"వర్ధనీ! అమ్మాయిని ఒకసారి యిలా రమ్మను" అంది సుమిత్ర!
వర్ధని హుషారుగా వెళ్ళి పిలుచుకు వచ్చింది.
"అమ్మగారూ! పిలిచారటగా?"
"అవునమ్మ! అబ్బాయిగారు లేచారా?"
"స్నానం చేశారు. తయారవుతున్నారు"
"ఎందుకు? ఈరోజు కూడా పట్నం పోవాలా?"
"అర్జంటు పనులున్నాయట!"
"మళ్ళీ ఎప్పుడొస్తారో అడిగావా?"
"రెండు రోజుల తరువాత వీలు చూచుకుని వస్తామన్నారు"
"అలాగా?" అంది సుమిత్ర! ఆ కంఠస్వరంలో అసంతృప్తి కూడ ఉంది.
"నాతో మాటాడేందుకు వీలుకాదేమో!? క్రింద హాలులో కూర్చుంటాను. అంటూ సమాధానం కోసం చూడకుండా క్రిందికి దిగి వెళ్ళిందామె!
గాయత్రి గదిలోకి వెళ్ళింది.
"మా అమ్మగారు మీతో ఏదో మాటాడాలనుకుంటున్నారు. క్రింద హాలులో ఎదురు చూస్తున్నారు." అని వార్త అందించింది.
వాల్మీకి చాలా సాధారణంగా తీసుకున్నాడు.
అతడు క్రిందికి దిగివచ్చేలోగా అంతా ఆలోచించుకుని సిద్ధంగా ఉంది సుమిత్ర.
వాల్మీకి వచ్చి ఆమె పాదాలను తాకాడు.
"అత్తాయమ్మగారూ! పిలిచారట?"
"అవును బాబూ! నీతో ఒక ముఖ్య విషయం మాటాడాలి.
"చెప్పండి" అంటూ ఆమె ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు.
"మీరు పట్నం వెళ్ళిపోతున్నారా?"
"అవునండి! స్టాఫ్ ని అపాయింట్ చేస్తున్నా! ఇంటర్వ్యూలున్నాయి.
"సాయంత్రంలోగా అయిపోతాయా?"
"అవునండి. వెంటనే విశాఖపట్నం వెళ్ళాలి. బ్రాంచి పనులున్నాయి."
"అలా కాదు బాబూ! ఇంటర్వ్యూలు అయిపోగానే సాయంత్రం నువ్వు ఇంటికి రావాలి" అన్నదామె దృఢమయిన కంఠస్వరంతో.
పని మానుకోవాలని ఆమె సూచించటం అతనికి ఆశ్చర్యం కలిగించింది.
"నేను ముఖ్యమయిన పనిమీద వెడుతున్నాను. అంతకన్నా ముఖ్యమయిన పని అయితే మానుకుంటాను" అన్నాడు సందేహంగా!
"తప్పకుండా రావాలి! ఎల్లుండి శుక్రవారం! అమ్మాయి సంతానలక్ష్మి వ్రతం చేయాలనుకుంటోంది. సోమవారం తరువాతే మీరు వ్యాపారం పనులు పెట్టుకోవాలి! ఈలోగా ఇల్లు విడిచి వెళ్ళకూడదు!" అన్నదామె!
అతడు అరక్షణం ఆలోచించాడు.
"ఇంటర్వ్యూలు అయింతర్వాత మా పనులు ఆపేందుకు వీలు కాదండి"
"ఇంటి పట్టున ఈ నాలుగు రోజులు ఉండలేమంటారా?"
"అలా అని కాదు. డ్రయివర్ ని పంపి ఇంటర్వ్యూలు సోమవారం తరువాత వాయిదా వేయించినట్లు వార్తలు పంపుతాను" అన్నాడు.
13
"మీ కారుకి బ్రేకులు పడ్డాయి. నాకు చాలా సంతోషంగా ఉంది" అంది.
"నా వ్యాపారం ముందుకు పోవాలని లేదా మీ యిద్దరికీ!"
"మీరు చేస్తున్నారు కాబట్టి అది బాగుండాలి! నష్టం రాకూడదు. పనులంటూ మీరు పరుగెత్తకూడదు. డబ్బు సంపాదించి తీసుకురావలసిన అవసరం మనకి లేదుకదా!?" అంది గాయత్రి.
"ఎందుకు అలా అంటున్నావు?"
"ఈ రెండు కుటుంబాలకు మీరే కదా కధానాయకులు!"
"ఓ అందుకోసం ఇల్లు విడిచిపెట్టకుండా ఎదురుగ్గా కూర్చోవాలన్న మాట" అన్నాడు వాల్మీకి. అరక్షణం ఆగి ఆలోచించాడు.
"గాయత్రీ! యూ ఆర్ మిస్టేకన్" అన్నాడు.
ఆమె భర్త వంక విస్మయంగా చూచింది.
"ఎలా?" అంది అనుమానంగా!
"ఈ రెండు కుటుంబాలకి నేను వారసుడు అని నిర్ణయించటం నీ పొరపాటు. ఆ దిండుమీది అమ్మాయి ఆమె భర్త ఏమవుతారు?" అన్నాడు.
తలగడవంక చూచింది గాయత్రి! రెండు అందంగా అమర్చి ఉన్నాయి.
అక్షరాలు కొట్టివచ్చినట్టు కన్పించుతున్నాయి.
"లవ్ లీ! ఆమని!!" ఆమె కలకలమని నవ్వింది.
"ఓ మన ఆమని గురించా!? అది కలెక్టర్ అవుతుంది. పెళ్ళి చేసుకోనంది. చేసుకున్నా మన మధ్యకి ఎందుకు వస్తారు. ఎక్కడో పెద్ద వుద్యోగాలు వెలిగిస్తూ వారి ప్రపంచం వేరుగా బ్రతుకుతారు.
వారసులు అంటే ఈ రెండు కుటుంబాల కట్టుబాటు, సాంప్రదాయం హోదా అన్నీ దగ్గరుండి చూచుకుంటూ నిలబెట్టుకోవలసిన బాధ్యత మీదే అని నా అభిప్రాయం" అని వివరించింది.
"లేకపోతే ఒక పని చేయరాదూ!?" అంది కొంటెగా చూస్తూ.
"ఏం చేయమంటావు?" అన్నాడు పరాకుగా!
"దాన్ని కూడ మీరే పెళ్ళి చేసుకోండి!" అంది.
వాల్మీకి చురుక్కుమని చూచాడు.
"తమాషాకి కూడ అలాంటి మాటలు అనకు గాయత్రీ! ఆమని చిన్నపిల్ల! ఆమె మనకి ఆదర్శం! వెన్నెలకిరణంలా మచ్చలేని అమాయకురాలు!! ఆమని జీవితం ఎంతో ఉన్నతపధంలో నడవాలి!
అందుకు అవసరమయిన త్యాగం అంతా చేయాలి మనం!
కలెక్టర్ అయాక ఆమె పెళ్ళి గురించి ఆలోచిద్దాం"
"అప్పుడది మన మాట వింటుందా? దాని పెళ్ళి మన చేతులమీదుగా చేసే అవకాశం మనకు యిస్తుందా! దాని స్పుత్నిక్ వేగాన్ని మనం అందుకోలేమనుకుంటా" అనేసి గలగల నవ్వింది గాయత్రి.
"యూ ఆర్ పర్ ఫెక్ట్ లీ రైట్! ఆవేశాన్ని అందుకోగలిగితే అప్పుడు ఆ విషయం ఆలోచిద్దాం" అన్నాడు వాల్మీకి.
"వారి మనసులు కొద్దిసేపు ఆమని తాలూకు ఆలోచనలతో పరిమళించినాయి.
"అయిదు రోజులు చేతులు ముడుచుకుని కూర్చోవటం అంటే ఎంత బాధాకరమయిన విషయమో ఆడవాళ్ళకి తెలియదు" వాల్మీకి కామెంట్ చేశాడు.
"చేతులు ముడుచుకుని కూర్చోమని ఎవరన్నారు?"
"మరి ఏం చేయమంటావు-?"
"చేతినిండా పని పెట్టుకోండి! మన రెండు కోటలకి రాజుగారు మీరే! ఎదురేముంది. మేమంతా మీరు చెప్పినట్లు వినుకుంటాం!"
"అత్తాయమ్మగారికి ఈ వ్రతాలు నోములు ఎందుకు గుర్తొచ్చినాయి?"
"అందుకు కారణం మీరే-?" అంది గాయత్రి.
"నేను కారణమా? అదెలా?" కనుబొమ్మలు ముడిపడ్డాయి.
"అంటే మీరు ఒక్కరే కారణం కాదనుకోండి. నేను కూడా...." అంది సిగ్గుపడుతూ.
"అమెగారి వ్రతాలకీ మనకీ ఏమిటి సంబంధం?"
"ఉంది. అమ్మగారు మనవడుకోసం కలలు కంటున్నారు. ఆ సూచనలేవీ కన్పించకపోవడంతో సంతానలక్ష్మి వ్రతం తలపెట్టారు"
"వ్రతాలు చేస్తే పిల్లలు పుడతారంటావా?"
"మీవన్నీ కొంటె ప్రశ్నలు! అమ్మగారికి ఉన్న నమ్మకం అది!"
"అయితే ఈ ప్రేమ అంతా మనమీద కాదు. పుట్టవలసిన వాడి మీద!"
"వాడూ మన శరీరంలో ఒక భాగమే అవుతాడు కదా?"
"ఆల్ రైట్! మీ అమ్మగారి కోరిక తీర్చే ప్రయత్నం చేద్దాం"
"అలా అంటే ఇలా అని కాదు" అంటూ దూరంగా జరిగింది గాయత్రి.
"భర్తగారిని దూరంగా ఉంచేస్తే వ్రతాలు చేసినా పిల్లలు పుట్టరోయ్!"
"ఉదయం పూట ఈ కొంటె మాటలు మొదలెట్టారేమిటి? జరగవలసిన వ్రతం గురించి మాటాడటానికి తెలిసిన వారిని పిలిపించారు అమ్మగారు. ముత్తయిదువలు వస్తారు కదా అని పట్టుచీర కూడ కట్టుకున్నాను"
"పట్టుచీర పెట్టెలోనే నలిగిపోయిందని అడిగిన వారికి చెప్పు" అంటూ వాల్మీకి గాయత్రిని ఆక్రమించుకున్నాడు.
"క్రొత్త బిచ్చగాడు ప్రొద్దెరగడు అంటారు. ఇదే"
"ప్రేమకోసం చేయి చాచినవాడు ఆడవాళ్ళ చూపులకి బిచ్చగాడులాగానో పిచ్చివాడులాగానో కన్పించటం ఈ ప్రపంచానికి క్రొత్త కాదు. కాని నిన్ను మాత్రం విడిచిపెట్టను" అన్నాడు.
"ఆ తరువాత మరింక మాటాడేందుకు అవకాశం దొరకలేదు."
"అమ్మగారు పిలుస్తున్నారు" అంటూ వర్ధని వాకిట్లోంచే వార్త అందించి వెళ్ళిపోయింది.
"మీరు మొరటువారిలా అయిపోతున్నారు. చీర చూడండి ఎలా నలిగిపోయిందో! ఇంకొకసారి యిలా చేస్తే ఊరుకోను" అంది గునుస్తూ.
చీర మడతలు తీర్చుకోవటంలో వాల్మీకి సాయం చేశాడు.
"దేవిగారి అజ్ఞ ప్రకారం సాయంత్రంవరకు సెలవిస్తున్నానులే వెళ్ళిరా!" అన్నాడు.
మెట్లమీదికి హడావిడిగా వచ్చి నెమ్మదిగా దిగుతోంది గాయత్రి.
అబ్బాయి గదిలోంచి వస్తున్న ఆమె వాలకాన్ని సుమిత్రతోపాటు ముత్తయిదువలు కూడ మురిపెంగా గమనిస్తున్నారు.
వీలయినంతవరకు వారికి దొరికిపోకుండా ఉండాలని అలంకారాలు, చెదిరిన జుట్టు బట్టలు సవరించుకొని వస్తోంది గాయత్రి.
కాని అనుభవం కలిగి ఆడపిల్ల మనోగతాన్నిసూక్ష్మంగా గమనించగలిగిన పుణ్యస్త్రీలు వాళ్ళు! ఆమె ముఖంలోని కంగారుని చదివేశారు!
"అబ్బాయి మంచి జోరుమీదే ఉన్నాడు" అంది ఒకామె గడియారం వంక చూస్తూ.
