Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 39

    "ఎందుకలా  అంటున్నారు?" అని అడిగాను.

    "1970 జనవరి రెండవతేదీన  జరగాల్సిన షష్టిపూర్తి  సభ  కారణాంతరాల వల్ల 1_2_70లో జరిగింది_ కొద్దిగా అంకెలమార్పు అంతే. పెద్ద తేడాలేదు. 1970 ప్రారంభమయ్యింది  మొదలు ఊపిరి తీసుకోడానిక్కూడా  తీరిక చిక్కడంలేదు.

    జనవరి (1970) 28వతేదీ  హైదరాబాద్, 30వ తేదీ అదే ఊర్లో  సాహిత్య అకాడమీ సభ్యత్వం, 31వతేదీ విశాఖపట్నానికి  ప్రయాణం, ఫిబ్రవరి 1వతేదీ విశాఖ, 2వతేది  విజయనగరం, అదేరాత్రి  విజయనగరంలో సభ అయిపోయిన తర్వాత కారులో  శ్రీకాకుళం, 3వతేదీ  శ్రీకాకుళంలో, మర్నాడు నాలుగోతేది మళ్ళీ విశాఖ వచ్చాము.

    అక్కడినుండి  మళ్ళీ వెంటనే బైజుతో ఇక్కడికి వచ్చానా రెండు రోజులు రెస్టు మళ్ళీ మనం 8వతేదీ  బెజవాడ వెళ్ళి అక్కడ నుండి  నూజివీడు సభకి వెళ్ళాలి. 13వ తేదీ చిత్తూరు, 15, 16తేదీలలో  మదనపల్లి, 22వ తేది తిరుపతి, 28వతేదీ కర్నూలు, తర్వాత మార్చి 1వతేది నెల్లూరు..." అని ఇంకా చెప్పుకుపోతున్నారు.

    "అబ్బ! అక్కడితో  చాల్లెండి" అన్నాను.

    నేను మా బైజుకూడా  వారితోపాటు  అన్ని మీటింగులకి  వెళ్ళాం. చిత్తూరు నేను వెళ్ళలేదు. మా బైజుమాత్రం వెళ్ళాడు. మదనపల్లి నేను వెళ్ళాను. నాకు బాగా జ్ఞాపకం_నేనూ, మావారూ మార్చి ఒకటో తేదీన నెల్లూరువెళ్ళి శ్రీ అనంతరామయ్యగారి  ఇంట్లో వేదిగాం. అదీ షష్టిపూర్తికి  సంబంధించిన  సభమాత్రం కాదు. అనంతరామయ్యగారు మమ్మల్ని  ఎంతో ఆప్యాయంగా ఆదరించారు.

    ఆ రోజు సభలో  శ్రీశ్రీగారు ఓ గంటసేపు  అద్భుతంగా  మాట్లాడారు. వారు మాట్లాడుతూ  మధ్య మధ్య నా ముఖం  చూసేవారు.ఆ రోజు మీటింగ్ లోనే కాదు. నేను వారితో  కలసి వెళ్ళిన  ఏ మీటింగ్ కయినా సరే!

    ఆరోజు  సభ ముగిసి ఇంటికి చేరుకున్నాం. భోజనాలయ్యాక  మేమిద్దరం కూర్చున్నాం. రాత్రి ఒంటిగంట కావస్తోంది.

    నేను వారిని  ఓ ప్రశ్నవేశాను. "ఏవండీ  ఈరోజు  చాలా బాగా మాట్లాడారు. అదిసరే  కానీ మీరు సాధారణంగా ఎక్కడైనాసరే సభలో  ఏ మాట తోస్తే  ఆమాట అనేస్తారు. అలాగే రాయదలచుకున్నది రాసేస్తారు. ఇలా చేస్తే విన్నవాళ్ళకీ, చదివిన వాళ్ళకి ఒళ్ళు  మండదుటండీ" అని అడిగాను.

    "అలా మాట్లాడటం, ఇలా రాయడం ఒళ్ళు మండించడానికే సరోజా!" అన్నారు.


                                   సన్మానంలో  తికమకలు


    "జీవితం  ఒక జూదంగా పరిణమించింది. ఇష్టంవున్నా లేకున్నా  అందరం ఇందులో పాల్గొనవలసిందే. ఈరోజు  సభలో  సాహిత్యం గురించే ఎక్కువగా మాట్లాడవలసి వచ్చింది. నేనెవరి గురించి మాట్లాడానో తెలుసా?" అని అడిగారు శ్రీశ్రీగారు.

    "భలేవారండీ. అంత మొద్దుని చేసెయ్యకండి. తిక్కన్నగారి గురించి" అన్నాను.

    "ఎలా మాట్లాడాను?" అని అడిగారు.

    "చాలా బాగా  మాట్లాడారు. అయినా  మీకీమధ్య  నోరు హెచ్చయిపోయిందిలెండి. మొదట్లో  వేదికమీదకి వస్తే శ్రీశ్రీ నోరువిప్పితే  బాగుండుననిపించేవారు. ముక్తసరిగా మాట్లాడేవారు. ఇప్పుడు తెగ మాట్లాడేస్తున్నారు. మధ్యమధ్యలో  జంప్ లు వేరే" అన్నాను.

    "అంటే?" అన్నారు.

    "ఒక సబ్జెక్టులోంచి  మరో దానిలోకి  ఠక్కున  జంప్ చేసేస్తారు"అన్నాను.

    ఆయన ఏం మాట్లాడలేదు. సిగరెట్ పెట్టె తెమ్మన్నారు.

    చేతికందిస్తూ "ఏవండీ బైజు చదువు పాడైపోతోందండీ. వాడ్ని తీసుకువెళ్ళి  పిల్లలదగ్గర వదిలేసి వచ్చేస్తాను" అన్నాను.

    "ముందు నా జేబులో  డబ్బుతీసి జాగ్రత్తగా వుంచు" అన్నారు.

    "ఎక్కడికి పోతుందిలెండి" అన్నాను.

    "చూశావా పోతుంది అంటే జ్ఞాపకం వచ్చింది. నీతో చెప్పడం మరచిపోయాను. నేనూ బైజూ కలిసి చిత్తూరునుండి ఎక్స్ ప్రెస్ లో కదా ఇంటికి వచ్చాం. నేను చిత్తూరు నుండి బయలుదేరినప్పుడు రెండు వందల రూపాయలు జేబులో పెట్టుకున్నాను. స్టేషన్ లో దిగి చూసుకునేసరికి లేవు" అన్నారు.

    "ఎలా పోయాయండీ" అని అడిగాను.

    "అవి  పోవడానికి ఓ పోలీసువాడు కారణం అనిమాత్రం నాకు తెలుసు. డిటెయిల్స్  అనవసరం. నీతో చెప్తే తిడతావని చెప్పలేదు" అన్నారు. "దేనికి? డబ్బు పోయినందుకా? లేక పసివాడు  పక్కనున్నా, రాత్రి ప్రయాణమైనా  పెగ్గులు బిగించినందుకా?" అని అడిగాను.

    "నీతో సాల్లేము  సరోజా! నువ్వు రాక్షసివి" అన్నారు.

    "అయినా మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నాను. ఎంత రాక్షసినయితే  మాత్రం ఏం లాభం? మీచేత తాగుడు మాన్పించలేకపోతున్నాను" అన్నాను.

    "తాగుడు  నాచేత  పూర్తిగా  మాన్పించలేకపోయినా  ఆ అలవాటుని బాగా తగ్గించేశావని  మాత్రం ఒప్పుకో. దెయ్యంలా పట్టుకున్నావు. తాగడం విషయం  నా యిష్టానికి వదిలెయ్యి బాబూ అన్నా వినవుకదా" అన్నారు. "మరైతే నన్నెందుకు వెంటబెట్టుకొని  ఈ మీటింగులకి వస్తారు? నేను లేకుంటే మీరు ఫ్రీగా ఉండొచ్చుగా" అనడిగాను.

    "అలా అంటావేకానీ  నన్ను కంట్రోల్ చెయ్యడానికైనా  నువ్వు కావాలి. ఐ లవ్ యూ సరోజా!" అన్నారు.

    "అర్ధరాత్రి లవ్ బాగానేవుంది కానీ బైజు  చదువుమాట మరచిపోతున్నారు" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS