కీర్తి కాళ్ళూపుతూ మళ్ళీ నోట్లో వేలు ఏసుకుని కూర్చుంది.
ఏం చేస్తే సంగయ్య రోగం కుదురుతుంది?
వాడికి తగిన శాస్తి చేయాలికాని తను తెలివి తక్కువ పిల్లగానే ప్రవర్తిస్తూ వాడలాగే అనుకునే విధంగ ప్లాను చెయ్యాలి. తన పధకం సక్సెస్ కావాలంటే ఏంచేయాలి?
కీర్తి దీర్ఘాలోచనలో పడింది.
29
ఆనంద్ మూర్తి వచ్చి కీర్తిని చూస్తూ నుంచున్నాడు.
కీర్తి అతను రావటం గమనించింది కాని గమనించనట్లుగ తనో వెర్రి మాలోకంగ ప్రవర్తిస్తూ నవ్వుకుంది. పిచ్చి వాళ్ళ మనసులో ఎప్పుడు ఏ ఆలోచనలు వస్తాయోతెలియదు ఏదో ఆలోచించి మధ్యమధ్య నవ్వు కుంటుంటారు అలా నవ్వింది కీర్తి వాడిని తప్పు దోవ పట్టించాలంటే యిదో మార్గం అంతే.
"రాణి!" నెమ్మదిగా పిలిచాడు ఆనందమూర్తి.
కీర్తి వినిపించుకోనట్లు వుండి పోయింది.
"రాణీ!" అని మళ్ళీ పిలుస్తూ ఆనంద్ మూర్తి ఎదుటకి వచ్చాడు.
కీర్తి అప్పుడే అతన్ని చూసినట్లు ముఖం పెట్టిగబుక్కున నోట్లోంచి వేలు తీసేసింది. కాస్త భయంగ చూస్తూ "ఏంటీ!" అంది.
"నోట్లో వేలేసుకుని చీకితే బాగుంటుందా!" చిరునవ్వు చికిలిస్తూ అడిగాడు.
"ఎందుకూ!" అంది దీర్ఘం తీస్తూ.
"నేను కూడా నోట్లో వేలు ఏసుకుని చీకుదామని"
"వీడికీ పుట్టింది రిమ్మతెగులు తను గత్యంతరం లేని పరిస్థితిలో తిక్క వేషం వేస్తూ సినీ హీరో బొమ్మని ముద్దు పెట్టుకుంది. దాంతో అందరికి పెద్ద రోగం పుట్టింది. ఇలాంటి మగ కీటకాలకి అప్పనంగ ఆడది అందుబాటులో దొరుకుతుందంటే అది పిచ్చిదైనా ఫరవాలేదు, వెర్రిదైనా ఫరవాలేదు, అంద విహీన అయినా ఫరవాలేదు ఎటొచ్చీ అవసరం తీరటానికి ఓ ఆడధైతే చాలు." అనుకుంది కీర్తి.
"ఏంటీ మాట్లాడావ్!" అనుకుంది కీర్తి.
"ఏంటి!" అంది కీర్తి.
"నోట్లో వేలు ఏసుకుని చీకితే బాగుటుందా?"
"లాగి గూబ మీద వకటిస్తే యింకా బాగుంటుందిరా" అనుకున్న కీర్తి "ఏమో" అంది.
"ఏమో ఏంటి?" ఆనంద్ మూర్తి అడిగాడు.
"నన్ను ఎక్కిరిస్తున్నావ్ కదూ! ఇలా అయితే మా అక్కకి చెపుతాను." అంది కీర్తి.
"అబ్బో."
"మరేంటి నన్ను ఎక్కిరిస్తూ" కోపంగ చూస్తూ అంది.
"లేదులే రాణీ ఊరికే అన్నానులే."
"ఊరికే అంటం దేనికి!"
"నువ్వే మంటావో అని!"
"నేనే మంటాను!"
ఆ తర్వాత ఆనంద్ మూర్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇదే సందని కీర్తి లేచి వెళ్ళబోయింది. "ఉండుండునీకో మంచి విషయం చెప్పాలి." కంగారుగా అన్నాడు.
"ఏంటీ" మళ్ళీ దీర్ఘం తీస్తూ అడిగింది.
"కూర్చో చెపుతాను. బొమ్మల విషయం."
"బొమ్మలా!"
"అవును బొమ్మలే. మీ తాతయ్య చెప్పాడు. కూర్చో చెపుతాను."
"తాతయ్య చెప్పాడా అంతా అబద్దం. మా తాతయ్య ఊరికి వెళ్లాడుగా" కీర్తి కూర్చుంటూ అంది.
ఆనంద్ మూర్తిని మాటల్లో పెడితే తెలివి తక్కువగ వాగుతాడు కదా అని కీర్తి ఆలోచించింది. సరీగ యిప్పుడు అదే జరగ బోతున్నది.
"మీ తాతయ్యతో పాటు నాలుగు రోజులు నేనూ వూరు అలా వెళ్ళాను." ఆనందమూర్తి నవ్వుతూ చెప్పాడు.
"నిజంగానా" కీర్తి సంతోషంగ అడిగింది.
"నిజం నాకు కూడా ఏదో పని వచ్చింది. మీతాతయ్య తోపాటే వెళ్ళా. ముందేమో బస్సు ఎక్కి....." ఆనంద్ మూర్తి వరసగ నాలుగు రోజులు ప్రయాణం వివరించాడు.
యశ్వంత్ భట్టాచార్య వెనకాల ఆనందమూర్తి వెళ్ళింది సరీగా నాలుగు రోజులు కాని మాధవ్ గురుదేవ్ తో చెప్పటం మాత్రం ఈవార మంతా ముసలాడి వెనకాలే తిరగానని...యశ్వంత్ జీ నాలుగో రోజున వీడి కళ్ళు గప్పి మాయమై వుంటాడు. ఆ విషయం మాధవ్ గురుదేవ్ తో చెపితే తిడతాడని పెద్ద అబద్దం ఆడాడు. ఏదేదో నమ్మకంగా చెప్పాడు. తను అడగంగానే తెలివి తక్కువదిలే అన్న వుద్దేశ్యంతో నిజం చెప్పాడు. ఇదీ మంచిదే వీడికి చావు తెలివి జాస్తీ అనుకుంది కీర్తి.
ఆనందమూర్తి చెప్పిందంతావిని" తాతయ్యఏమన్నాడు" అని అడిగింది కీర్తి.
"నిన్ను జాగ్రత్తగా చూడమన్నాడు. నీకు బొమ్మలు యిష్టంట కదా ఓ బొమ్మ కొనిచ్చాడు అది నీకిమ్మన్నాడు."
"నిజంగా!" ఆనంద పడుతూ అడిగింది కీర్తి.
"నిజంగా."
"మరైతే తాతయ్య కొనిచ్చిన బొమ్మ ఏదీ?"
గతుక్కుమన్నాడు ఆనంద్ మూర్తి. ఏదో అప్పటికప్పుడు నోటికొచ్చింది చెప్పాడుగాని నిజంగా బొమ్మలేదుకదా!
