శ్రీ విశ్వనాథశర్మ, తెలకపల్లి
ప్రబోధము
నలువదియాఱుకోట్ల వదనమ్ముల, అన్నియె గుండెకారయలన్
గలిగియు నిద్రలేచె, నిది-కాలభుజంగము, నాకివేయు వి
హ్వలముగ చీనిచీమలను- హైందవజాతి, యదంత నొక్కఁటై
నిలిచెను, తాళఁగాఁ గలుగునే యెవఁడైనను శేషు ముందటన్?
హైందవజాతి నా నాదిశేషుండు, చై
నీయులన్ మ్రింగంగా నిద్రలేచె,
ఈ కాలసర్ప మదింతకాలముదాఁక
నిద్రపోయెను- మేల్కొనియెను నేఁడు
నిదురించు కుండలినీశక్తి నెవఁడైన
మరణించె ననుకొన్న మరణమొందు
లేపాక్షి బసవయ్య లేచె, గర్జించెను
నరహసింహమై జాతి-, నరుఁడు రేఁగె
కాటిఱేఁడును రేఁగెను ఖాఱ్ఱు మనుచు
గుండు కొక్కటి కొక్కటై గుండె లెల్ల
పేలుఁగాక హిమాలయాల్ ప్రేలుఁగాక
ఓడిపోలేము బ్రదుకులు మాడుగాక.
సర్వనాశనమై నేల చౌడుపోని
ఓడిపోఁజాల మోటమి నొప్పుకోము
ఓడి బ్రదుకము, బ్రదికియు నోడిపోము
పొలిని దాటించు వానిని పొలియఁ జేసి
బలుల నిత్తుము పొలిమేర వానిఁబట్టి.
మీసము లేల మీ కిటుల మీనుకు లేవె
వృథా భరింపఁగా?
మీస మఁటన్న - రోస, మది మీరు
తొలంగక హిందులార! చై
నా సరిజోదుతో పెనఁగి నల్లను
ద్రావుఁడు నల్లమందు వా
రే సరిమీకు? చూపుఁడు
విశృంఖల వీరవిహార సారముల్!
* * * *
