Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 40

   
    ఓరకంట అది గమనించిన కీర్తి తృప్తిగ నిట్టూర్పు విడిచి సతీదేవి వెనకనే వచ్చేసింది.
    
                                                      28
    
    అక్కడ ఎవరూ లేరు.    
    సోఫాలో కాళ్ళాడిస్తూ కూర్చుని వుంది కీర్తి.    
    అంతకు క్రితమే దాసీది దుమ్ము పడక పోయినా సోఫాలు తివాసీలు దుమ్ము దులిపి పోయింది. ఆ యింట్లో దుమ్ము ధూళి లేక పోయినా కడగటం తుడవటం అనే కార్యక్రమాలు ప్రతి రోజూ దాశీలు చేయాల్సిందే.    
    కీర్తి సోఫాలో కూర్చుని కూనిరాగాలు తీస్తూకాళ్ళాడిస్తున్నది కాస్తా ఎవరో హాలులోకి వస్తున్నట్లు గమనించి నోట్లో వేలు ఏసుకుంది.    
    సంగయ్య వచ్చి ఎదురు సోఫా మీద కూర్చున్నాడు. పలకరింపుగ పళ్ళు ఇకిలించాడు.    
    సంగయ్య నవ్వులోని కోటి అర్ధాలను ఒక్క చూపులో అర్ధం చేసుకుంది కీర్తి. అక్కడనుంచి చటుక్కున లేచి వెళ్ళటం మంచిది కాదు. అందుకే కీర్తి ఓ వెర్రి నవ్వు నవ్వింది.    
    "నీవు నవ్వితే బాగుంటావు రాణి!" సంగయ్య చిన్నగ అన్నాడు మళ్ళీ ఓ వెర్రి నవ్వు నవ్వింది కీర్తి.    
    "సినిమా బొమ్మలు కావాలా? నా దగ్గర చాలా వున్నాయి. అన్నీ అబ్బాయిల బొమ్మలే." సంగయ్య చెప్పాడు.    
    "నా దగ్గర వున్నాయి బోలెడు."    
    "రాణి!"    
    "ఊ"!    
    "ఎవరి దగ్గరలేనన్ని మంచి బొమ్మలు నా దగ్గరచాలా చాలా వున్నాయి. నీ వెప్పుడు చూడలేదు తెలుసా!"    
    "నిజంగానా!"    
    "నిజంగా."    
    "అయితే ఏవి చూపించు."    
    "ఇప్పుడు కాదు రాత్రికి చూపిస్తాను. భలే బాగుంటాయి. ఓ సారి చూశావంటే వదలవు."    
    "నీ శార్ధం పెట్టా సంగడి గుంటా!" అని కీర్తి తిట్టుకుని "అన్నం తినే ముందు చూపిస్తావా" అంది ఏమి తెలియనట్లు.    
    "ఉహూ! వాటిని ఎవరైనా చూస్తే మాకు కావాలి అంటూ అడిగి తీసుకుంటారు మళ్ళీ ఇవ్వరు. నీవు చాలా బాగుంటావు అందుకని నీ ఒక్కదానికే యిస్తాను."    
    "అయితే యివ్వు మరి."    
    "రాత్రి భోంచేసి తరువాత నీ గదిలో తలుపు వేసుకుని నిద్రపోతావు కదా! అలా కాసేపు పడుకుని తర్వాత లేచి గదిలోంచి బైటికిరా ఎవరూ చూడకుండా పెరట్లోకి వచ్చేసేయి." సంగయ్య అటూయిటూ దొంగ చూపులుచూస్తూ ఎవరూ రావటం లేదని గ్రహించి ధైర్యంగ చెప్పాడు.    
    "రాత్రిపూట పెరట్లో చీకటి దెయ్యాలుంటాయి. నాకు భయం." కీర్తి తెలివిగ అంది.    
    "నేను వుంటా కదా దెయ్యాలు వుండవు. నీవు వస్తే అక్కడ చూపిస్తాను బొమ్మలు."    
    "అక్కడ చీకటి కదా!"    
    "టార్చీలైటు తెస్తాను. ఆ వెలుతురులో చూపిస్తాను."    
    "ఏమో నాకు భయం నేను రాను."    
    "అయితే ఓ పని చేద్దాం."    
    "ఏమిటి?"    
    "నీ గది తలుపులు దగ్గరగ వేసి పడుకో నేనే నీ గది లోకి వచ్చి చూపిస్తాను. సరేనా!" ఆశగ అడిగాడు సంగయ్య.    
    "గది తలుపులు తీసి పడుకుంటే దెయ్యాలు వస్తాయట మా తాతయ్య చెప్పి వెళ్ళాడు."    
    "అఘోరించినట్లే వుంది. ఇదో వెర్రి మొద్దుకదా ఓ పట్టు పడదాం అని వుపాయంగా ఆలోచిస్తుంటే తిక్కమొద్దు లాగా అన్నింటికి భయం భయం అని అఘోరిస్తున్నది. తుప్పురేగ గొడితే భయం పోయి భక్తి పుట్టుకు రావాలి." అనుకున్నాడు సంగయ్య.    
    "అయితే ఓ పని చేద్దాం."    
    "ఏమిటీ?" దీర్ఘం తీసింది కీర్తి.    
    "రాత్రికి కిటికీ దగ్గరకు వచ్చినిన్ను లేపుతాను అప్పుడు నీవు లేచి తలుపు తియ్యి, అలా అయితే భయం వుండదు తీస్తావా!"    
    "సరే" అంది కీర్తి.    
    "ఈ రాణీ ఎంత పిచ్చి మొద్దు, రాత్రి పూట గదిలోకి వచ్చి బొమ్మలు చూపించాలా, ఆ బొమ్మలేవో యిప్పుడేతీసుకొచ్చి చూపించు లేకపోతే తర్వాత తీసుకురా అనొచ్చుకదా అంత తెలివెక్కడ ఏడిచిందిలే, మనిషి ఏపుగ ఎదిగింది గాని బుర్రలో గుంజు ఎదగలేదు. శరీరంలో కోరికలు ఎదిగాయి కాబట్టి దీన్ని మాయ మాటలతో ఓ సారి లొంగ దీసుకుంటే ఆ తర్వాత..."సంగయ్య వక్రంగ అలా ఆలోచించాడు.    
    "ఆడపిల్లలు కాస్త వెర్రి వాళ్లయితే చాలు ఇలాంటి కామాంధులు వాళ్ళని ఆకర్షించే విధంగ పాచికలు విసిరి ఆపై వాళ్ళ పబ్బం గడుపుకుని కడుపో కాలో చేసి ముఖం తప్పిస్తారు. ఇలాంటి వెధవలకి ఘాటైన గుణపాఠం చెప్పాలి" అనుకుంది కీర్తి.    
    సంగయ్య ఇదే సందని యింకా మాటలు పెంచబోయాడు కాని ఎవరో వస్తున్నట్లయి సోఫాలోంచి లేచి గబ గబ పక్క ద్వారంలోంచి వెళ్లిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS