావు! సంసార పక్షం వాళ్లం కదా!  ఈ పాటలూ ఈ  ఆటలూ ఎందుకు చెప్పు! పెళ్లి కాకముందు మీవాల్లు ఏదో ముచ్చటపడి ఏదో నేర్పించారనుకో. ఇప్పుడూ ఒకరికి భార్యవై కూడా రంగస్థలమెక్కి రాగాలు తీస్తాను, ఎగురుతాను, కులుకుతాను అంటే ఎలా?"

    వాడి శూలంతో గ్రుచ్చినట్టుగా గాయపడింది హరిత మనసు. తను కాపురానికి వచ్చిన మర్నాడు తన డాన్సు ప్రోగ్రాముల ఆల్బం అతడి చేతికిచ్చింది చూడమని. అతడిలో ఏమీ ఉత్సాహం వ్యక్తం కాలేదు. ఏదో యధాలాపంగా తిరగ వేశాడు తప్ప. ఎంత రసహీనహృదయం కాకపోతే  సంగీతమంటే రాగాలు తీయడంగా, డాన్సు అంటే ఎగరడం  కులకడంగా  కనిపిస్తుంది!

    "ఛీ ఛీ! మీతో ఇక మాట్లాడాలంటేనే అసహ్యమేస్తుంది! చివ్వున లేచి నిలబడింది హరిత "కాని, సంగీత మంటే మీ కిష్టంలేదన్నారని పతివ్రతలా మానేస్తానని అనుకోకండి! రేపటి నుంచి సంగీతం నేర్చుకోడానికి వెడతాను!"

    "పతివ్రతను  కాను అని గర్వంగా చెప్పుకోవడం ఫాషన్ కాబోలు ఈనాటి ఆడవాళ్ళకు! అయితే నిన్ను పతిత అనుకోవచ్చా?"అతడు చుర్రుమన్నట్టుగా అన్నాడు.

    "పతితనూ, పతివ్రతనూ రెండూ కాదు! స్త్రీని! ఒక మనసూ, అభిరుచీ, ఆశయాలు గల స్త్రీని."
    "ఓహో!"

     "పాడడటం మీకిష్టలేదంటే మానేయాలి! ఆడటం మీకిష్టంలేదంటే మానేయాలి! ఊపిరి పీల్చుకోవడం మీకిష్టంలేదంటే మానేయాలి! మరీ అంత అస్వతంత్రమైన జీవితాన్ని నేను ఛస్తే భరించలేను!"

    "మరి ఇంత ఇష్టారాజ్యంగా తిరుగుతానంటే నేనూ భరించలేను! నేనేం గాజులు తొడుక్కోలేదు!"

    "భార్య మనసును అర్దం చేసుకోవడం ఆమె ఇష్టాల్ని కోరికల్ని గాజులు తొడుక్కోవడం కాదండీ! భార్యా భర్తల మధ్య వుండాల్సిన ఒక సదవగాహనకు అదిగుర్తు."

    "భార్యను మాత్రమే భర్త అర్దంచేసుకోవాలా? భర్తను, భార్య అర్దంచేసుకోవద్దా? భర్త ఇష్టాల్ని అభిరుచిని గౌరవించవద్దా భార్య?"

    "భార్య మీ అనుమతి లేకుండా ఊపిరిపీల్చుకోవడం ఇష్టం వుండదు మీకు! మీ కిష్టంలేదని నేను ఊపిరి పీల్చుకోవడం మానెయ్యాలా? సంగీతమంటే  రాగాలు తీయడంగా, డాన్సు అంటే గంతులూ, కులుకులుగా భావించే మీ అభిరుచిని గొప్ప అభిరుచి అని గౌరవించాలా? ఏమిటండీ, గౌరవించేదీ, అర్దంచేసుకొనేది?"

    "భార్య  అంటే నాకూ ఉన్నాయి కొన్ని కలలు! అనుకూలవతి, చక్కగా ఇల్లుదిద్దుకొనేది కావాలి. అంతే కాని, స్టేజీలెక్కి తైతక్కలాడేది కాకూడదు! అంత ఆటా పాటా మీద మక్కువున్నదానివి అసలు పెళ్లే చేసుకోకుండా వుండాల్సింది! నన్నెందుకు కట్టుకొన్నావు. నా జీవితంలో నరకం ఎందుకు సృష్టించాలనుకొంటున్నావు?"

    మొగుణ్ని కొట్టి మొగసాలకెక్కినట్టుగా వున్న అతడి ధోరణి చూసి విస్తుపోయింది హరిత. "మీ జీవితంలో నేను నరకం సృష్టిస్తున్నానా?"

    "నాకిష్టంలేని పనులు చేస్తే నా జీవితంలో నరకం సృష్టించడంకాదా?"

    "ఎంతసేపు మీ ఇష్టమేగాని, నా ఇష్టం చూడరా?"

    "నీ ఇష్టా నీ తల్లిదండ్రుల దగ్గర సాగాయిగాని భర్త దగ్గర కూడా సాగాలంటే ఎలా? ఒక్కగానొక్క బిడ్డ వని నీ తల్లిదండ్రులు నిన్ను ముద్దుచేసి పెంచారు. అదే ముద్దు, అదే గారాబం ఇక్కడ కూడా కావాలంటే ఎలా? గృహిణిగా నీకు కొన్ని బాధ్యతలున్నాయి! అవి విస్మరించకు!" సీరియస్ గా అన్నాడు కమలాకర్.

    "బాధ్యతలు గుర్తించనంతటి మూర్ఖురాలినేం కాదు. కాని, నాలోని కళాత్మక ప్రతిభను పొడిచి చంపేసే మీ అహంకారాన్ని మాత్రం సహించలేను! సంగీతం కంటే  నాట్యం నాకు ప్రాణం? ప్రాణమైనా వదులుతానుగాని డాన్సు వదలను!"

    ఈ సంఘటన తరువాత రెండురోజుల వరకు ఇద్దరూ ఎడముఖం పెడముఖం గా వున్నారు. హరిత మనసు చేదుతిన్నట్టుగా వుంది. వైవిహిక జీవితాన్ని గురించి తనెన్ని కలలుకంది! తననూ,  తనలోని కళాత్మక ప్రతిభనూ అపురూపంగా చూచుకొనే భర్త!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS