"అంటే ఇప్పుడు వాడ్ని తీసుకొని నాగపూర్ వెళ్ళాలంటావు" అన్నారు.
"మరెలాగండి. ఈ సంవత్సరం ఎలాగయినా ప్రయత్నించి ఇక్కడే స్కూల్ లో జాయిన్ చేసేద్దాం" అన్నాను.
"అయితే ఎప్పుడు బయలుదేరదామను కుంటున్నావు?" అని అడిగారు.
'ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం" అన్నాను.
* * * *
అనుకున్న ప్రకారం బైజుని మళ్ళీ నాగపూర్ తీసుకువెళ్ళి పిల్లల దగ్గర వదిలేసి వచ్చేశాను. పిల్లల్ని వదిలి వుండడం చాలా కష్టం అనిపించేది మాకు.
ముఖ్యంగా నా పరిస్థితే మరీ దారుణంగా వుండేది. ఇటు వీరు... అటు పిల్లలు!
నా పనివాళ్ళనంతా నా పిల్లల రక్షణకి వదిలినా, దాకట్లో వెలంకాయలా కొట్టుకుపోయేదాన్ని. ఫోనులో పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవడం వల్ల టెలిఫోన్ బిల్లులువచ్చి జడిపించేవి. చచ్చేటట్టు కట్టుకొనేవాళ్ళం.
ఇంతలో_హైదరాబాద్ నుండి జూలై నాలుగోతేదీన అభ్యుదయ రచయితల సదస్సు, ఆ మర్నాడు అదే ఊర్లో శ్రీశ్రీగారికి సన్మానమూ చేస్తున్నామని ఉత్తరం వచ్చింది. తర్వాత ఫోనుల వర్షం కురవడం ప్రారంభించింది.
ఆ ఫంక్షన్ కి వెళ్ళమని కొందరూ, వెళ్లొద్దని కొందరూ కుప్పలు కుప్పలుగా ఉత్తరాలతో, టెలిగ్రాములతో దండయాత్ర ప్రారంభించారు.
ఈ విషయంలో ఏం చేయాలో తోచక శ్రీశ్రీగారు తీవ్రంగా ఆలోచించడం 'ఏంచేద్దాం సరోజా' అని నన్ను అడగడంతో "మీరింతగా ఆలోచించడానికి కారణం ఏమిటో నాకు వివరంగా చెప్తే నా అభిప్రాయం చెప్తానండి" అన్నాను.
"నాకు సన్మానం చేస్తారు. ప్రధాన అతిథిగా బ్రహ్మానందరెడ్డిగారు వస్తున్నారు. వారే నాకు వెయ్యినూట పదహార్లు ఇచ్చి సత్కరిస్తారు. ఆ సభకి వెళ్ళి సన్మానాన్ని స్వీకరించడమా,మానెయ్యడమా? ఆర్ధికంగా మన పరిస్థితులు బాగులేవని నాకుతెలుసు. నీ ఉద్దేశం ఏమిటి?" అని అడిగారు.
"మనం వెళ్ళినందువల్ల నష్టం ఏమైనా వుందా" అని అడిగాను.
"వెళ్ళినందువల్ల వుండదు. ఆ డబ్బు స్వీకరించడం వల్ల వుంటుంది" అన్నారు.
"మన వాళ్ళంతా ఏమంటున్నార"ని అడిగాను. (వాళ్ళ పేర్లు అనవసరం)
"మనవాళ్ళు మాత్రమేకాదు. చాలా మంది ఆ సన్మానానికి వెళ్ళడానికి వీల్లేదని అంటున్నారు" అన్నారు.
"వెళ్ళి ఆ డబ్బు తీసుకుంటే మీకు అపకీర్తి వస్తుందా" _ అని అడిగాను.
"ఆఁ ఒక విధంగా వస్తుంది" అన్నారు.
'అయినప్పుడు దానికింత ఆలోచన ఎందుకండీ. మన దరిద్రం ఈ ఒక్కదానితోనో, ఈ ఒక్కనాటితోనో తీరేదికాదు. మా కోసం మీరు మీ కీర్తికి అప్రతిష్టతెచ్చే పని చెయ్యవద్దు. నేను రాకముందు మీరు సంపాదించుకున్న కీర్తిని చెడగొట్టుకోవద్దు.
మనకేమీ ఫరవాలేదు. డబ్బు కష్టపడి ఎలా గయినా సంపాదించుకుంటాం. కీర్తిమాత్రం అలా వచ్చేదికాదు. ఇప్పటికే మిమ్మల్ని మార్చేశానని చాలామంది ఏడుస్తున్నారు.
'పెళ్ళాం పిల్లల కోసం శ్రీశ్రీ ఇలాంటి పనిచేసి అప్రతిష్ట పొందాన్న మాట నాకూ, పిల్లలకి రానివ్వకండి. మీకు సంబంధించినంతవరకూ ఏ పనయినా (అది కూడా ముఖ్యంగా డబ్బు విషయంలో)మా కోసం పెట్టుకోకండి. మీ కీర్తికి భంగం కలగడానికి నేను ఒప్పుకోను. అందుకు మేము కారకులం కాకూడదు.
ఒక్కపాట రాస్తే పదిహేను వందలు తెచ్చుకుంటారు. ఇది ఆఫ్ట్రాల్. వెయ్యి నూటపదహార్లు. దాని విలువ ఎక్కువైతే కావచ్చు.కాదనను. మీరు మాకు మాత్రమే పరిమితంకాదు. ఎలా చెప్పాలో. నాకు సరిగ్గా చెప్పడానికి చేతకావడంలేదు. మీ నిర్ణయంతో, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తానే కానీ ఎప్పుడూ ఎదురుతిరగను. నేను డబ్బుకి ఆశపడే మనిషినికానని మీకు బాగా తెలుసు" అని నేను అంటూ వుంటే_
"అబ్బబ్బో! పొట్టిగాడు" అని మాత్రమే అన్నారు.
"ఇంతకూ ఏం చెయ్యదలచుకున్నార"ని మళ్ళీ అడిగాను.
నా బాధ నాది. వారి నిర్ణయం తెలుసుకోవాలన్న ఉబలాటమే తప్ప మరేంకాదు.
"ఏవండీ_మిమ్మల్నే" అన్నాను.
"ఇది అంత తొందరపడి తేల్చాల్సిన విషయం కాదు సరోజా! ఇందుకు నాలుగు మార్గాలున్నాయి. ఒకటి_గైరుహాజరు కావడం, రెండు_అభ్యుదయ సదస్సులో పాల్గొని సన్మానాన్ని నిరాకరించడం, మూడు_సన్మానాన్ని మాత్రమే స్వీకరించడం, నాలుగు_అన్ని సభలకూ హాజరు కావడం.
ఈనాడు నేనొక వ్యక్తిమాత్రుడ్ని కాను. ఒక మహోద్యమానికి ప్రతినిధిని. నేను గైరుహాజరు కావడం అంటే ఉద్యమానికి ద్రోహం చేయడమే అవుతుంది. అంతేకాదు. ఉద్యమ విరోధులంతా నాకు పిరికితనాన్ని అంటగట్టవచ్చు.
సన్మానాన్ని మాత్రమే స్వీకరిస్తే 'శ్రీశ్రీ స్వార్ధపరుడురా' అంటారు. ఒకరు అంటారని కాదు సరోజా! అది ముమ్మాటికీ స్వార్ధపరత్వమే అవుతుంది. వెళ్ళకుండా మానెయ్యడం మంచిదే. కానీ, వెళ్ళి సన్మానాన్ని స్వీకరించకుంటే బ్రహ్మానందరెడ్డిగారిని అవమానించినట్టు అవుతుంది. ఇప్పుడైనా అర్ధమైందా?" అన్నారు.
ఈ తికమకల సన్మానాన్ని గురించి విని నాకు పిచ్చిపట్టినంతపనయ్యింది. చివరికి వారితో, "చూడండి ఇన్ని గొడవలేకాక, ఇంతమందిని ఎదిరించామన్న పేరూ_విరోధంతో కూడిన ఈ సన్మానం మనకొద్దండీ. నేను రాను. మిమ్మల్ని వెళ్ళనివ్వను" అన్నాను.
"అదే తప్పు సరోజా! వెళ్ళాలి. వెళ్ళి అభ్యుదయ సదస్సులోనూ, ఆ సందర్భంలో జరిగే కవి సమ్మేళనంలోనూ పాల్గొనాలి. ఈ మధ్య నేను రాసిన కొన్ని రచనలు చదవాలి" అని అన్నారు.
