Previous Page Next Page 
వైరం పేజి 40


    అతని వళ్ళంతా కళ్ళే!
    తొణకకుండా చిరుదరహాసంతో శృతితో మాట్లాడుతూనే వున్నాడు అతను.
    "యూ..." అని సునయన శాపనార్థాలు మొదలెట్టక ముందే వెనుదిరిగి ఆమెని చూసి నవ్వాడు అతను.
    "కమ్ సునయనా!" అన్నాడు ఆదరంగా.
    "మేం నిన్ను గురించి మాట్లాడుకుంటుంటే నువ్వు సరిగ్గా ఇదే క్షణంలో ఇక్కడ ప్రత్యక్షం కావడం చూస్తే... అతీతశక్తులు అనేవి అస్సలు ఉండనే ఉండవన్న నా మూఢనమ్మకం సడలిపోతోంది సునయనా! వెల్ కమ్ టూ ద గ్యాంగ్!"
    తిట్టబోయిన తిట్లన్నీ తిరుగుమొహం పట్టగా, ఎర్రబడిన మొహంతో చూసింది సునయన.
    ఏమంటున్నాడు ఇతను?
    "కమ్!" అని లేచి నిలుచుని ఆమెకి మర్యాద చేశాడు అభిరాం. "మీట్ మిస్ శృతి! నీలాగే దేశీ! సినీ కెరీర్ కి సంబంధించిన నీ కోరికలన్నీ శృతి ద్వారా 'శృతి' అవుతాయని నా నమ్మకం! కూర్చో సునయనా!"
    యాంత్రికంగా కూర్చుంది సునయన.
    శృతీ, సునయనా ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు అంచనా వేస్తున్నట్లు చూసుకున్నారు.
    వస్తున్న నవ్వుని పెదాల వెనక దాచుకుంది శృతి. కాస్త జాలిగా సునయన వంక చూసింది.
    బకరా! వెర్రిగొర్రె!
    ఈ ఛోక్రీ తమ ఫ్యూచర్ ప్లాన్ లో ఒక పావు అని ఈమె హోటల్లో ఎంటరవగానే తనతో చెప్పాడు అభిరాం. తనూ అతనూ ఒకటి. తమ గేమ్ ప్లాన్ లో ఈ పిల్ల ఒక పాచిక! అతను ఉప్పు అందించాడు. తను ఇంక అల్లుకుపోతుంది. తనకి పెద్ద పనేమీ లేదు. అతను ఆడమన్నట్లు ఆడితే చాలు. అంతే!
    అంతా అతనే చూసుకుంటాడు. దట్ సింపుల్!
    అభిరాం అన్నాడు.
    "ఏం! ఎంతవరకూ వచ్చాయి నీ హాలీవుడ్ ప్రయత్నాలు?"
    కొంచెం రోషంగా చూసింది సునయన.
    అప్పుడు పడింది సునయన దృష్టి.
    అటువైపే వస్తున్న హాలీవుడ్ కేస్టింగ్ డైరెక్టర్ మీద.
    వీడే కదా తనని రాత్రికి రమ్మనీ, 'బెస్టు బెడ్ ఆర్టిస్టు'ని చేస్తాననీ చెప్పింది.
    అభిరాం మాటలతో కాస్త చల్లబడుతున్న సునయనకి రక్తం మళ్ళీ సలసల మరగడం మొదలయినట్లయింది.
    ఇప్పుడు మళ్ళీ ఏదయినా వల్గర్ ప్రపోజల్ పెట్టాడో - చెంప ఛెళ్ళుమనిపిస్తుంది తను! తప్పదు!
    ఒక్క మాట బయటికి రానీ!
    "ఒక ముఖ్యమైన మాట నీతో చెప్పాలని వచ్చాను సునయనా!" అంటున్నాడు కేస్టింగ్ డైరెక్టర్ వాళ్ళ దగ్గరికి వస్తూ.
    "సో నైస్ టూ సీయూ హియర్ ఎగెయిన్!" అన్నాడు స్నేహపూర్వకంగా చెయ్యి జాస్తూ. అదే గుక్కలో మళ్ళీ అన్నాడు అతను.
    "హై అభీ! హై శృతీ! అని పలకరింపుగా.
    తన పేరు అతనికి ఎలా తెలిసిందా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తోంది శృతి.
    "ఇతను జో! జో ఫెల్డ్ మాన్! సర్వాంతర్యామిలాంటి వాడు. అతనికి అన్నీ తెలుసు. అందుకే హాలీవుడ్ లో అంత ఫేమస్ కేస్టింగ్ డైరెక్టర్ అయ్యాడు" అన్నాడు అభిరాం, అతనివైపు అభిమానంగా చూస్తూ.
    "నో మోర్ మిస్టరీ! డైరెక్టుగా పాయింటుకి వచ్చేస్తాను" అన్నాడు జో. "హాలీవుడ్ కొలాబరేషన్ తో ఒక బాలీవుడ్ హిందీ సినిమా తీయాలని మా ప్లాను. హిందీ ఇంగ్లీష్ కలిపిన 'హింగ్లీష్' సినిమా - ఇంటర్నేషనల్ ఆడియెన్స్ కోసం! అందులో హీరోయిన్ సునయన" అని సునయన వైపు తిరిగాడు జో.
    "వెల్ డన్ గర్ల్! నేను పెట్టిన టెస్టులో బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చావ్ - ఒక ఇన్ డీసెంట్ ప్రపోజల్ పెట్టాను నేను. రాత్రికి రమ్మనీ ఎట్ సెట్ రా ఎట్ సెట్ రా- ఎందుకూ! నీ మొహంలో మారే రంగులు చూడాలని. కొంతమంది ఏడుస్తుంటే నవ్వుతున్నట్లుగా వుంటుంది. నవ్వుతుంటే ఏడుస్తున్నట్లుగా వుంటుంది. ఎక్స్ ప్రెషన్స్ లో క్లారిటీ వుండదు. నువ్వు అలా కాదు. నీది చాలా ఎక్స్ ప్రెసివ్ ఫేస్! ప్రపంచమంతా వెదికాక, నాకు దొరికిన హీరోయిన్ వి నువ్వే!" అన్నాడు.
    ఆనందాతిరేకంతో మాట పడిపోయినట్లుగా అయిపోయింది సునయనకి.
    నిజమా?
    తను హాలీవుడ్ తీసే బాలీవుడ్ సినిమాలో హీరోయినా?
    క్షణం క్రితం అసంభవం అనుకున్నది -
    తక్షణం సంభవం కావడం ఎంత సినిమాటిక్ గా వున్నా - ఇది నిజంగా నిజమే!
    లక్కీ మీ!
    "థాంక్యూ సో...మచ్!" అంది సునయన ఉద్వేగంతో.
    "థాంక్స్ నాకు కాదు అభిరాంకి చెప్పు. నీకోసం అతనెంత పాటుపడుతున్నాడో చెబితే అదంతా ఒక సినిమా స్క్రిప్టు అవుతుంది" అన్నాడు జో నవ్వుతూ.
    'మరి ఇందులో నా పాత్ర ఏమిటి?' అన్నట్లుగా చూస్తోంది శృతి.
    జో చెప్పాడు.
    "ఈ సినిమాకి హాలీవుడ్ బ్యాకింగ్ వుంటుంది - నిజమే! కానీ ప్రొడ్యూసరు మాత్రం ఇండియనే అయి వుండాలి. లేకపోతే లేనిపోని రూల్సు అడ్డం వస్తాయ్. శృతి వాళ్ళ డాడీ దాస్ ఇందుకు ఫిట్టెస్ట్ పర్సన్ అని తేల్చుకున్నాం అన్నాడు.
    'ఒక దెబ్బతో రెండు పిట్టలు' అనుకున్నాడు అభిరాం. తెలివైన ఆడపిల్లలు కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఎంత తెలివితక్కువగా మోసపోతారో లెక్క తెలియనన్నిసార్లు తెలిసివచ్చింది తనకి.
    మచ్చుకి -ప్రేమ వ్యవహారాల్లో -
    మచ్చుకి - సినిమా ఛాన్సుల విషయంలో!
    "ఆల్ రైట్ గర్ల్స్! నేనూ అభీ కాసేపు బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుకుంటాం. మీరు కాసేపు కాలక్షేపం కబుర్లు చెప్పుకోండి. పేరుకి శృతీవాళ్ళ డాడీ ప్రొడ్యూసర్ అయినా, శృతి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వుంటుంది. ప్రొడ్యూసర్ కీ, హీరోయిన్ కి మనసులు కలవడం ముఖ్యం కదా!" అన్నాడు జో, నవ్వుతూ.
    "గర్ల్స్! మేం ఒక అరగంటా - గంటలో తిరిగి వచ్చేస్తాం" అన్నాడు అభిరాం లేచి నిలబడుతూ.
    ఆ తర్వాత అభిరాం, జో ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు.
    కొద్ది నిమిషాల తర్వాత, వాళ్ళు ఇంకొక హోటలు తాలూకు యాభయ్యవ అంతస్తులో ఉన్న 'ఘోస్ట్ బార్' (దయ్యాల బార్) అనే పానశాలకు వెళ్ళారు.
    అసలు రంగం అక్కడే జరుగుతోంది!
    అక్కడ ఉన్నాడు ఒక వృద్ధుడు.
    ఆయనకీ ఎనభై ఏళ్ళు ఉండవచ్చును. పట్టుకుచ్చులాంటి తెల్ల జుట్టు. పొడుగు మనిషి అయినా కూడా వృద్ధాప్యం వల్ల వంగిపోయి ఉండడం వలన ఆ పొడుగు తెలియడం లేదు.
    ఆయన ముందు చాలా వినయం ప్రదర్శిస్తూ కూర్చున్నారు జో, అభిరాం. వాళ్ళు అంత వినయం ప్రదర్శించడానికి కారణం ఉంది. ఆ పెద్దాయన అమెరికన్ గూఢచారి సంస్థలో చాలా హై పొజిషన్ లో వున్నాడు. వాళ్ళ సర్కిల్సులో ఆయన్ని 'బిగ్ బాస్' అని వ్యవహరిస్తూ ఉండడం కామను.
    "ఇవాళ చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని మాట్లాడడానికి మీ ఇద్దరితో ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను." అన్నాడు బిగ్ బాస్ మృదువుగా.
    "మీ ఇద్దరితోనే ఎందుకంటే, మీ ఇద్దరూ కూడా మెరికల్లాంటి వాళ్ళని నాకు బాగా తెలుసు గనుక!" అన్నాడు.
    మనసులోనే నవ్వుకున్నాడు జో.
    ముసలోడు మహా ఘటికుడు!
    ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అతి ముఖ్యులన్న భావన కలిగించేటట్లు మాట్లాడతాడు. ఆయన టెక్నిక్కులు కొన్ని తను కూడా గ్రహించి ప్రాక్టీసులో పెట్టేశాడు ఇప్పటికే! అయినా, నేర్చుకోవలసినవి ఇంకా చాలా వున్నాయి.
    మరీ ముఖ్యంగా మనసులో ఏమున్నదో మనిషన్నవాడికి తెలియనివ్వకపోవడం!
    ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎటు దారి తీస్తుందీ?
    బిగ్ బాస్ చెప్పడం మొదలెట్టాడు.
    "అమెరికా మీద యుద్ధం మొదలెట్టారు టెర్రరిస్టులు. టెర్రరిస్టుల మీద యుద్ధం మొదలెట్టింది అమెరికా. సి.ఐ.ఏ. అంటే మన సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసే ఆపరేటర్లూ, అనలిస్టులూ, ఒక్క ముక్కలో చెప్పాలంటే, అనేక స్థాయిల్లో పనిచేసే గూఢచారుల సంఖ్య రెట్టింపు చేయమని ప్రెసిడెంట్ బుష్ గారి ఆదేశం! ఇది ఒకవిధంగా మనకు మంచిదే అయినా కూడా, 'రాత్రికి రాత్రి ఆపరేటర్ల సంఖ్యని రెట్టింపు చేయడం ఎలా సాధ్యం?' అని కొందరంటుంటే, 'ఒకవేళ చేద్దామనుకున్నా కూడా అంతటి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎలా దొరుకుతారు?' అని ఇంకొందరి అనుమానం.
    ఇంకొకవైపు, సైన్యానికి సంబంధించినంతవరకూ పెంటగాన్ వాళ్ళ ఆదేశాల మీద సైంటిస్టులు కాక్రోచ్ లూ, తుమ్మెదలూ, సాలీళ్ళూ - చివరికి గడ్డీ గాదాన్నీ కూడా జెనెటిక్ గా మార్చేసి, వాటిని కూడా గూఢచారి పనులకు ఉపయోగించుకునే ప్రయత్నంలో వున్నారు.
    అదలా వుండనివ్వండి.
    టాలెంటుని ఎక్కడ వున్నా పసికట్టేసే టాలెంటు నాకు వుంది. ఇదిగో! ఈ అభిరాంని పనికట్టుకుని పట్టుకున్నట్లు!" అని ఆగి, అభిరాం వైపు చూసి నవ్వాడు ఆయన.
    మర్యాద ప్రకటిస్తూ తల పంకించాడు అభిరాం.
    బిగ్ బాస్ చెబుతూనే వున్నాడు.
    "డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్ - లేదా క్లాండెస్టెయిన్ సర్వీస్ - అనే గూఢచారి విభాగానికి నేను రెస్పాన్సిబుల్ అని మీకు తెలుసు. ఇందులో పనిచేసే ఆఫీసర్ల సంఖ్యని యాభైశాతం పెంచాలని ఆర్డరు. అందులో అత్యధిక శాతం మంది రకరకాల రంగాల నుండి వచ్చి, రకరకాల బ్యాక్ గ్రౌండ్ తో వున్నవాళ్ళయితే బెటరు! రకరకాల భాషలు వచ్చి వున్నవాళ్ళయితే, మరీ మంచిది. ప్రస్తుతం టెర్రరిస్టులు ఎక్కువగా ఉపయోగిస్తున్న భాషలు అరబిక్, పర్షియన్, పుష్తూ - నేను వాటికి ఇంకో మూడు భాషలు కూడా కలిపాను. అవి తమిళం, హిందీ, తెలుగు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS