"ఏం? మాకు ఇంటిపనులే ఎందుకు? మీకు బయటి పనులే ఎందుకు? మేం మాత్రం బయటి పనులు చెయ్యలేమా?"
"చేస్తారేమోగాని, అన్ని పనులూ చేయలేరు"
"అన్ని పనులూ మీ కంటే సమర్ధతతో నిర్వహించగలమని మా స్త్రిలు నిరూపిస్తున్నారు"
"ఏ ఒక స్త్రీయో మినిస్టరుగా రాజ్యాంగాన్ని నడిపితే, ఇండియాలో స్త్రీలందరూ ఆపని చేయగలరనా నమ్మకం? ఎంతో చదువుకొని, కాస్త అలా షాపింగ్ చేయాలంటే కూడా తడబడే స్త్రీలు ఎంతమందిలేరు?"
"షాపింగ్ మీ మగవాళ్ళకంటే కూడా మా ఆడవాళ్ళే బాగా చేస్తారు, తెలుసా?"
"చీరలూ, పౌడర్లూనూ?"
మనోహర్ అంటున్న తీరుకు ఫక్కున నవ్వింది. రజని
ఛాయ ముఖం కోపంతో ఎర్రబడిపోగా, "హాస్యం కాదు? నేను సీరియస్ గా మాట్లాడుతుననాను!" అంది. "మేం అబలలం కాదు.. మేం చేయలేని పనిలేదు"
"అవును. బజార్లో నిన్నొకడు బలత్కారం చేస్తుంటే నిన్ను రక్షించడానికి మరొకడు పరిగెత్తుకు రావాలి!"
"ఛీఛీ! ఇలా అసభ్యంగా మాట్లాడి ఎదుటమనిషిని మాట్లాడకుండా చేయాలనుకుంటే అది ఉత్త కుసంస్కారులు చేసే పని అంటాను" ఛాయ ముఖం కందగడ్డలా అయింది.
"సారీ, మరదలు పిల్లా, ఏదో వరుస కదాని!"
"మా అక్క ఇంకా మీ పెళ్ళామూ కాలేదు. నేను మీ మరదల్నీ కాను. మీకూ మీ వరుసలకూ ఓ దండం. నేను వెడుతున్నాను"
"ఎక్కడికే?" రజిని కంగారుగా అడిగింది.
"భయపడకు. అలిగి వెళ్ళడంలేదు. మా ఫ్రెండ్ రమణి దగ్గరికి వెఢుతున్నాను. మీరు మాట్లాడుతూ ఉండండి."
ఛాయ తుఫాన్ వెలిసినట్టుగా నిష్క్రమించడంతో, "ఛాయబలే దుడుకుపిల్ల,. మీరేమీ అనుకోకండి మనోహర్!" అంది రజని క్షమార్పణ కోరుతున్నట్టుగా.
"ఇప్పుడు తనేం తప్పు మాట్లాడింది? నేనే కొంచెం....."
వంటపూర్తి కావస్తూంది. మంగమ్మ అప్పడాలు వేయించి బాణలి దింపుతుండగా చెయ్యి జారింది. సలసల కాగుతున్న నూనె పాదం నిండా పడి కాలు నిమిషంలో బూరెలా వాచిపోయి అరుపులూ ఏడ్పులూ మొదలెట్టింది మంగమ్మ.
రిక్షాలో వెళ్ళి డాక్టరుకు చూపించుకు రమ్మని పంపించింది కోమలమ్మ.
ఒంటిగంట అయింది. మంగమ్మ ఇంకా రాలేదు.
వచ్చినా ఆ కాలు నొప్పితో వడ్డిస్తుందన్న నమ్మకం లేదు. వంటా వడ్డనా అలవాటు తప్పి ఎన్ని సంవత్సరాలైందో కోమలమ్మకు.
"పారూ! నడుముకు కాస్త కొంగుచుట్టే!" అంది పారిజాతతో. "చూడు వాళ్ళేమైనా అడిగితే నీకేమీ తెలియనట్టుగా మౌనంగా వుండు!"
పారిజాత బుద్ధిగా తలూపి, టేబిల్ మీద వడ్డనకు ఏర్పాట్లు చేయసాగింది.
టేబుల్ అటుఇటుగా ఛాయ, రజని, మనోహర్ కోమలమ్మ కూర్చున్నారు. పారిజాత వడ్డిస్తూంది.
తమల పాకులా నాజూకుగా ఉన్న పారిజాతను చూసి, "ఎవరత్తయ్యా ఈ అమ్మాయి?" అని అడిగింది రజని.
"మా పని మనిషి!" కోమలమ్మ తడుముకోకుండా సమాధానం చెప్పింది.
మనోహర్ చివ్వున తలెత్తి తల్లిముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. కోమలమ్మ అదేం పట్టించుకోనట్టుగా కూర్చొంది.
"నీ పేరేమిటి?"
"............" పారిజాత బెల్లం కొట్టిన రాయిలా నిలబడింది.
"చెప్పవే!" తెచ్చుకొన్న చిరునవ్వుతో చూసింది కోమలమ్మ.
"పారిజాత"
"పేరుకూ, రూపానికి చాలా బాగా కుదిరింది."
భోజనాలయిపోయాక డ్రాయింగ్ రూంలో అక్కా చెల్లెలు ఇద్దరే మిగిలేసరికి, "ఇంత సహజ సౌందర్యవతిని ఇంట్లో ఉంచుకొని నీ మనోహరుడు మడికట్టు కొన్నాడంటావా, అక్కా?" అంటూ తన సందేహం వెలిబుచ్చింది.
