తనూ సీరియస్ గా ముఖంపెట్టి "ఆలోచిద్దాం సార్!" అన్నాడు అహోబిలం.
"ఆలోచించటమంటే ఎవరిదోవన వాళ్ళు కూర్చుని ఆలోచించటం కాదయ్యా! విషయం గురించి ఆలోచిస్తూ వివరంగా చర్చించుకోవాలన్న మాట. మైండిట్!"
"అర్థమయింది సార్!
"నేను ఇప్పుడు ఈ కేసు విషయంలో కొన్ని ప్రశ్నలు వేస్తాను. టకీ టకీమని సమాధానాలు ఇవ్వు! నా పాయింట్లలో బలంలేకపోయినా, మధ్యలో నీకేదన్నా అనుమానం వచ్చినా అడుగు."
"అలాగే సార్! మీరు అడగటమే ఆలస్యం" అన్నాడు హెడ్ కానిస్టేబుల్ అహోబిలం.
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు తెలివితక్కువ వాడేమీ కాదు. కాకపోతే, ఆ తెలివికి కాస్త ముదురుపాకం రావటం వల్ల మైండ్ లో పడ్డమాట అలాగే అక్కడ టంకంలా బిగుసుకుని అతి తెలివితేటల రూపంలో ఆయన ఆలోచనలూ, మాటలూ సాగుతూంటాయి. పరమానందయ్య శిష్యులకి కలిసివచ్చినట్లుగానే, వర్ధనరావుకి చాలా కేసులు కలిసివస్తుంటాయి. ఇలాంటప్పుడే అదృష్టం అనే మాటను నమ్మవలసి వస్తూంటుంది.
ఈ రోజు స్టేషనులో కొత్త కేసులు ఏమీ రాలేదు. చేపట్టిన కేసేమో అయోమయంగానూ, అధ్వాన్నంగానూ తయారయ్యింది. అందుకే ఏదో ఒకటి మాట్లాడితే కేసులో కొత్త క్లూ ఏదయినా దొరుకుతుందేమో అని ఆయన ఆశ.
అహోబిలం తన తెలివితేటలు అన్నింటినీ ప్రదర్శిద్దామంటే, ఉద్యోగంలో క్రింద మెట్టులో ఉన్నాడు.
కోరి కష్టాలు కొనితెచ్చుకోవడం దేనికని ఒక నిర్ణయానికి వచ్చేశాడు.
ఇన్ స్పెక్టర్ గారు టకీటకీమని ప్రశ్నలు వేస్తే తను టకాటకా అని సమాధానాలు ఇవ్వటానికి సిద్ధంగా నుంచున్నాడు.
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు క్షణకాలం ఆలోచించి వెంటనే ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు.
"ఈ కేసుని ముందునుంచీ పరిశీలిద్దాం. ఈ ఊళ్ళో ఒక దొంగల ముఠా స్థావరం వున్నట్లు మనకు తెలియదు.
ఈ విషయం ఎవరో అంటే ఇక్కడ దొంగల ముఠా స్థావరం వున్నట్లు ఎవరో అజ్ఞాతవ్యక్తి మనకు ఫోన్ చేసి చెప్పాడు. మనం దొంగల ముఠా స్థావరం మీదికి దండెత్తాము.
కొందరు పారిపోయారు. కొందరు పట్టుబడ్డారు. ఇంతవరకూ కరెక్టే కదా!"
"కరెక్టే సార్!"
"ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరయి ఉంటారు?"
"తెలీదు సార్!"
"తెలీదు అంటే ఎలాగయ్యా? ఇలాంటి చోటనే మనం బుర్ర పెట్టి ఆలోచించాల్సింది. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో నాకు తెలుసు"
హెడ్ కానిస్టేబుల్ అహోబిలం ఉలిక్కిపడ్డాడు.
ఆశ్చర్యంతో విచ్చుకున్న పత్తికాయల్లాగా కళ్ళు తెరుచుకుని "మీకు తెలుసా సార్?" అనడిగాడు.
"తెలుసు అంటే వాడి ముక్కూ, ముఖం తెలుసు అని కాదు. వీడి శతృవు ఎవడో మనకి ఫోన్ చేసి ఆ ముఠా రహస్యం బయటపెట్టాడు.
బహుశా మనకి ఫోన్ చేసినవాడు వాడి దగ్గరనుంచీ విడిపోయిన వాడయ్యి వుంటాడు. లేక మరో దొంగల ముఠా స్థావరం వాడయి వుంటాడు.
లేకపోతే తెలుగు సినిమాల్లోలాగా దొంగల బాస్ మీద పగబట్టిన వాడెవడో కక్షతో ప్రతీకారం తీర్చుకోటానికి ఆ స్థావరం గురించి వివరంగా ఫోన్ చేసి ఉంటాడు"
"అవి సినిమా కథలు కదా సార్!" నవ్వుతూ అన్నాడు అహోబిలం.
"అసలు నన్నడిగితే ఈ సినిమా కథలు ఎక్కడినుంచి పుట్టుకు వచ్చాయంటావ్? ఇంగ్లీషు రచయిత నవలలని తెలుగు రచయితలు కాపీ కొడుతున్నారని ఆ మధ్య దేంట్లోనో రాస్తే చదివాను.
నన్నడిగితే ముందు రచయితలు నిత్యజీవితాన్ని కాపీకొట్టి రాసేది కాక ఇంగ్లీషు రచయితలని కాపీ కొట్టేదాకా ఎదిగిపోయారు. ప్రతి కథా కథ ఒక జీవితం. ప్రతి జీవితం ఒక కలే"
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు అలా అంటూంటే "నా బొంద" అనుకున్నాడు అహోబిలం.
"నేను చెప్పింది వింటున్నావు కదా!"
"శ్రద్దగా వింటున్నాను సార్!"
"గుడ్! అజ్ఞాత వ్యక్తి మనకి ఫోన్ చేశాడు. మనం దొంగల్ని పట్టుకున్నాం. దొంగలతోపాటు ఇద్దర్ని పట్టుకున్నాం.
వాళ్ళిద్దరూ దొంగలు కారని గాఢంగా నమ్మిన తరువాతనే విడిచిపెట్టటం జరిగింది. అవునా?"
"ఔను సార్!"
