"ఆమె మా ఇంట్లోనే వుంది."
"మీ ఇంట్లోనా?"
"అవును! ఆమె ఎవరో కాదు...మా అమ్మ!" అని అపరాధినిలా తల వంచుకుంది ఇందిర.
జగన్నాథం, రవి చేష్టలుడిగి నిల్చుండిపోయారు.
"మరి ఇంతకాలంగా ఎందుకు చెప్పలేదు?" సందేహంగా అడిగాడు జగన్నాథం.
"నాకు తెలియదు ఈ విషయం రాత్రే తెలిసింది."
"ఎంత చల్లని వార్త చెప్పావు తల్లీ! ఒరే రవీ! పదరా ఊ! త్వరగా ముఖం కడుక్కుని వెళ్దాం!" జగన్నాథం సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ అన్నాడు.
"రవిని వెళ్ళనివ్వండి. మనం ఇక్కడే వుందాం! కారణాలు నన్ను అడగండి. వెళ్ళు రవీ! నువ్వు వెళ్ళి అమ్మకు కన్పించు. నిన్ను నూరేళ్ళు వర్ధిల్లమని దీవించిందిగా!" కంఠం ఏదో అపశ్రుతి పలికింది.
రవి ఓ క్షణం ఆలోచించి కారు తీసుకుని బయలుదేరాడు.
జగన్నాథం సంతోషంతో పసిపిల్లవాడిలా మాట్లాడేస్తున్నాడు. రవిని తను ఎలా పెంచిందీ చెబుతున్నాడు. ఇందిర మనస్సు మాత్రం తేలిగ్గా లేదు. ఆలోచిస్తూనే యాంత్రికంగా "ఊ" కొడుతూ వుంది.
కారు నడుపుతున్న రవికి అనేక ఆలోచనలు వచ్చాయి. అనేక సందేహాలు కలిగాయి.
ఆ మూడో వ్యక్తి ఇందిర తల్లా? ఇందిర తనను ఒంటరిగా వెళ్ళమనడానికి కారణం? ఇందిర ఉత్సాహంగా కూడా లేదు. ఇందిర ఈ కేసు చేస్తున్నట్టు తల్లికి తెలియదా? తెలిసీ తను రహస్యంగా ఎందుకు ఉండిపోయింది? ఏ కారణం చేతనో ఆమె ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్నట్టు బయటపెట్టడం ఇష్టంలేదు. పరువు తక్కువ అనుకుంటుందా? అయివుండదు. ఏదో బలమైన కారణమే ఉండివుండాలి. రాత్రి తనకు తల్లిని పరిచయం చేస్తానని ఇందిర లోపలకు వచ్చింది. కానీ ఆమె తన ముందుకు రాలేదు! అంటే తన ముందు పడటం ఆమెకు ఇష్టం లేదు. ఇందిర తనను ప్రేమిస్తోందని ఆమెకు తెలియదా? తెలిసే వుంటుంది. ఆమెకు బహుశా ఇందిరతో తన వివాహం ఇష్టం లేదేమో? అయివుండదు. ఏదో బలమైన కారణం వుండి వుండాలి.
31
కారు రాధాదేవి ఇంటిముందు ఆగింది. ఆ ఇంటి గడపలో కాలు పెడుతూ వుంటే రవి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. బెల్ నొక్కాడు. తలుపులు తెరుచుకున్నాయి. రవి రాధాదేవికి రెండు చేతులూ జోడించి నమస్కరించాడు.
రాధాదేవి రవిని చూసి బెదిరిపోయింది. తత్తరపాటు చెందింది.
"నమస్కారం అమ్మా. నన్ను గుర్తుపట్టలేదా?" అడిగాడు రవి వినయంగా.
"ఎవరు నువ్వు? నిన్నెప్పుడూ చూళ్ళేదే?" బలాన్ని కూడదీసుకుంటూ అన్నది రాధాదేవి.
ఆమె వైఖరి చూసి రవి తెల్లబోయాడు ఓ క్షణం.
"నేనమ్మా రవిని! ఆనాడు మీరు నన్ను దీవించారు."
"నిన్ను నేను దీవించడం ఏమిటి?"
"బాగా జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు సాయంత్రం మీరూ ఒక యువతీ యువకుల జంటా ఆ లేక్ ఒడ్డున..."
"నువ్వేమిటి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు."
"అదేనమ్మా! మీతో ఉన్న బేబీ బంతి ఆడుతూ బతికోసం పరిగెత్తి నీళ్ళలో పడిపోయింది. నేనూ మరో అమ్మాయి అదే సమయంలో ఆ లేక్ మధ్యలో బోటు షికారు చేస్తున్నాం. పిల్ల నీళ్ళలో పడటం చూసి నేను వెంటనే నీళ్ళలోకి దూకి ఆ అమ్మాయిని రక్షించాను. అప్పుడు మీరు నన్ను నూరేళ్ళు వర్థిల్లు అని దీవించారు."
"ఏయ్ అబ్బాయ్! నీకేమన్నా పిచ్చా! ఎవరితో మాట్లాడుతున్నావ్? ఏ లేక్? ఏ ఒడ్డు? బంతేమిటి పిల్లేమిటి? పైగా నిన్ను దీవించడం ఏమిటి?" పకపక నవ్వింది రాధాదేవి. ఆ నవ్వులో త్రాచుపాము బుసలు కొట్టడం విన్పించి రవి ఆశ్చర్యంగా ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో కసి తొంగి చూస్తూ వుంది.
"నాకేం తెలియదు వెళ్ళిపో" దాదాపు అరిచినట్టే అన్నది రాధాదేవి.
రవికి ఆమెతో వాదించడం అనవసరమని అర్థం అయింది. మర్చిపోయిన వాళ్ళకు జ్ఞాపకం చేయడం తేలిక. జ్ఞాపకం ఉండి మర్చిపోయినట్టు నటించే వాళ్ళకు చెప్పి ప్రయోజనం లేదు. నిద్రపోతున్నవాళ్ళను లేపవచ్చును. కాని, నిద్ర నటించేవాళ్ళను లేపటం ఎవరికి సాధ్యం? ఆమె కావాలనే తనను ఎరగనట్టు నటిస్తోంది. బహుశా ఇందిర తనను వివాహం చేసుకోవడం ఇష్టం వుండి వుండదు. అందుకే తనను ద్వేషిస్తూ వుంది.
రవి గిర్రున వెనక్కు తిరిగాడు.
రాధాదేవి అలా వెళ్ళిపోతున్న రవిని చూస్తూ నిల్చుంది. కళ్ళలో నీళ్ళు తిరిగింది.
"బాబూ! వెళ్ళకు" గొంతు వరకూ వచ్చిన మాటల్ని బయటపడకుండా కొంగు నోట్లో కుక్కుకొని లోపలకు పరుగు తీసింది రాధాదేవి.
భర్త ఫొటో ముందు నిల్చుంది. భర్త ముఖంలోకి దీక్షగా చూసింది.
ఆమె కళ్ళముందు గతం ముసుగుతీసి నగ్నంగా, వికృతంగా నాట్యం చేసింది. అదే దృశ్యం... అదే ఆర్తనాదం... అదే వికటాట్టహాసం!
"నిలబడతాను. నిలబడతాను. మరో రెండు రోజులు నాకు ఈ దారుణ మానసిక సంఘర్షణను ఎదుర్కొనే శక్తి ఇవ్వు. రెండురోజులు చాలు. రెండే రెండు రోజులు" అంటూ భర్త ఫొటోకు చేతులు జోడించి భోరున ఏడ్చింది రాధాదేవి.
