Previous Page Next Page 
కావేరి పేజి 40

   
                               18

    "ఇం నేను ఈ ఎత్తు బూట్ల మీద నడవలేను!" అంటూ రోడ్లమీద వచ్చిన తర్వాత నిలబడి పోయింది కావేరి.

    అవి లేకపోతే నువ్వు వేసుకున్న పంజాబీ డ్రస్ కే అందం లేదు. ఏ నిర్మాత కళ్ళల్లోనూ పడలేవు." అన్నాడు మాధవరావు.

    "ఇంకా ఎంత మందిని కలవాలి?" అసహయమ్గా అడిగింది.

    "నువ్వు పెద్ద హీరోయిన్ గా ఈ సినీ ఫీల్డులో నిలబడేటంతవరకు కష్టపడాలి! రేపు షూటింగ్ లవీ చూడాలి! నీ కంత కష్టంగా వుంటే నిర్మాతలనే నీ దగ్గరకు రమ్మనమని చెప్పుతానులే!"

    "వస్తారా?..." ఆశగా అడిగింది.

    "ఆఁ నువ్వు రమ్మంటేను!"

    "అలా అయితే మరీ సుఖం కదూ?"

    "ఆ...అంతా సుఖమే! కాని వారు చెప్పినట్టు యాక్టు చేయాలి! రమ్మన్న చోటికి వెళ్ళాలి ప్రముఖ తారలు నటించేతప్పుడు చూడాలి!....డైరెక్టర్ వారికెలాంటి సూచనలు యిస్తున్నాడో వారెలా గమనించుతున్నారో అర్ధం చేసుకోవాలి!"

    "అలాగే!...ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలి?"

    "కేలాయుధం అని ఓ నిర్మాత వున్నారు. ఆయనకీ స్టూడియో కూడా వుంది. ఆయన తీసిన పన్నెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. పదమూడవ సినిమా కొత్త తారలతో తీయాలని ఆలోచించుతున్నట్టు తెలిసింది. ఆయన్ని కలిస్తే నీ పని పూర్తి అయినట్లే."

    కావేరి ఏం మాట్లాడలేదు. రెండురోజుల నుంచీ తిరగని స్టూడియో లేదు. కలవని నిర్మాత లేరు! అందరికీ తనను గురించి అతిశయోక్తులు కలిపి చెప్పి పరిచయం చేయటమే మాధవరావు పని అయింది. అందరూ తనవంక ఎగాదిగా చూడటం, ఒకరినొకరు చెప్పుకోవటం! కళ్ళజోడు అలవాటు లేకపోవటం వలన పెట్టుకుంటే చాలు! చెమట్లు పడుతున్నవి. అస్తమానూ తీయటం తుడుచుకోవటం చేస్తున్నది. అలా చేయటం చూస్తుంటే మాధవరావుకి కోపంగా వున్నా ఏమీ అనలేక పోతున్నాడు. 

    ఎందుకంటే కావేరీని విసుక్కోకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటేనే తనకీ ప్రతీఫలం వుండేది...ట్రంకు పెట్టెలో నుంచి డబ్బు తియ్యలేక తీస్తుంది....అందులో ఏమయినా వున్నదేమో చూద్దామని అంటే తాళం వేసి ఆ తాళం చెవి తన గోలుసుకి పెట్టుకుంటున్నది. ఒక్కసారే అంటే తనని నమ్మదు. నమ్మించాలంటే యింకా కొన్ని రోజులు గడవాలి!

    టాక్సీని పిలిచాడు.

    కాళీ టాక్సీ వచ్చి వారు నిలబడిన పేవ్ మెంటు దగ్గిరగా వచ్చి ఆగింది. వెళ్ళవలసిన చోట చెప్పి ముందు కావేరీని ఎక్కమని ఆ తరువాత తను ఎక్కాడు.

    టాక్సీ చాలా వీధులు తిరిగి, సందులు గొందులూ తిరిగి ఓ పెద్ద డాబా ముందు ఆగింది. డ్రైవర్ దిగి డోరు తెరిచాడు.

    ఇక్కడికి ఎందుకు?" అనుకుంటూనే క్రిందకు దిగి నలువైపులా పరిశీలించి చూడసాగింది.

    ఆ వీధి అంతా చిన్నా పెద్దా సైజు డాబాలు మేడలూను. వీధి కూడా పరిశుభ్రంగా వుంది. చాలా యిల్ల ముందు కార్లు నిలిపివున్నాయి. మరి కొన్ని కార్లు లోపలపెట్టి వున్నాయి. ఆ వీధిని చూస్తుంటే బహుశా నిర్మాత కేలాయుధం గారిని కలవటానికి వారింటికీ వస్తున్నామేమో? అనుకుంది.

    టాక్సీ ఫేర్ చెల్లించి ఒక యింటి గేటు ముందు నిలబడి గేతుని చప్పుడు చేశాడు మాధవరావు.

    కొంత వ్యవధి తరువాత ఒకామె తలుపులు తెరుచుకుని వచ్చి గేటుకి వేసి వున్న గడియ తీసి లోపలికి రమ్మన్నట్లుగా మాధవరావుని చిరునవ్వుతో ఆహ్వానించింది.

    కావేరి ఆమెను పరిశీలనగా చూసింది.

    ముప్పయి అయిదూ నలభై మధ్యలో వయస్సు వుంటుంది. తెల్లని శరీరఛాయ అయినా శరీరంమీద అక్కడక్కడ మచ్చలు, ఆ మచ్చలను అస్తవ్యస్తంగా కనిపించకుండా చేస్తున్న శరీరంలోని ముడతలు! గిరజాల జుట్టు, కాటుకతో నల్లబడి కమిలిపోయినట్లున్న కనురెప్పలు, కారాకిళ్ళీతో గారపట్టిన పళ్ళు, పంటిచిగుళ్ళు, నవ్వితే వికృతంగా కనిపించే ముఖం, మూసుకుపోయే కళ్ళు! మనిషి అంత ఎత్తుకాదు, అంత లావూకాదు!

    ఒకప్పుడు అందంలో ఆమెకి సాటిలేరేమో? అనిపించింది ఆమె శరీరఛాయ ఈ వయస్సులో కూడా తగ్గకపోవటంతో కావేరికి అనిపించింది.

    "ఈమె అమ్బుజం అని! ఒక విధంగా చెప్పాలంటే నాకు తల్లిలాంటిది!....నా బాగోగులు నిర్ణయించేది ఈమె!" అన్నాడు పరిచయం చేస్తూ మాధవరావు.

    "నమస్కారమమ్మా!" అంది చేతులు జోడించుతూ!

    "రామ్మా!...రా!...నీ గురించి మా బాబు చెప్పి తెగ యిది అయిపోయాడు. మా బాబువర్ణించినట్టే వున్నావు!....నీ కోసమనే ఈ యిల్లు అద్దెకు తీసుకున్నాము. చూద్దువుగాని!"

    అంటూ యిద్దరినీ లోపలికి తీసుకెళ్ళింది అంబుజం!

    విశాలమయిన హాలుని, రెండు పడకగదులున్నవి! ఎటాచ్డ్ బాత్ లు, అన్నింటికి గ్లాస్ డోర్సు-కిచెన్ కూడా చాలా పెద్దది! కారు పెట్టుకునేటందుకు గారేజ్!...లోపల గదుల్లో షోకేసులు, సీలింగ్ ఫానులు' ట్యూబ్ లైటులు.

    ఎంత అందంగా వుంది?...పల్లెటూరిలో తమది ఎప్పుడో తాతలనాటి పెంకుటిల్లు! ఎక్కువ గాలి వేసినప్పుడంతా పైనుంచి దుమ్ము రాలుతూ వుండేది! గోడలన్నీ పగిలిపోయి సున్నం పెళ్ళయి రాలిపాడుతుంటాయి... ఈ డాబా ఎంత ఆధునీకంగావుందో? గోడలన్నీ సున్నం వేసి ఎంత నున్నగా వున్నాయో?

    తను గొప్ప హీరోయిన్ అయితే యింతకంటే పెద్దమేడ కాదుతుంది. తల్లి తండ్రులను వుంచుకోవాలి!

    "ఇల్లు నీకు నచ్చిందా?" అనడిగాడు మాధవరావు కావేరీని!

    "మనం వుండేటందుకా?"

    "అవును!...నువ్వు హీరోయిన్ గా అవ్వాలన్నా, నీకోసం నిర్మాతళు రావాలన్నా ఇలాంటి అందమయినఇల్లు, క్లాస్ లొకాలిటీలో వుండాలి అప్పుడే నీకు విలువ!"

    "అద్దెదా? మీ స్వంతమా?"

    "నాకు యిల్లెక్కడ వుంది? నీ కోసమని అద్దెకి తీసుకున్నాను!"

    "ఇంత ఇంటిలో నేను ఒక్కదాన్నే వుండగాలనా?"

    "నాతో తాళికట్టించుకున్నావుగా? ఎలా వుంటావు నన్ను వదిలి?"

    "ఓ! అవును! ఆ విషయం మరిచిపోయాను. అద్దె ఎంత?"

    "ఆ విషయం మాత్రం అడగవద్దు అది వింటే నువ్వు భరించలేవు! రేపటినుంచి ఇంగ్లీష్ ట్యూటర్ వస్తాడు. భరతనాట్యం నేర్పేందుకు డాన్సుమాస్టర్ వస్తాడు. నిన్ను కలవటానికి పత్రికా విలేఖరులు వస్తారు. అటూ తరువాత నిర్మాతలు, సహా నటీనటులు! అభిమానులు! నువ్వు పెద్ద తారవయిన తరువాత ఇంతకంటే పెద్దఇల్లు, రెండు అంతస్థుల మేడలోకి వెళ్ళటమో? లేక అలాంటి ఇల్లుని కొనుక్కోవటమో చేద్దాం!....నువ్వు ఒకతారగా నిలదొక్కుకునే వరకూ ఈ యింటిలోనే వుండాలి! నీలాగానే శాంతిశ్రీ కూడా ఈ ఇంటిలోనే వుండి ఇవ్వాళ గోప్పతార అయిపోయింది."

    "నిజం?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS