Previous Page Next Page 
ప్రతీకారం పేజి 39


    ఏదో విరక్తిలాంటి భావం మనస్సును చుట్టివేస్తున్నది. తల్లిని గురించి ఆలోచించడానికి కూడా మనస్సు ఎదురు తిరుగుతూంది.
    ఐదు గంటలకు లేచి స్నానం చేసి, బయటకు వెళ్ళడానికి తయారైంది.
    "ఇంత ప్రొద్దుటే ఎక్కడికే?" రాధాదేవి ఎదురుగా వచ్చి ప్రశ్నించింది.
    ఇందిర తలెత్తి తల్లి ముఖంలోకి చూడలేదు. జవాబివ్వలేదు. ఏవగింపుగా ముఖం తిప్పుకుంది! గబగబా బయటకు వెళ్ళిపోయింది.
    ఉదయం జగన్నాథం లేచి వరండాలోకి వచ్చాడు. వరండాలో ఈజీ చైర్లో రవి కళ్ళు మూసుకొని వున్నాడు. రాత్రి బట్టలు మార్చుకోలేదు. బూట్లు కూడా విప్పలేదు. రాత్రి అంతా అలా ఆ వరండాలోనే పడుకుని వున్నాడని తెలుసుకున్న తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. దగ్గరకు వెళ్ళి రవి భుజంమీద చేయి వేశాడు. రవి బద్ధకంగా కళ్ళు తెరిచాడు. పెద్ద జబ్బులో వున్నవాడి ముఖంలా ఉంది రవి ముఖం. తండ్రీ కొడుకుల కళ్ళు కలుసుకున్నాయి. జగన్నాథం కళ్ళలో గిర్రున నీరు తిరిగింది. రవి కళ్ళలో ఎలాంటి భావం కన్పించలేదు. ఖాళీగా గాజు కళ్ళలా వున్నాయి అవి.
    అప్పన్న ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చాడు. ఇద్దరూ మౌనంగా తాగారు.
    "ఏమైనా తెలిసిందా?" అడిగారు జగన్నాథంగారు.
    'తెలిసింది' అన్నట్టు బద్ధకంగా తల వూపాడు రవి.
    జగన్నాథం శరీరంలోకి ఏదో శక్తి ప్రవేశించినట్టయింది ఉత్సాహంగా నిటారుగా కూర్చున్నాడు.
    "తెలిసిందా? సాక్షులు కనిపించారా?"
    "కన్పించారు" నిర్లిప్తంగా అన్నాడు రవి.
    "కన్పించారా ఎంత సంతోష వార్త తెలిసింది! నిజంగా నేను అదృష్టవంతుడ్ని! పునర్జన్మ లభించినట్టుగా వుంది."
    "లేదు నాన్నా, నువ్వు చాలా దురదృష్టవంతుడివి!"
    అర్థం కానట్టు అయోమయంగా చూశాడు జగన్నాథం.
    "ఏమిటి నువ్వంటున్నది? సాక్షులు కన్పించారన్నావుగా? నువ్వు నిర్దోషివి అని రుజువు అవుతుంది."
    "కన్పించారు. కాని వాళ్ళు నేను నిర్దోషిని అని రుజువు చెయ్యలేరు."
    "ఏమిట్రా నువ్వనేది? సరిగ్గా చెప్పు!"
    రవి రాత్రి జరిగిన సంఘటన వినిపించాడు.
    జగన్నాథం అంతా విని రవి కళ్ళలోకి అనుమానంగా చూశాడు. పిచ్చి కోపం వచ్చింది.
    రవి తలదించుకున్నాడు.
    "రాస్కెల్! ఎన్ని కథలు అల్లుతున్నావురా? నువ్వే నిజంగా రజనీని హత్య చేశావు. ముందు బాల్ - బేబీ కథ చెప్పావు. ఎవరూ నమ్మలేదు. కాని నేనే నమ్మి నవ్వుల పాలయ్యాను. ఇప్పుడు సాక్షులు కన్పించారనీ, వారు విమాన ప్రమాదంలో చచ్చిపోయారని చెబుతావా? రాత్రి జరిగిన విమాన ప్రమాదాన్ని ఇలా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? నన్నే కాకుండా ఆ అమాయకురాల్ని, నిన్ను అమితంగా పిచ్చిగా ప్రేమిస్తున్న ఇందర్ని కూడా మోసం చేస్తావా నీకల్లబొల్లి కబుర్లతో? దుర్మార్గుడా నేనే నీకు తగిన శిక్ష విధిస్తాను." జగన్నాథం పిచ్చివాడిలా అరుస్తూ లోపలకు వెళ్ళాడు.
    రవి తండ్రి వెళ్ళినవైపే చూస్తూ విషాదంగా నవ్వుకున్నాడు.
    చేతిలో రైఫిల్తో తిరిగివచ్చిన తండ్రికేసి నిర్లిప్తంగా చూస్తూ వుండిపోయాడు రవి.
    "నిజం చెప్పరా! చచ్చేముందయినా నిజం చెప్పు! కనీసం ఆ సంతృప్తి అయినా నాకు కలిగించు. నీ కట్టు కథలు ఇక నేను నమ్మను. నా చేతుల్తోనే నిన్ను శిక్షిస్తాను. పదిమందిలో, కోర్టులో కట్టుకథలు విన్పించి నవ్వులపాలు కావటానికి వీల్లేదు. నిన్ను చంపి నేను చస్తాను. ఈరోజే మన వంశానికి ముగింపు కావాలి. చెప్పు! నిజం చెప్పు! రజనీని హత్య చేశానని చెప్పు!" పిచ్చిగా అరిచాడు జగన్నాథం.
    రవి లేచి తండ్రి ఎదురుగా నిల్చున్నాడు. ఓ క్షణం తండ్రి కళ్ళలోకి జాలిగా చూశాడు.
    "అవును! నేనే రజనీని హత్య చేశాను. నేను హంతకుణ్ని. నేను నిజం చెబుతున్నాను. నన్ను చంపండి."
    "అబద్ధం! రవీ! నువ్వు హంతకుడివి కాదు. నువ్వు హత్య చేయలేదు. ఇది సత్యం! నగ్న సత్యం! ఇద్దరు సాక్షులు చచ్చిపోయారు. కాని మూడో సాక్షి ఇంకా బ్రతికే వుంది!" అప్పుడే ప్రవేశించిన ఇందిర ఆవేశంగా అన్నది.
    "అబద్ధం! నువ్వు నమ్మకు తల్లీ! వీడు నన్నే కాదు నిన్ను కూడా మోసం చేస్తున్నాడు. మూడో సాక్షి ఇంకా బ్రతికే వుందనే ఆశ ఇంకా మనకు కలిగిస్తున్నాడు. దుర్మార్గుడు ఇవాళ వీడి ప్రాణాలు తీస్తాను నువ్వు తప్పుకో!"
    "రవి చెప్పింది కట్టుకథ కాదు, నిజం! ఆ మూడో సాక్షి ఎవరో నాకు రాత్రి తెలిసింది. ఆమె ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంది" అన్నది ఇందిర.
    జగన్నాథం, రవీ ఇందిర ముఖంలోకి చూస్తూ ఆమె మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
    జగన్నాథం, చేతిలో రైఫిల్ బల్లమీద పెట్టి ఇందిర దగ్గిరకు వచ్చాడు. ఆమె రెండు చేతులూ పట్టుకొని ఆమె కళ్ళలోకి అనుమానంగా చూశాడు. ఆ కళ్ళలో వెలుగును చూసి జగన్నాథం ఆమె చెప్పిందంతా నిజమేనని నమ్మాడు.
    "ఏదీ మరోసారి ఆ చల్లని వార్త చెప్పు తల్లీ! నా రవి హంతకుడు కాదని మరోసారి చెప్పు! ఆ మూడో వ్యక్తిని నువ్వు చూశావా? ఎప్పుడు? ఎక్కడ? ఆమె ఎక్కడ వుంది?" ప్రశ్నల వర్షం కురిపించాడు జగన్నాథం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS