అలా చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
ఆయన ఏ విషయమైనా నాతో చెప్పకుండా వుండేవారు కారు. ఏ పనైనా నన్ను అడగకుండా చేసేవారు కారు. అలాగని నేనొద్దంటే మానేస్తారని కాదు. వారు చెయ్యదలచుకున్న పనికి నేను అడ్డు తగలనని, తనమాట కాదననని వారికి బాగా తెలుసు. అందుకే ప్రతీ విషయం నాతో చెప్పేవారు నేను ప్రతీదానికీ వాదించేదాన్ని.
వారికి కావాల్సింది కూడా ఆ వాదనే. విన్నంత వరకూ విని, విసుగెత్తితే, "నీకేమీ తెలియదు. నోరు మూసుకో" అని ఒక్కోసారి అనేసేవారు.
'శ్రీశ్రీగారు తన పెళ్ళాంతో ఇటువంటి విషయాలు కూడా చర్చించేవారా' అని చాలామంది అనుకోవచ్చు. 'నిజం' అని చెప్పినా నమ్మకపోవచ్చు. నమ్మినా నమ్మకపోయినా ఇవి నిజాలు. మా జీవితంలో జరిగిన విషయాలు, మర్చిపోయినవి పోగా జ్ఞాపకం వున్నంతవరకూ దాపూ మూపూ లేకుండా రాయదలచుకున్నవి రాసేస్తున్నాను.
రెండు రోజుల తర్వాత బైజుని తీసుకొని నాగపూర్ వెళ్ళిపోయాను. మా పిల్లల చదువులు నిరాఘాటంగా సాగిపోతున్నాయి. నాకు కావలసిందీ అదే! అదే నా జీవిత లక్ష్యం కూడా.
నాకు ఇంగ్లీషు అప్పట్లో అసలురాదు. పెద్ద చదువులేదు. ఎండాకాలం చదువైనా, మా నాన్నగారు నాకు తెలుగుభాష మాత్రం బాగానే నేర్పించారు. ఇంగ్లీషు మాట ఎత్తడానికి వీలులేదు. కారణం_ఆడపిల్లలు కాలేజీలకి వెళ్ళి ఇంగ్లీషు చదువులు చదివితే చెడిపోతారన్న ఒక అభిప్రాయం.
అందుకే నాలో కసి బాగా పెంచుకున్నాను. నా పిల్లలు పెద్ద చదువు చదివి, పెద్ద ఉద్యోగాలు చేసి, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడేయాలి. అదొక్కటే నాకు పట్టిన పిచ్చితోపాటు కోరిక కూడా.
నా అభిప్రాయానికి ఏనాడూ ఆయన ఎదురు తిరగలేదు. పోతే చదువు విషయంలో పిల్లల్ని ఎక్కువ బాధపెట్టేస్తున్నానని, కాల్చుతింటున్నానని అప్పుడప్పుడూ నన్ను తిట్టేవారు.
"పిల్లలేమైనా బిఏలూ యమ్మేలూ చదివేస్తున్నారా? ఒక్కరోజయినా వాళ్ళు స్కూలుకి వెళ్ళకుంటే ఊరుకోవు. నీతో ఛస్తున్నాం నాయనా" అని విసుక్కునేవారు.
"ఇప్పుడిలా కష్టపడి మనం చదివిస్తేనే రేపు వాళ్ళు బిఏలకి యమ్మేలకి వెళ్ళగలుగుతారు. లేకుంటే ఇంతే సంగతులు"_అనేదాన్ని.
అర్ధరాత్రి ఆవిర్భవించిన విరసం
నేను శ్రీశ్రీగారి దగ్గరలేని పదిరోజుల్లో మా ఇద్దరిమధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతూవుండేవి. తను ఏ రోజు ఏ పూట ఎన్ని గంటలకి ఏం చేశోవారో ప్రతీఒక్క విషయమూ తన మూడునిబట్టి, అతి ప్రేమగానో, లేకుంటే అతి సున్నితంగా చివాట్లు పెడుతూనో రాసేవారు.
ఆ ఉత్తరాలన్నీ ప్రాణప్రదంగా దాచుకున్నాను. అందులో ఒక ఉత్తరం ఈ దిగువ రాస్తున్నాను.
మైడియర్ లవ్వింగ్ వైఫ్,
నీ కొక్కిరి బిక్కిరి ఉత్తరం అందింది. అది నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాసినట్టులేదు. ఆ ఉత్తరం పదవ తేదీన రాశావు. నేను పదకొండో తేదీన టెలిగ్రామ్ ఇచ్చాను. నిన్నరాత్రి రెండున్నర గంటలకు మీ అన్నయ్యగారు ట్రంకాల్ మాట్లాడారు. నువ్వూ పిల్లలూ సినిమాకి వెళ్ళారని చెప్పారు. నాగపూర్ లో రాత్రి రెండున్నరదాకా కూడా సినిమాలు ఆడతాయేమిటి?
నువ్వు పిల్లల్ని ఒక్క క్షణం కూడా వదలవద్దు. దీపావళికి నేను వస్తాను.
మన శత్రువులు పన్నిన వలలో మీ అన్నయ్యగారు కూడా పడుతున్నారేమోనని నా అనుమానం.
నాకు అబద్దాలన్నా, అబద్దపు బ్రతుకన్నా అయిష్టం. మన డబ్బు మనకి చాలు. మన బ్రతుకులు మనకిచాలి. పోతే_మద్రాసులో పిల్లలకి సీట్లు దొరకనందున వాళ్ళ చదువుల కోసం అక్కడ నువ్వు పాతుకుపోవడం నాకు చాలా కష్టంగావుంది. 'ఒక్క సంవత్సరం చదువుపోయినా ఫరవాలేదు బాబూ!' అన్నా నువ్వు వినవు.
రోజుకో ఉత్తరం రాస్తానన్నావు. నాలుగురోజుల కొకటైనా రాస్తున్నందుకు సంతోషం.
చైనా అనిగానీ, నక్సలైట్ అనిగానీ, ఆఖరికి కమ్యూనిస్టు అనిగానీ ఏ ఉత్తరంలోనూ రాయకు.
ఇవేవీ నీకు అర్ధంకావు. నాకు మాత్రం ఇవన్నీ అర్ధం అయితే కదూ!
అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నాను_అంతే. ఎన్ని పనులున్నా రోజుకో తీయని లవ్ లెటర్ రాసి పడేస్తూ వుండు. అదే నాకు ఎక్కడలేని బలమూ ఇస్తుంది.
విత్ లవ్ అండ్ కిసెస్
యువర్ డియర్ హజ్ బెండ్ శ్రీశ్రీ
ఈవిధంగా వారు రాసే ఉత్తరాలు చాలా గమ్మత్తుగా వుండేవి.
నా మనస్సు విశాలమైన మౌంట్ రోడ్డని ఒక ఉత్తరంలోనూ, నీకివాళ మాట రేపు పరగడుపు అని ఇంకోదాంట్లోనూ, పేడకుప్పలా ఎక్కడుంటే అక్కడ పాతుకుపోతావని మరొకదాంట్లోనూ, రైల్వేవాళ్ళని పోషించడానికే నువ్వున్నావని మరో ఉత్తరంలోనూ రాసేవారు.
పొట్టీ, పట్టూ, ముసలీ, మైడియర్ రోజా, బంగారు పిచికా...ఒక్కటేమిటి ఇలా ఎన్నో సంబోధనలతో ఎంత తియ్యగా రాసేవారో, అంత గట్టిగానూ మొహం వాచేటట్టు చివాట్లతో కూడా రాసేవారు.
1970 జూన్ 28వ తేదీన 'లెటర్ ఫాలోస్_స్టార్ట్ ఇమీడియట్లీ' అని టెలిగ్రాం ఇచ్చారు. మర్నాడు ఉత్తరం అందింది.
"జూలై నాలుగవ తేదీన హైదరాబాదులో సన్మానం జరుగుతోంది. నువ్వు నాగపూర్ నుండి తిన్నగా హైదరాబాద్ కి మూడవ తేదీ ఉదయానికే వచ్చేసెయ్. ద్వారకలో పంతొమ్మిదవ నెంబరు రూమ్ బుక్ చేశాను.
