కళ్ళుకళ్ళు, మాట మాట కలుపకపోయినా కనిపించని అనుబంధమేదో దేవదాసి అంతరంగాన్ని బంధించివేస్తున్నది. చిత్రంగా కొన్నాళ్ళుగా ఆమెను వేధిస్తున్న ఒక భయం తొలగిపోయింది. అది బావను ప్రేమించి భగ్నమొందిన మనసుతో అగ్నిసాక్షిగా పెళ్ళాడిన వ్యక్తిని ప్రేమించలేనేమోనని!
ఎంత ఓపిక తెచ్చుకొందామన్నా ఈ మధ్య స్నానభోజనాలకు దేవతార్చనకు కూడా లేవలేకపోతున్నారు రావుగారు. దగ్గు, ఉబ్బసం కొత్తగా ఆరంభమయ్యాయి. పూర్తిగా నీరసించిపోయారు. ఇక ఎన్నాళ్లో బ్రతుకుతానన్న ఆశ ఆయనలో నశించిపోయింది.
పూర్తిగా అనారోగ్యమని చెప్పటానికి వీలులేదు కొంత మనోవ్యాధికూడా ఆయనను క్రుంగదీసింది. పైకి చెప్పుకోకపోయినా ఆయన ఆలోచనలన్నీ ఈ మధ్య కొడుకు మీదికి పరుగులు పెడుతున్నాయి. భార్గవరామ్ ఇక్కడినుండి వెళ్ళాక ఒకటి రెండు ఉత్తరాలు వ్రాశాడు. ఆ తరువాత అతడినుండి మరి ఉత్తరాలు లేవు. 'ఎలా ఉన్నాడో? ఎక్కడ ఉన్నాడో?' అనేదే ఆయనను కొరుక్కుతింటూంది.
కొడుకును గురించి కృష్ణవేణి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయోగాని పైకి అతడి సంగతే మరిచిపోయినట్లు, గుంభనంగా, గంభీరంగా ఉంటుంది. ఏం బయటపడినా హాస్యాస్పదం కారణంకదా? కొడుకుమీద అంత అభిమానం ఉన్నదానివి, ఈ దత్తపుత్రుని ఎందుకు సంపాదించావు? అని నవ్విపోగలరు విన్నవారు!
'భార్య అయినా కొడుకు సంగతి ఎత్తుతుందేమో' తమ మనసులో బెంగ బయటికి కక్కి తేలిక పడదామనుకొంటారు రావుగారు. ఆమె ఆ అవకాశం ఇవ్వదాయనకు.
ఆరోజు భార్య దగ్గర లేకుండా చూచి, గోవిందస్వామితో చెప్పుకొన్నారు తమ బాధలు, రావుగారు. "భార్గవుడీమధ్య కళ్ళగట్టినట్లున్నాడు, గోవిందస్వామీ! వాడినుండి ఉత్తరాలు లేవు. మనం వ్రాసినా జవాబు యిస్తాడన్న నమ్మకం లేదు. మీ అమ్మగారికి తెలియకుండా నువ్వేం చెయ్యాలంటే...." ఆయాసంతో, ఆవేశంతో కొద్దిసేపు ఆగి, అన్నారు. "నువ్వెళ్ళి బాబును తీసుకువచ్చేసెయ్యాలి ఏం?
గోవిందస్వామి ముఖం వివర్ణమైంది. "ఎక్కడికని వెళ్ళను, బాబూ?" హీనస్వరంతో అన్నాడు.
"వాడు వెళ్ళాక వ్రాసిన ఉత్తరంలో అడ్రస్ యిచ్చాడు."
"బాబూ!"
"ఏమిటి స్వామీ?"
"చినబాబు అక్కడ లేడు." గొంతు అతిప్రయత్నంతో పెగిలింది.
"ఎలా తెలుసు? నీకెలా తెలుసు?"
"దొరసాని దత్తు ప్రయత్నంలో ఉండగానే నేను చినబాబుకోసం వెళ్ళాను. దొరసాని పిచ్చితనంవల్ల చినబాబు ఆస్తి మరెవరికో అంటగట్టబడుతుందన్న మంటలు నా కడుపులో లేచాయి. చినబాబును ప్రాధేయపడి తీసుకువచ్చి ఆస్తి పరులపాలు కానివ్వకూడదన్న ఉబలాటంతో వెళ్ళాను. కాని చినబాబు అక్కడలేడు."
"మరి ఎక్కడికి వెళ్ళాడు? ఆ సంగతైనా తెలిసిందా, రావుగారు ఆత్రంగా అడిగాడు. చెప్పలేక చెప్పాడు "ఏదో ఆశ్రమానికి వెళ్ళినట్లు తెలిసింది."
దీర్ఘంగా నిట్టూర్చారు రావుగారు. కన్నుమూసేలోగా కొడుకును చూస్తానన్న ఆశ పూర్తిగా అడుగంటింది.
గోవిందస్వామి అటువెళ్ళాక కాస్సేపటికి కృష్ణవేణి గదిలోకి వచ్చింది. తడిసిన ఎర్రబడ్డ కళ్ళను మాటిమాటికీ తుడుచుకొంటూ, మౌనంగా కూర్చొంది. చూచి విచారంగా ముఖం తిప్పుకొన్నారు రావుగారు.
పట్నం నుండి పేరుమోసిన డాక్టర్లను తీసుకువచ్చి చూపిస్తున్నాడు రమణ. డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేస్తున్నాడు. పెంపుడు తండ్రికి ఆరోగ్యం చేకూరాలని కన్న కొడుకు చూపించని శ్రద్ధాసక్తులు చూపెడుతున్నాడు ఆయనయందు.
కాని, ఎవరి సేవాశుశ్రూషలూ, అనురాగాలు ఆయనను నిలుపలేవు. చివరిదాకా కొడుకును స్మరిస్తూనే దాటిపోయారు ఒక అర్థరాత్రి సమయాన.
"ఆ కొడుకు ఎంత కఠినాత్ముడమ్మా? 'రామా, రామా రామా' అంటూనే కళ్ళు మూశాడు!"
