Previous Page Next Page 
కావేరి పేజి 39

    విసురుగా రాబోతున్న కొడుకుని చూసి తన చూపులలోనే నిప్పుల వర్షం కురిపించి యింక ముందుకి రాకుండా గుమ్మం అవతలనే నిలబెట్టేసింది...

    "అయిపోయిందేదో అయిందిలే వెంకయ్యా!....చిన్నవాడేమయినా నీ మనసుని నొప్పించి వుంటే నన్ను క్షమించి యింక వెళ్ళిరా?' అంది తల వంచుకుని!

    "అదేమిటక్కయ్యా! నువ్విలా అనటం నాకేమీ బాగోలేదు. ఎంతయినా నువ్వు నాకు అక్కయ్యవు!...మనలోమనకీ ఈ క్షమార్పణలు దేనికి? నువ్వు ఎప్పుడు కబురు చేస్తే అప్పుడే వచ్చి నీ ముందు వాలుతాను!...బంగారమంతా పోగొట్టుకుని నువ్వు, కాబోయే భార్యను దూరం చేసుకున్న వినాయకం ఎంత బాధ పడుతున్నారో కళ్ళారా చూశానుగా? యింక వస్తా!" అంటూ గబగబా బైటికి వచ్చి నవ్వుకున్నాడు.

    ఓదార్పు పేరుతో ఆ తల్లికీ కొడుక్కీ చురకలు బాగానే అంటించానన్న సంతృప్తి కలిగింది. అందుకే అంతగా నవ్వుకున్నాడు.

    సమయానుకూలంగా మాట్లాడటం వెంకయ్య అలవాటు!

    ఎవరయినా బండి కిరాయి డబ్బులు యివ్వటం ఆలస్యం చేస్తే ముఖాన వాళ్ళనేమీ అడగలేక, తన బండి కట్టుకుని వెళ్ళుతున్నప్పుడు కిరాయి డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి ఎదురయితే ఎద్దులను అదిలించుతూ వాటి మీద పెడుతూ తిట్టేవాడు-

    "ఎంత కష్టపడి మిమ్ములను మేపినా పైసా చేతికి రావటం లేదు! నాకు రాబడి లేదని నీ తిండి మానుకుంటున్నావా? అంటే అదీలేదు! ముప్పూటలా కావలసిందే కడుపు నిండాను!"

    అని పెద్దగా తిట్టేవాడు.

    వెంకయ్య కంఠం గుర్తుపట్టినా ఆ తిట్లకి తలతిప్పి చూడకుండా వుండేవాళ్ళు కాదు అవతలవారు. ఆ రోజు రాత్రికే తమ నౌఖఋకి యిచ్చి కిరాయి డబ్బులు వెంకయ్యకు పంపేవారు!

    "అయ్యో! నాకు కిరాయి డబ్బులు ఇవ్వాలా? ఆ సంగతే నాకు గుర్తులేదు! డబ్బు లేని వాళ్ళకి ఎవరెవరు ఇవ్వాలో గుర్తు పెట్టుకుని వెళ్ళి తెచ్చుకుంటారు. నాకు అవసరం లేదు. అందుకే మరిచిపోయాను. అయినా అంత అర్జంటు ఏం వుందని పంపారు?" అనే వాడు ఎంతో లౌకికంగా.

    అలాంటి వెంకయ్య కామాక్షమ్మ దగ్గిరకూడా అదే లౌకికం ప్రదర్శించాడు. "నువ్వెప్పుడు కబురుపంపితే అప్పుడే వచ్చి వాలుతాను!" అని! ఎప్పటికయినా తన కోసం కామాక్షమ్మ కబురు చేస్తుందని.

    వెంయ్య వెళ్ళిపోయిన తరువాత వినాయకం తల్లి దగ్గిరకు వచ్చాడు కోపంగా! ఏమేమిటో అడగాలని! కాని తల్లి కన్నీరుంచటం, శూన్యంలోకి చూస్తూ కూర్చుని వున్న విధానం చూసి అంత కోపాన్నీ మరిచిపోయాడు. తనకీ బాధగానే వుంది. తన బాధనీ, ఆవేదననూ తనలోనే అణుచుకుని నలిగిపోతున్నాడు. మానసికంగా కృంగిపోతున్నాడు. తల్లి కన్నీరు చూడగానే అంత వరకూ అణగారి వున్న దుఃఖం పెల్లుబుకి పోయి ఆపుకోలేక తల్లి వడిలో వాలిపోయి బావురుమన్నాడు.

    "ఏంచేస్తాం వినాయకం? మీ నాన్న నీ చిన్నప్పుడే చనిపోయినా కాలం తీరింది, చనిపోయారని గుండె రాయి చేసుకున్నాను. కాని పెళ్ళి వరకూ వచ్చిన తరువాత కావేరీ యిలా చేయటం ఎంత అవమానమో? భరించలేకున్నాను." అంది కొడుకు తలను నిమురుతూ.
   
    "కావేరీ అంటే నాకెంతో ఇష్టం అమ్మా! ఆ ఇష్టం ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు. అందరూ నన్నే చూసి నవ్వుతున్నారని పించుతోందమ్మా! తనకి సినిమాలు చూపించుతానన్నాను. మద్రాసు తీసుకెళ్ళి సినిమా వాళ్ళనందరినీ చూపించుతానని చెప్పాను, అన్నింటికీ అంగీకరించినట్లే వుంది. మరలా ఏమనుకుందో ఏమిటో? వెళ్ళిపోయింది. ఇక్కడ నేనేమయిపోతాననుకుందో?" అంటూ చిన్న పిల్లవాడికి వలె వెక్కి వెక్కి ఏడవసాగాడు.

    "నువ్వు కావాలనుకుంటున్నావనే అంత ఖర్చు చేసి నీ కిష్టమయినన్ని పట్టు చీరెలు కొన్నాను. కోరినంత బంగారం పెట్టాను. మీ మామయ్యా డబ్బుకి యిబ్బంది పడుతుంటే చూడలేక నేను సహాయం చేస్తూ వుండే దానిని. సంకరానికి పార్వతిని చేసుకోవలసి వుంది. దాని దురదృష్టం కొలదీ మీ అన్నయ్య నా చదువు పూర్తి అయితేనే గాని పెళ్ళే చేసుకోనన్నాడు. దాని దురదృష్టం కొలదీ దరిద్రుడు త్రివిక్రమరావు పాలిట పడింది. వాడు పీకల వరకూ తాగటం, రెండు రోజులయినా పేకాటనుంచి లేవక పోవటం! పార్వతి ఇక్కడికి వచ్చినప్పుడంతా....

    "అత్తయ్యా!"

    అంటూ నా దగ్గిరకు వచ్చి కూర్చున్నప్పుడంతా నా మనసులో ఎవరో చెయ్యిపెట్టి కెలికినంత బాధతో విలవిలలాడిపోయేదాన్ని! కుశల ప్రశ్నలు తప్ప త్రివిక్రమరావు సంగతులు అసలు అడిగే దాన్ని కాదు! నాకిష్టం లెకనె౧ కావేరీని నా కోడలిగా చేసుకుంటే మా అన్నయ్యా వదినలకి కొంతయినా మనశ్శాంతి వుంటుందని ఆశపడ్డాను. కాని అది కూడా మనలందరినీ మోసం చేసి పారిపోయిందంటే? అంతకంటే ఘోరమయిన అవమానం మనకీ యింకొకటి లేదు. బంగారం పోతే పోయింది. యింటి పరువు కూడా పోయిందన్నదే నా బాధ."

    "నీకంటే ఎక్కువగా నేను బాధ పడుతున్నానమ్మా! వంటరిగా ఆడపిల్ల మద్రాసులాంటి మహా పట్నంలో ఎలా బ్రతకగలదో నాకు అర్ధం కావటం లేదు.

    "దాని చావు అదేదో చస్తుంది. ఇంకా ఆ కావేరీని గురించి ఆలోచించకు వినాయకం? మనకీ కాని వస్తువు మీద మమకారం పెంచుకోవటం యింకా మనలను మనమే మానసికంగా క్రుంగ తీసుకున్నట్లు అవుతుంది శంకరం ఈ రోజో రేపో వస్తాడు. వచ్చిన తరువాత ఏం చెయ్యాలన్నది ఆలోచించుకుని నిర్ణయించుకుందాం! కావేరీ కంటే అందమయిన దాన్ని గాలించి అయినా తెచ్చి నీకు పెళ్ళి చేస్తాను. నువ్వు దిగులు మానుకో!" అంది తల నిమురుతూ.

    తల్లి చెప్పింది నిజమే! అని అనుకున్నాడు. కావేరీని తను మరిచి పోవడం తప్ప మరో దారిలేదు...పిచ్చి పిల్ల వంటరిగా వెళ్ళి అక్కడ ఎన్ని బాధలు పడుతున్నదో? ఏం చేస్తున్నదో? అలా వెళ్ళిపోయేముందు తనయినా గుర్తురాలేదు కాబోలు! సినిమాలంటే పుస్తకాలంటే యిష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? అందరూ ఇలాగే మద్రాసు పారిపోయారా? కావేరి అమాయకురాలు కాబట్టే అలా వెళ్ళిపోయింది. చిన్నప్పటినుంచీ ప్రేమించిన కావేరీని ఎలా మరిచిపోవటం? అది తనకి సాధ్యం అవుతుందా?

    వినాయకం అంత దుఃఖంలోనూ కావేరీ ఏంబాధలు పడుతునదోనన్న ఆలోచనలే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS