అందుకే పట్టు విడిపించుకోడానికి చాలా శ్రమపడాల్సి వస్తూంది..
ఆ పెనుగులాట సాగింది కేవలం ఓ అరనిమిషం మాత్రమే.
ఇంతలో "ఆగు బే" అన్న కంఠాలు వినిపించాయి ఒక్కసారిగా.
అనుకోని ఈ అవాంతరానికి కొద్దిగా తలతిప్పిన శశాంక అప్పుడు చూశాడు...
ఎటువేపు నుంచి వచ్చారో అక్కడ నలుగురు సాయుధులైన వ్యక్తులు రివాల్వర్స్ ని అతడికే గురిపెట్టి నిలబడి వున్నారు...
రాజ్ కుమార్ అలియాస్ కుమార్ దాదా తోడేలులా నవ్వుతుంటే అతడి గొంతు చుట్టూ బిగించిన చేతుల పట్టు సడలించాడు శశాంక.
"నువ్వు రాగలిగింది ఒక మార్గంలో అయినా నాలాంటి నేరస్తుడు నేరం చేయడానికిగాని, చేసి తప్పించుకోడానికిగాని చాలా మార్గాలుంటాయి శశాంకా! అందుకే నా మనుషులు లోపలికెలా వచ్చారా అని ఇంకా ఆశ్చర్యపోతున్నావు" పైకి లేస్తూ అన్నాడు కుమార్ దాదా.
నలుగురు అనుచరుల రివాల్వర్సు ఏ క్షణంలో అయినా నిప్పులు కక్కేట్టున్నాయి.
శశాంక నిర్విణ్ణుడై చూస్తున్నాడు.
తానో ఊబిలో కూరుకుపోయినట్టు అతనికి అర్థం అయింది.
సరిగ్గా ఆ సమయంలో వినిపించింది పోలీస్ సైరన్.
అది క్రమంగా దగ్గరవుతుంటే నేలమాళిగలోని అందరి కళ్ళల్లో తత్తరపాటు కనిపించింది హఠాత్తుగా.
మరో క్షణం ఆలస్యమైతే ఏం జరిగేదో కాని ఈలోగా కుమార్ దాదా సైగల్ని అర్థం చేసుకున్న నలుగురూ అక్కడ నుంచి అదృశ్యమైపోయారు తమనుతాము రక్షించుకోడానికన్నట్టుగా.
కదలబోయిన కుమార్ దాదా వూహించలేదు శశాంక మరోమారు అవకాశం తీసుకుంటాడని.
అమాంతం అతడి మెడ పట్టుకున్న శశాంక "మిస్టర్ కుమార్ దాదా! ఈ క్షణంలో మనం విడిపోతున్నా మళ్ళీ త్వరలోనే కలుసుకోబోతున్నాం. ఆ హత్య ఎందుకు చేసిందీ నాకు తెలియాలి. ఆ తర్వాత మనలో ఎవరో ఒకరే మిగలాలి. వస్తాను." అంటూ అప్పటికే పోలీస్ సైరన్ ఆ పాడుబడిన ఇంటి ఆవరణలో వినిపిస్తుంటే రెప్పపాటులో మెట్లపై నుంచి పరుగెత్తిన శశాంక మరో అరనిమిషంలో ఓ స్తంభం చాటుకు చేరుకున్నాడు.
పోలీసుల బూట్ల చప్పుడు ఉధృతమవుతుంటే రెండు అంగల్లో కాంపౌండ్ వాల్ ని చేరుకున్న శశాంక గబాలున గోడ దూకి వీథిలోకి పరుగెత్తాడు.
వీధిలో జనం ఇళ్ళముందు నిలబడి చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు.
అవినాశ్ స్వయంగా రంగంలోకి దిగడాన్ని శశాంక గుర్తించగలిగాడుకాని ఆ సమయంలో పోలీసులు అక్కడికెలా వచ్చారో అని ఆశ్చర్యపోతూనే సందు మలుపుని చేరుకున్నాడు.
వేగంగా ముందుకు దూసుకొచ్చిన ఓ ఫియట్ ని గుద్దుకోబోయిన శశాంక ఆగిన కారు డోర్ తెరుచుకోవడంతో ముందు నిశ్చేష్టుడయ్యాడు. వెను వెంటనే ఓ చేయి అతడ్ని బలంగా లోపలికి లాగింది.
ఇదంతా జరిగింది కేవలం ఇరవై సెకండ్లలో.
అప్పుడు చూసాడు సీట్లో తన పక్కనున్న వినీలని.
"నువ్వా" అలసటగా సీటుకి జారగిలబడి అన్నాడు.
"ఏం... ఆశ్చర్యంగా వుందా" వినీల కళ్ళల్లో సమయానికి ఆదుకున్నందుకు గర్వం లేదు. నిక్షిప్తంగా వుంటూనే తన్నుకొస్తున్న బాధ మాత్రం స్పష్టంగా కనిపించింది. "అర్థమైంది శశాంకా... నువ్వెలా బ్రతకాలనుకుంటున్నావో ఇప్పుడు పూర్తిగా బోధపడి పోయింది."
వేగంగా వెళ్తున్న కారులోకి అలజడిగా ప్రవేశిస్తున్న గాలి తాకిడికి వినీల కురులు పట్టుకుచ్చులా పైకెగురుతూ అతడి మొహాన్ని కప్పేస్తుంటే అలానే ఓరకంట ఆమెను గమనించాడు.
తప్పుచేసిన పసికందు 'రెడ్ హేండెడ్'గా దొరికిపోయినట్టు అతడిలోని భావోద్వేగాన్ని అణుచుకుంటూనే స్థిరమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తున్న దిక్సూచిలాంటి, ఆమె నాసికాగ్ర భాగాన్ని అప్పటికి కొన్ని క్షణాల క్రితమే మంచులో తడిసిన మృదుత్వాన్ని రంగరించుకుని ఏ అధరాల స్పర్శ కోసమో తపస్సు చేస్తున్నట్టు అస్పష్టంగా కదులుతున్న పెదవుల్ని నింగి నుంచి జారిన వర్షపు తొలినీటి బొట్టు ఏరికోరి ఆమె ఫాలభాగాన్ని తాకి ముత్యపు చుక్కల్లా వడివడిగా చెంపలని చేరుతున్నట్టనిపించే పలచని స్వేద బిందువుల్ని అలజడిని కోరి గుండెల్లో దాచుకుంటున్నట్టనిపించే వక్షోజాల ఊర్పుల్ని చూస్తూ ఆ స్థితిలో కూడా ఆమె అసాధారణమైన అందం గురించి ఆలోచించకుండా వుండలేకపోయాడు.
"అయిపోయిందా?" అడిగింది వినీల.
అనుకోని ఆ ప్రశ్నకు తత్తరపడిన శశాంక దేన్నుద్దేశించి ఆ ప్రశ్న వేసిందీ అర్థం చేసుకునేలోగానే మళ్ళీ వినీలే అంది "నన్ను చూడడం కాదు... నువ్వెళ్ళిన పని."
"లేదు" గొణుగుతున్నట్టుగా అన్నాడు.
"తేనె తుట్టని కదిపావు శశాంకా... ఇక రాబోయే ప్రమాదాల్ని నువ్వు ఊహించలేవు" బాధగా తల వంచుకుంది ఎవరనుకుంటున్నావు వాళ్ళని. ఆ గేంగ్స్ గురించి నీకేం తెలుసని ఒంటరిగా పోరాడాలని వెళ్ళావు?"
"వాళ్ళెంత బలవంతులైనా సరే... నా భార్యని హత్యచేసిన వాళ్ళని చట్టం క్షమించినా నేను వదిలిపెట్టను" స్థిరంగా అన్నాడు బయటికి చూస్తూ.
"అంతకంటే ముందు నీ మీద పగ సాధించిగాని నిద్రపోరు వాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళ వృత్తి."
