"జీవితంలో నాకింకేమి మిగిలింది అనూషా! ఈ బ్రతుకు బ్రతికే కంటే గుక్కెడు విషం తాగి..." అతని గొంతు బొంగురు బోయింది.
"ఛ! ఛ! ఎందుకంత అధైర్య పడతారు? మేమంతా లేమా!" అంది అనూష అభయమిస్తున్నట్టు.
సమ్రాట్ లో తను ఇప్పటివరకు ఒక రచయితను మాత్రమే చూసింది. ఇప్పుడు అతనిలోని అమాయకత్వాన్ని చూస్తున్నది. జరిగిన సంఘటనలకు అతని హృదయం బాగా గాయపడిందని గ్రహించింది.
సాహితి, సమ్రాట్ ను ప్రేరేపించిందన్న కక్షతో, బిందుమాధవి అతన్ని ఎలాగైనా చట్టంముందు దోషిలా నిలబెట్టాలన్న పట్టుదలతో ఉంది. ఆమె తనకు ఉన్న పలుకుబడితో అన్ని శక్తులనూ రెచ్చగొట్టింది. కేవలం సాహితిని, సమ్రాట్ ను విడదీయడానికే ఆమె అంతటి పనికి పూనుకున్నది.
"ప్లీజ్...మీరు మగవారు. ధైర్యంగా ఉండాలి సమ్రాట్!" అంది శ్రేయోభిలాషిలా.
సమ్రాట్ నిట్టూర్చాడు.
"బాగుంది! మీరు మౌనంగా ఉంటే ఎలా? నేను పరాయి దాన్ననుకుంటే మాట్లాడొద్దు లెండి. నేను వెళ్ళిపోతాను" నిష్టూరంగా అంది.
"అంత మాటనకు అనూషా! నువ్వు పరాయిదానివెలా అవుతావు? నువ్వు నాకు చేసిన సహాయాన్ని మరచిపోయేంత కృతఘ్నుడిని కాను. నా బాధ ఏమని చెప్పమంటావు? ప్రేమ ఓడిపోయిందని చెప్పనా? సాహితి నన్ను మరచిపోయిందని చెప్పనా?" ఆవేదన నిండి వుంది అతని మాటల్లో.
"సారీ సమ్రాట్! స్త్రీ ఒకసారి ఒకరికి మనసు ఇచ్చిన తరువాత అంత తేలికగా మరచిపోదు. సాహితి స్వతంత్రురాలు కాదు. బిందుమాధవి చెప్పుచేతల్లో పెరిగింది. సాహితిని ఆమె కట్టుదిట్టంగా ఉంచిందేమో ఆలోచించారా? ప్రేమించడానికి ఉన్న స్వేచ్చ, ప్రేమను పొందడం, పెళ్ళి చేసుకోవడంలో ఉండదని వేరే చెప్పనక్కరలేదు. అయినా సాహితిని కలవడానికిగాని, మాట్లాడడానికి గాని మీరు ప్రయత్నించారా?"
ఆమె ప్రశ్నలకు పెదవి విరిచాడు సమ్రాట్.
"మీరు నిరాశపడితే ఎలా సమ్రాట్? మీ ప్రయత్నం మీరు చేయాలిగా!"
"సాహితి మారిపోయింది అనూషా! ఆమె మనసునెవరో మార్చేశారు. లేకుంటే ఆమె నాతో మాట్లాడకుండా ఉంటుందా?"
"సాహితిని అపార్థం చేసుకోవద్దు సమ్రాట్! ఆమె ఎలా ఉందో? ఏ సమస్యలో చిక్కుకుందో తెలుసుకోకుండానే ఒక అభిప్రాయానికి వస్తే ఎలా? నేను సాహితితో మాట్టాడి, ఆమెకు నచ్చజెప్పి, మీ చేత మూడుముళ్ళు వేయిస్తాను, సరేనా?"
"సాహితి వస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఆమెకూడా అందరిలా నన్ను అపార్థం చేసుకుందేమో!" అతని గొంతు జీరబోయింది.
"సమ్రాట్! మీరింత సెన్సిటివ్ అయితే ఎలా? పదిమందికీ చెప్పవలసిన మీరు ఒకళ్ళచేత చెప్పించుకునే స్థితికి ఎందుకు రావాలి? ఏది ఏమైనా నేను సాహితిని వెంటబెట్టుకుని మరీ వస్తాను. మీరు ధైర్యంగా ఉండండి" అంది మరింత నమ్మకంగా అనూష.
"ఒకవేళ సాహితి రాకపోతే నేనెవరి కోసం బతకాలి? ఈ పాడు ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత?" నైరాశ్యం చోటు చేసుకుంది అతనిలో.
"సమ్రాట్! చెప్పానుగా_నా శాయశక్తులా ప్రయత్నిస్తానని. ఆమె మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తే ఏ శక్తీ ఆమె మనసును మార్చలేదు. ఆమె తప్పక మీకోసం వస్తుంది. జీవితంలో మీరు సాధించవలసినది యింకా చాలా ఉంది. రచనా వ్యాసంగంలో మీరింకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. అనవసరపు ఆలోచనలతో మనసు పాడుచేసుకోకండి...."
"ఈ పరిస్థితులలో సాహితి నాతో పెళ్ళికి ఒప్పుకుంటుందంటావా అనూషా?"
రచయితగా అతను ఎన్నో పాత్రలను సృష్టించాడు. అతను ఆలోచనలో రచయిత అయినా, అనుభవంలో ప్రస్తుతం సగటుమనిషిలా అయిపోయాడు!
"సమ్రాట్ ఎందుకు మీరింకా అనుమానపడుతున్నారు. నిస్వార్థమైనది ప్రేమ. అది ఓడిపోదు. రేపు ఉదయం మీరు గుడిలో పెళ్ళికి ఏర్పాట్లు చేసుకోండి. సాహితిని సరాసరి అక్కడికి తీసుకువచ్చి మీ ఇద్దరికీ పెళ్ళి చేస్తాను" అంది ఆవేశంగా అనూష.
ఇప్పుడు సమ్రాట్ మనసు కుదుటపడింది. అనూష పట్టుదల గల మనిషి. తను అనుకున్నది సాధించే వరకు విశ్రమించదు అనుకున్నాడు సమ్రాట్.
"థాంక్స్ అనూషా! నే ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనేమో?"
అతని ముఖంలో నూతనోత్సాహం చోటుచేసుకుంది.
* * * *
అనుకున్న సమయం కంటే అరగంట ముందుగానే గుడిలో పెళ్ళికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు సమ్రాట్.
గుడి మెట్ల దగ్గర అనూష, సాహితి రాకకోసం ఎదురుచూస్తున్నాడు. సాహితి మెడలో మూడు ముళ్ళు వేస్తే తన జీవితం మరో మలుపు తిరుగుతుంది.
ముహూర్తం దగ్గర పడుతున్నది. ఇంకా వాళ్ళు వస్తున్న జాడలేదు.
ఆలస్యం అవుతున్న కొద్దీ అతనిలో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.
ఒకవేళ, తను ప్రాధేయపడటంతో సాహితి తనను అలుసుచేయలేదు కదా! పరస్పరావగాహనతోనే ప్రేమ పెనవేసుకుంటుంది. తన ప్రేమలో ఏదైనా లోపం ఉందా?
కారు హారన్ మోగగానే ఆలోచనల నుంచి వాస్తవంలోకి వచ్చాడు సమ్రాట్.
గుడి మెట్ల దగ్గర కారు ఆగింది.
అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఆత్రుతగా కారు దగ్గరకు పరుగు తీశాడు.
కారులోంచి అనూష ఒక్కతే దిగింది.
సమ్రాట్ హతాశుడయ్యాడు.
"అనూషా! సాహితి రాలేదా?" అతని గొంతు వణికింది.
"ప్చ్!" నిర్లిప్తంగా అంది.
