Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 39

 
    "మీరు జల్సాగా ఓ పదిరూపాయలు ఖర్చు పెట్టుకొన్నా మీమీద కేకలేసే అధికారం మీ భార్యకేమీ వుండదు కదా?" అంది హరిత.

    "అధికారులు. హక్కులూ అనుకొంటూ కూర్చుంటే ఏ సంసారమూ సవ్యంగా సాగదమ్మాయ్. భార్య భర్త లంటే సంసారానికి  రెండు చక్రాలు. కలిసి సమంగా సంసార మన్న బండిని  నడపాలి. అధికారాలు. హక్కులూ నువ్వెక్కువా, నేను తక్కువా అనుకొంటూ కూర్చుంటే ఏ సంసారమూ సవ్యంగా సాగదు."

    సంసారానికి రెండు చక్రాలని చెప్పడం వరకే నిజానికి ఎక్కడ చూసినా స్త్రీ అణచివేత, పురుషుడి అధికారం, జులుం కొట్టివచ్చినట్టు కనపడతాయి! ఈ మాట హరిత మనసులోనే అనుకొంది. పైకి అంటే ఈ అమ్మాయికి చాలా తీవ్రమైన భావాలున్నాయే అనుకొంటాడు. అమ్మా నాన్న కి కష్టం కలిగిస్తుంది. అనుకొన్న హరిత ఇక వాదం పెంచదలచుకోలేదు. వరకట్నం అనుకొన్న హరిత ఇక వాదం పెంచదలచుకోలేదు. వరకట్నం తీసుకొనే వాళ్లమీద మీకున్న అబిప్రాయం ఏమిటి? అని పెళ్లికొడుకును అడగాలని వుంది. అతడితో సంభాషించి అతడి అభిప్రాయాలు. అభిరుచులు తెలుసుకోవాలని వుంది కాని అదంతా అమ్మానాన్న కిష్టముండదని లోపలే అణిచేసుకుంది.



                       *    *    *    *   



    హరిత వివాహం కమలాకర్ తో జరిగిపోయింది. పక్షం రోజులు తరువాత ఒక శుభముహూర్తాన. అంతా సంప్రదాయబద్దంగా జరిగిపోయింది. హరిత ఫ్రెండ్సు కొందరు విమర్శించారు కూడా హరిత  వుపన్యాసాలు విన్న వాళ్లెవరూ హరిత ఇలా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొంటుందని అనుకోరు. వరకట్న పిశాచం పీడ తొలగిపోవాలంటే యువతీ యువకులు కులాంతర వివాహాలకు సిద్దపడాలి అనేది ప్రేమ వివాహాలే పరిష్కార మార్గాన్ని చూపిస్తాయనేది! చివరకు తను మాత్రం లక్ష కట్నం ఇచ్చి అమ్మానాన్న తెచ్చిన కుర్రాడితో తలవంచుకొని మూడుముళ్లు వేయించుకొంది" అని.

    "కట్నంలేని ఆదర్శవివాహం అన్నారే" అంది ఒక అమ్మాయి.

    "అవన్నీ వట్టి మాటలు.  లక్షరూపాయలు లోపల్లోపలే అందించాడు హరిత తండ్రి. పైకి ప్రచారం మాత్రం ఇలా జరుగుతూంది."

    "లక్ష కట్నం ఇచ్చినప్పుడు అంత ఇచ్చామని దర్జాగా చెప్పుకోవచ్చు కదా?"

    "వరకట్నం ఇవ్వడం నేరం, పుచ్చుకోవడం నేరం కదా? పెద్దవాళ్ళ పనులన్నీ ఇలాగే చాపకింద నీరులా జరుగుతుంటాయి."



                     *    *    *    *   


   
    పెళ్లికని పెట్టిన సెలవు అయిపోగానే భార్యని కాపురానికి తీసికెళ్లాడు కమలాకర్.

    క్రొత్తచోటుకి, క్రొత్త  జీవితానికి అలవాటుపడుతూంది హరిత.

    ఓరోజు భర్తతో అంది. "రుక్మిణీఅమ్మాళ్" అని గొప్ప సంగీత విద్వాంసురాలు, టి. వి. లో రేడియోలో ఆమె పాటలు చాలాసార్లు విన్నాను. ఆవిడ ఈ కాలనీలో వుంటారట. ప్రక్కింట్లో అరుణ లేదూ? ప్లీడరుగారి అమ్మాయి? రోజూ సాయంత్రం సంగీత పాఠం  చెప్పించుకోవడానికి వెడుతుందట. నేను రేపటి నుండి వస్తానని చెప్పాను ఇన్నాళ్లు చదువు వుండడం వల్ల సంగీతం మీద ఎక్కువగా శ్రద్ద పెట్టడానికి లేకపోయింది ఇప్పుడు చదువులేదు!  అదృష్టవశాత్తు గొప్ప సంగీత విద్వాంసురాలు దగ్గరే వుంది. ఈ అవకాశం నేను పోగొట్టుకే దలచలేదు!"

    "ఏమిటి? సంగీతం నేర్చుకోడానికి వెడతావా?" కమలాకర్ అప్రసన్నంగా ముఖంపెట్టి అడిగాడు.
 
    "అదేకదా నేను చెప్పింది."

    "పెళ్లి కాకముందు ఏదో కాలక్షేపానికి ఆటాపాటా నేర్చుకొన్నావు. ఇప్పుడు, పెళ్లయ్యాక కూడా ఏం పాటలు లెద్దూ!" తేలిగ్గా తీసివేస్తూ అన్నాడు. "ఇప్పుడు సంసారమే ఓ పాట ఓ ఆట అనుకో."
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS