Previous Page Next Page 
మంచివాడు పేజి 40

పన్నెండున్నరకు బండి వచ్చింది. అమల వెయిటింగు రూములోనుంచి భయం భయంగా బయటికి వచ్చి బండి ఎక్కింది.
బండి బయలుదేరింది. ఇద్దరి ప్రాణాలు కుదుటపడ్డాయి. ఎన్నెన్నో మాట్లాడుకున్నారు. ఆ ఫస్టుక్లాసు కంపార్టుమెంటులో మరో వయసు మళ్ళిన ఆయన మాత్రం వున్నాడు.
ఆమె అర్థగంటకే నిద్రలోకి జారిపోయింది. భాస్కరు మాత్రం ఆ అందాలరాశితో గడపబోయే తన జీవితాన్ని గురించి ఆలోచించుకుంటూ పడుకున్నాడు. తెల్లవారుఝామున ఆలోచనల నుంచి నిద్రలోకి జారిపోయాడు.
"కాఫీ! చాయ్" అంటూ అరువులతో భాస్కరుకు మెలకువ వచ్చింది. కళ్ళు నులుపుకుంటూ లేచి కూర్చున్నాడు. తెలతెల వారుతూ వుంది కాజీపేట స్టేషన్.
అమల కాఫీ తాగుతుందేమో! అనుకుంటూ ఎదురు బెర్తుకేసి చూశాడు. ఖాళీ బెర్తు అతని ముఖంలోకి బోసిగా చూసింది. భాస్కరు ఓ క్షణం అలాగే చూస్తూ వుండిపోయాడు.
"అమల ఏదీ? ఎక్కడ కెళ్ళిందీ? లేవేటరీకి వెళ్ళిందేమో! ఆ ఆలోచన రాగానే తన గాబరాకు తానే నవ్వుకున్నాడు. అమల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు.
ఐదు ... పది ... ఇరవై నిముషాలయింది. అమల రాలేదు. బండి కదిలింది. లేచి లేవేటరీ దగ్గరకు వెళ్లి చూశాడు. తలుపు తెరుచుకుంది. అందులో ఎవరూ లేరు.
భాస్కరు నీరు కారిపోయాడు. అమల ఎందుకలా చేసింది? తన మాట నమ్మలేకపోయిందా? నమ్మించి మోసం చేస్తాననుకుందా? కొన్ని గంటలు తనను మురిపించి వెళ్ళిపోయిందా? దిగులుగా వచ్చి సీట్లో కూర్చున్నాడు.
భాస్కరు కళ్ళు ఎదురుగా వున్న బెర్తుమీద నుంచి కిందకు వాలాయి. అక్కడ వుండాల్సిన వస్తువేదో లేనట్టు లీలగా తోచింది.
తన సూటుకేస్ ఏదీ. ఏమయింది? కంపార్టుమెంటంతా వెతికాడు. ఎక్కడా లేదు.
అయితే ... అమల ... ఆ పైకి ఆలోచించలేక పోయాడు. ఎంతపని చేసింది? పెట్టెలో దాదాపు వెయ్యి రూపాయలున్నాయ్! ముఖ్యంగా బట్టలు ...
పోలీసు ఆఫీసరుగా డ్యూటీలో జాయిన్ కాబోతున్న తను ఒక ఆడపిల్ల వలలో ఎంత అందంగా చిక్కుకున్నాడు...
గత స్మృతుల నుంచి బయటపడి ఎదురు బెర్తుకేసి చూచాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడు పడుకున్నారో అతను గమనించనేలేదు. ఆమె కింద బెర్తుమీదా, ఆ యువకుడు పై బెర్తుమీదా పడుకొని వున్నారు.
ఆమె నిశ్చింతగా నిద్రపోతూంది.
ఈమె అమలా! అమలే అయితే ఇంత హాయిగా నిద్రపోగలదా! అంతా దొంగ నిద్రేమో?
భాస్కరు పక్క పర్చుకొని పడుకొన్నాడు. నిద్రపోకుండా ఆమె ఏం చేస్తుందో చూడాలని నిర్ణయించుకున్నాడు.
మూడు గంటలవుతుంది. నిద్ర ముంచుకొస్తుంది. కళ్ళు తెరచి ఆమెకేసి చూశాడు. ఆమె హాయిగా నిద్రపోతూ వుంది.
ఈమె అమల కాదు. మనిషిని పోలిన మనుషులుంటారు. తను పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు.
భాస్కరు నిద్రలోకి జారిపోయాడు.
"ఏమండీ! ఏమండీ!" ఎవరో గాబరాగా భాస్కరును కుదిపి లేపుతున్నాడు.
భాస్కరు బద్ధకంగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఆ యువకుడు కన్పించి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. తెల తెలవారుతోంది. కాజీపేట స్టేషన్.
"ఆమె ఎక్కడండీ?" గాబరాగా అడిగాడు ఆ యువకుడు.
"ఎవరూ!" నిద్రమత్తు నుంచి పూర్తిగా బయటపడకుండానే అడిగాడు భాస్కరు.
"అదే ... ఆమె ... అనిత ..."
భాస్కరు నిటారుగా కూర్చున్నాడు.
"అమల కన్పించడం లేదా !"
"అమల కాదండీ అనిత __"
"అదేలేవయ్యా... అవ్వపేరే ముసలమ్మ ..."
"పాపం ఏమయిందో ఏమో? చాలా చిక్కుల్లో వుంది._ నా మాటలు నమ్మినట్టు లేదు ... ఎలాగయినా అనితను వెదకాలండీ! మీరు పోలీసు ..."
"సూపర్నెంటును, వెదుకుతాను" తప్పకుండా వెదుకుతాను తనకు తానే అనుకున్నట్టు అన్నాడు భాస్కరు.
"బహుశా ఖమ్మం స్టేషన్ లో దిగిపోయిందో ఏమో ..."
"ముందు నీ సూట్ కేస్ వుందో లేదో చూసుకోవయ్యా?"
ఆనందరావు భాస్కరు మాటలు అర్థం కానట్టు చూశాడు.
"ఏమిటలా చూస్తారు. మీ సూట్ కేస్ వుందో లేదో చూడండి"
ఆనందరావు గిర్రున తిరిగి సూట్ కేస్ పెట్టిన చోటుకు చూపుల్ని సారించాడు. ఆ స్థలం బోసిగా కన్పించింది. ఆత్రుతగా బెర్తు దగ్గరకెళ్ళి వంగి అంతటా వెదికాడు.
"నా సూట్ కేస్ ... లేదు...అందులో ఆఫీసు డబ్బు పదివేలు వుంది..." నాలుక పిడచ కట్టుకు పోతుంటే ఎలాగో అనగలిగాడు.
కాళ్ళలో సత్తువంతా ఎవరో సిరంజితో ఒక్కసారిగా లాగేసినట్టు నిల్చున్న చోటునే కుప్పకూలిపోయాడు.
"పాపం! ఇతను కూడా తనలాగే ఆ అమ్మాయిని ప్రథమ చూపులోనే ప్రేమించి పెళ్ళిచేసుకొంటానని వాగ్దానం చేసి వుంటాడు." జాలిగా ఆనందరావు కేసి చూశాడు భాస్కరం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS