Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 40


    "తాతగారూ ఏమి జరిగింది?" ప్రశ్నించిందామె.
    "అమ్మా! కాలపేటికలో ఎన్నో అమోఘమైన విషయాలుంటాయి. ఒక్కొక్క విషయమూ బయట పడుతున్నప్పుడు చూచి మనం బెంబేలు పడిపోతూ వుంటాము. కాని, కాలాన్ని అర్థం చేసుకుని డానికి తలవంచటమే విజ్ఞులు చేయవలసిన పని" పెద్దయజ్వ గంభీరమైన ధోరణిలో చెప్పాడు.
    "తాతగారూ! మీరు చెప్పేది ఎవరి గురించి?"
    "కొండవీటి భవితవ్యాన్ని గురించి తల్లీ!"
    "కొండవీటికి ఏమైందిప్పుడు? పన్నెండు సంవత్సరాల బాలుణ్ని ఎదిరించే వీరులే లేకపోయినారా యీ కొండవీడులో!"
    "కొండవీడు పతనమైంది బాలిని వల్ల కాదమ్మా! అంతఃకలహాల వలన" అంటూ వివరించారాయన.
    "తాతగారూ! మీరంటున్నదేమిటి? కొండవీటి సామ్రాజ్యం పతనమైందా? రాచవేముడేమయ్యాడు? తండ్రిగారేమయ్యారు? సోమదేవుడు నవులూరు నుండి ఇంకా రాలేదా?" ఆమె పిచ్చెత్తిన దానిలా ప్రశ్నలవర్షం కురిపించసాగింది.
    అప్పుడు శ్రీనాథయ్య గొంతు సవరించుకుని మెల్లగా అన్నాడు. "నీవు చెప్పిన ఏ ఒక్కరూ ఇప్పుడు ఈ లోకంలో లేరు తల్లీ". ఈ మాట వింటూనే వేమాంబ మూర్చాగతురాలయింది. వారిద్దరూ ఆమెను తీసుకుని మూలగూరమ్మ దేవాలయానికి చేరారు. కొంతసేపటికి వేమకు స్పృహ వచ్చింది. ఎదురుగా మూలగూరమ్మ మూర్తి.
    ఆమె లేచి దేవికి నమస్కరించింది. పెద్దియజ్వకూ, శ్రీనాధయ్యకూ పాదాభివందనం చేసింది. వీరకల్లుకు అభిముఖంగా పోసాగింది.
    అక్కడ తాను దక్షిణాది సౌభద్రునికి వీడ్కోలిచ్చిన చోట రవ్వంతసేపు నిలచింది. ఆ మట్టి శిరస్సున వేసుకుని నేరుగా ఎత్తుగా ఆకాశంలోకి పొడుచుకుపోయిన కుచ్చెల బోడు" మీదికి ఎక్కసాగింది. కుచ్చెలబోడు యావత్తు కొండవీడులోని ఎత్తయిన శిఖరం. ఆమె దాన్ని అధిరోహించి పైకి చేరింది. పెద్దియజ్వా, శ్రీనాధయ్యా ఆమెను అనుసరించి వెళ్ళారు. అక్కడ నిర్మానుష్యంగా వున్నది.
    "తల్లీ నీవేమి చేయదలచావు?" చివరికెలాగో మాటలు కూడ తీసుకుని పెద్దియజ్వ ప్రశ్నించారు.
    "తాతగారూ" మీరేం చెప్పారు కదా! మనవాంఛలకూ, మన గతాలకూ అతీతమైన కాలం ఒకటి ఉన్నదని అది ఎలా చేస్తుందో దానికి తల వంచదలచాను."
    "ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా నీవేమి చేస్తానమ్మా! నేను ఎలాగొలా సన్యాసం స్వీకరించాను. నిన్ను నా ఆశ్రమంలో వుంచి కాపాడుకుంటాను రా తల్లి!" పెద్దియజ్వ ప్రార్థనా పూర్వకంగా అడిగారు. కొండవీటిరెడ్డి ప్రభువుల ఉప్పు పులుసు తిన్న విశ్వాసం ఆ వృద్ధ బాహ్మణుడి చేత అలా మాట్లాడిస్తున్నదని గ్రహించాడు శ్రీనాధయ్య.
    "తాతగారూ! దుఃఖభాజమైన ఈ జీవితాన్ని ఇంకా కొనసాగించటం అవసరమేనంటారా? అయినా నాకు తోడు లేదని మీరు బాధపడవద్దు. నా సోమదేవుడు ఎల్లప్పుడూ నా హృదయంలోనే వుంటాడు అన్నది." వీరిద్దరికీ ఏమి చేయాలో పాలుపోలేదు. ఆలోచించే సమయమూ లేదు.
    "ఆత్మహత్య మహాపాపం తల్లీ" శ్రీనాథయ్య వుండబట్టలేక అనేశాడు. ఆమె ఆ విషయాన్ని పట్టించుకున్నట్లుగా లేదు.
    ఒక ప్రదేశాన్ని చూచి అక్కడంతా పరిశుభ్రంగా చేసుకుంది. తూర్పు ముఖంగా తిరిగి పద్మాసనం వేసుకుని కూర్చుంది. అప్పుడామె ఈ జీవితంలో లాలనకూ, మనోగతాలకూ అతీతురాలైన మహాయోగినివలె కన్పించసాగింది.
    "అమ్మా! పెళ్ళిపీటల మీద కూర్చోవలసిన నీవు తపస్సమాధిలో కూర్చుంటున్నావు! యజ్వకన్నీరు పెట్టారు.
    "తాతగారూ" మీరు కన్నీరు పెట్టకండి. అది ఈ భరత ఖండానికే క్షేమకరం కాదు. మీరు తపోమూర్తులు నన్నాశీర్వదించండి. నాకు యోగమూ, తపస్సూ చేతకాక పోవచ్చు. వేను పుట్టుకతో స్త్రీని కావటం చేత భగవంతుడు నాకిచ్చిన వరాలు కొన్ని వున్నాయి. నేను నా సోమదేవుని మీద మనసు లగ్నం చేస్తున్నాను. ఆ మనసు ఇక వెనుదిరిగి చూడదు. నిద్ర ఆహారము, దాహమూ ఇక ఈ శరీరానికి అవసరమనిపించట్లేదు. ఇది జీర్దమై, శిధిలమై కొద్దిరోజులకే రాలిపోతుంది. మరో లోకమంటూ వున్నదా? అక్కడ నా సోమదేవుని ప్రేమ వెన్నెలలో విహరిస్తాను. లేదా! విధి నడిపే ఈ జీవితం నుండి విముక్తి పొందుతాను, నాకు అనుజ్ఞ ఇవ్వండి" అంటూ లేచి మరొకమారు వారి పాదాలకు ప్రణమిల్లింది. వారిరువురూ అశ్రువులతో ఆమెను అభినందించి వీడ్కోలిచ్చారు.
    ఆమె విచిత్ర తపోనిష్ఠురాలై లోకాన్ని విడిచింది.
    పెను దిరిగిన పెద్దియజ్వ శ్రీనాథయ్యకు ఒక పని అప్పగించాను. ఆయన ఎలాగూ సన్యాసించదలచారు.
    "శ్రీనాధయ్యా! నేను ఇక మానవ లోకంలో ఎవరి ముఖమూ చూడను. తక్షణమే సర్వమూ సన్యసించి అడవులకు వెళ్ళిపోతున్నాను. అవిగో కనిపిస్తున్నాయ్! గుహలు. అక్కడ నిద్రాహారాలు మాని నా తపస్సు కొనసాగిస్తాను. ఎప్పటికైనా వీలుపడితే ఈ కథ లోకానికి వెల్లడిస్తాను. కాని నీవు చేయవలసిన పని ఒకటి వున్నది సుమా! కొండవీటి రెడ్డి ప్రభువుల కథ యావత్తూ నందికంత పోతురాజు కఠారిలో వున్నది. దానిని భద్రం చెయ్యాలి. అది విరోధుల చేతిలో పడితే అవమానాల పాలౌతుంది. దానికి అవమానం జరిగితే రెడ్డిరాజుల చరిత్రకు కళంకం ఏర్పడినట్లే! కనుక నీవు దానిని తీసుకుని కొండవీటి శివారు గ్రామమైన ప్రత్తిపాడులో గండేశ్వరస్వామి ఆలయములో దాచు. ఆ పైన నీవు రాజశ్రయం పొందుతూ గొప్ప కవిత్వాన్ని వ్రాస్తూ సరస్వతికి సేవ చెయ్యి. ఈ రాజకీయాలలో పడి నీవు ఇప్పటికి ఎనిమిదేళ్ళుగా కవిత్వం మానివేశావు. ఇక ప్రారంభించు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS