Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 40


    లక్ష్మీపతి తేలిగ్గా ఊపిరి తీసుకొన్నాడు.


    కావాలని భోజనం దగ్గర పిచ్చాపాటి కబుర్లు చెబుతూ ఆలస్యం చేశాడు సారధి.


    ఆమెకి నిద్రవచ్చేసింది. పగలంతా క్లబ్బులో ఏర్పాట్లతో అలసిపోవడంతో ఆమెకి విసుగ్గా వుంది.


    కానీ ఒక్కసారి మేడమీదికెళ్ళి భారతిని చూస్తేగానీ ఆమెకు తృప్తిగా అనిపించేలా లేదు.


    లలితాంబ వెనకాలే డైనింగ్ రూం నించి కింది హాలులోకొచ్చాడు.


    లలితాంబ మేడమెట్లువేపు కదులుతోంది.


    బాలయ్య అయోమయంగా చూస్తున్నాడు. గది తలుపు చాటునుంచి చూసి లక్ష్మీపతి ఉలిక్కిపడ్డాడు.


    భారతి గదిలోకి లలితాంబ వెళితే జరగబోయే ప్రళయం ఎలాంటిదో అందరికీ తెలుసు.


    వాసన పసిగడితే లలితాంబ అపర కాళికాదేవి అయిపోతుంది. ఆవేశంలో ఏం చేస్తుందో చెప్పడం ఎవరికీ సాధ్యం కాని విషయం.


    లలితాంబ ఒక్కోమెట్టు ఎక్కుతుంటే సారథికి ఏం చేయాలో తోచలేదు.


    ఇంకా నాలుగుమెట్లే వున్నాయి. ఆ నాలుగుమెట్లు ఆమె ఎక్కేస్తే భారతి గదికి ఆమె వెళ్ళడం నిమిషం పట్టదు.
    క్షణంలో వెయ్యోవంతు వ్యవధి మాత్రమే వుంది.


    సారథి మెరుపులా కదిలాడు. హాల్లో మూలగా వున్న మెయిన్ స్విచ్ దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేసేసాడు.


    ఒక్కసారిగా దీపాలు ఆరిపోవడంతో చీకటి వ్యాపించేసింది.


    లలితాంబ కళ్ళజోడు పెట్టుకోలేదు. ఆమెకి చీకటిలో కళ్ళు సరిగ్గా కనబడవు.


    లలితాంబ నిలబడిపోతుంది. ఆమెకి ఎటుపోవడానికి చేతకాలేదు.


    సారథి చేసిన పనిచూసి లక్ష్మీపతి మెచ్చుకొన్నాడు.


    "సారథి" అని పిలిచింది లలితాంబ కంగారుగా.


    "వస్తున్నా అత్తయ్యా" అంటూ సారథి చీకటికి అలవాటుపడ్డ కళ్ళతో గబగబా మెట్లెక్కి -


    "నీ చాదస్తం నీదేకానీ, చెబితే వినవు. చూడు చీకట్లో కాలుజారితే ఎంతో ప్రమాదం జరిగిపోయేది!" అని ఆమెని మెల్లగా కిందికి నడిపించుకొని తీసుకొచ్చి ఆమెని బెడ్ రూం దగ్గర వదిలిపెట్టాడు.


    "అబ్బా, కళ్ళు పోయినట్లుగా వున్నాయి" అంది.


    "గుడ్ నైట్ అత్తయ్యా" అన్నాడు సారథి.


    "గుడ్ నైట్" అందామె.


    సారథి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు.


                                               22


    ఆ రాత్రి సారథికి నిద్రపట్టలేదు. అతనికి ఉద్యోగం దొరికింది. ఇక సొంతవూరు వెళ్ళిపోతున్నానన్న ఆనందం అతనిలోలేదు.


    భారతి ఏదన్నా చిక్కుల్లో ఇరుక్కొంటుందేమోనన్న ఆలోచనలు అతని మెదడుని తినేస్తున్నాయి.
    దెబ్బతిన్న పులి ఊరుకోదు. పులికంటే ప్రమాదమైన జంతువు మనిషి. స్వార్థం కోసం ఎదుటివాళ్ళనేం చేయడానికయినా వెనుకాడని జాతి మనిషిది.


    బోసు మళ్ళీ భారతిపైన అత్యాచారం చేయడన్న నమ్మకం ఏమిటి?


    భారతి తనని తాను రక్షించుకోలేని అబలనని ఈరోజు నిరూపించుకొంది.


    అందుకే అతను నిశ్చయించుకొన్నాడు. భారతితో మాట్లాడాలి.


    కళ్ళుమండుతున్నాయి. మంచంపైన అటూ ఇటూ దొర్లుతున్నాడు. తరచుగా చేతి వాచీలోకి చూసుకుంటున్నాడు.


    అయిదూ నలభై అయిదయింది. సారధి లేచి గదిలోంచి బయటకొచ్చాడు.

 

                                            23


    భారతి మంచంమీద లేచి కూచుంది. ఆమెకళ్ళు అలారం టైమ్ పీస్ కేసి చూసినాయి.


    అయిదు నలభై అయింది.


    జరిగింది చాలావరకు ఆమెకి గుర్తుంది. అయితే తన ఇంటికెలా చేరిందీ తెలీడంలేదు.


    బోసు తనని నడవలేని స్థితిలో ఆటో ఎక్కించడం వరకూ జ్ఞాపకం వుంది.


    ఆ తర్వాత..... ఆ తర్వాత ఏమయింది?


    తననెక్కడికి తీసుకెళ్ళాడు?


    రాస్కెల్, తనని మోసంచేసి తాగించాడు.


    అంతేనా? ఏదన్నా...... అఘాయిత్యంగానీ...... తననితాను పరీక్షగా చూసుకొంది అనుమానంగా, భయంగా.


    ఏమీ అనిపించలేదు. దానితో కాస్త ధైర్యం వచ్చింది.


    ఇదంతా మమ్మీకి తెలుసా?


    మమ్మీ గుర్తురాగానే గుండె దడదడమని కొట్టుకొంది. భారంగా వుంది. రెండు చేతులతో తలని గట్టిగా పట్టుకొంది.


    గుమ్మం బయట అడుగుల చప్పుడయింది.


    "మమ్మీ కాదు కదా!" భయంగా చూసింది.


    సారధి


    ఎప్పుడూ లేంది బావ తనగదికి అంత పొద్దుటే ఎందుకొస్తున్నాడు.


    జుత్తు రేగిపోయి కళ్ళు చింతనిప్పుల్లా కాలిపోతూ, మొహం పీక్కుపోయి భయంకరంగా వున్నాడు సారధి.


    "అలా వున్నావే" అడిగింది భారతి అతన్ని.


    ఆ ప్రశ్నకి అతనికి నవ్వొచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS