Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 39


    "శ్రీనాధయ్యా! కాలము అమోఘమయినది. దానిని ఎవరూ నిలువరించలేరు. సాక్షీభూతులమై చూస్తూ వుండటమే తప్ప యిప్పుడు నీవూ, నేనూ చేయగలిగినదేమీ లేదు. కోమటివేముడు నవులూరు యుద్ధ వార్తలను చాలా రహస్యంగా వుంచాలని కట్టడి చేశాడు. ఆయన పంపిన అదనపు వేగులు ఉదయమయ్యే సరికి నవులూరు చేరారు.
    సవులూరులో వారు చేరే వేళకే యుద్ధం ఘోరంగా జరుగుతోంది. కొండవీటి సైన్యాలు మహోత్సాహంతో పోరాడుతున్నాయి. వారికి యుద్ధం క్రీడా వినోదమైంది.
    అవును మరి! వారికి సైన్యాధిపతి సోమదేవుడు. సోముడు యుద్ధవీరులను ప్రోత్సాహపరుస్తూ యుద్ధంలో ముందుకు పోతున్నాడు. అతడు ఇదివరకటి యుద్ధంలో యెంతో నైపుణ్యంతో చౌండపనాయకుని ఎదిరించినా బందీగా చిక్కిపోయాడు. కనుక అది అవమానమే. ఆ జరిగిన అవమానం అతనిలో మంటలు రేపింది.
    సాయంత్రం వరకూ అలా పోరాడారు. పిన వేదగిరి సైన్యాలు దాదాపు తన సర్వస్వాన్ని కోల్పోతున్నారు. సోమదేవునిలో ఉత్సాహం మిన్ను ముట్టింది.
    ఈ యుద్ధంలో విజయలక్ష్మినీ, ఆ తరువాత వేమాంబికనూ చేపట్టాలి. ఈ రెండు విషయాలే అతని కళ్ళముందు కనిపిస్తున్నాయి. ప్రొద్దువాలిపోతున్నది.
    ఆ సమయాన తాను చేసిన భీషణ ప్రతిజ్ఞ పైకి ఉబికింది, గుర్రాన్ని సూటిగా దౌడు తీయించాడు సోమదేవుడు. పిన వేదగిరి సైన్యాలు అతనిని నిలువరించలేక పోయాయి. అతడు స్కంధావారంలో జొరబడ్డాడు.
    పిన వేదగిరి తన గుడారంలో మంచెమీద విశ్రాంతి తీసుకుంటున్నాడు. సోమదేవుడు సింహగర్జన చేశాడు.
    "ఏమిటా అరుపులు?" పినవేదగిరి తొణకకుండానే ప్రశ్నించాడు సోమదేవుడిని.
    "నిన్ను కవ్వించాలని రిక్క వేస్తున్నాను. ఇదిగో ఆయుధం తీసుకో. నాతో పోరాడు" సోముని జవాబు.
    "ఇంతటి యుద్ధవీరుడిని యుద్ధరంగాన్ని వదలి స్కంధా వారంలో జొరపడ్డావెందుకు?" పినవేదగిరి యింత మనోధైర్యంతో మాట్లాడుతున్నాడంటే అతని ఏర్పాట్లేవో అతనికుండి వుంటాయి. ఏది ఏమయినా ప్రతిజ్ఞ చెల్లించుకోకుండా వెనుదిరగ దలచులేదు సోమదేవుడు.
    "మాటలతో కాలక్షేపం చేయక యుద్ధానికి రా!"
    "నాతో యుద్ధానికి నీకు మరికొంత వ్యవధి కావాలి. అయినా వచ్చావు కనుక అడుగుతున్నాను. నీకు కావలసిందేమిటి?" పినవేదగిరి వ్యంగ్యం ధ్వనించేలాగ ప్రశ్నించాడు.
    "నీ తల" సోమదేవుని సమాధానం.
    "తీసుకుపో! కాని నా తలను నరికేముందు నీవు ఎక్కడ వున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. లేకపోతే ప్రమాదాన పడతావు" నింపాదిగానే చెప్పాడు వినవేదగిరి.
    సోమదేవుడు అప్పుడు పరిసరాలను పరిశీలించడం ప్రారంభించాడు.
    అతని చుట్టూ కొన్ని వందలమంది సైనికులు ఆయుధాలతో నిలచి ఉన్నారు. అయినా సోముడు జంకుపడలేదు. చెంగున గుర్రం మీదనుండి క్రిందికి దూకాడు. బాణంలా దూసుకువెళ్ళి పినవేదగిరి సుదీర్ఘమైన కేశాలను వామహస్తానికి మెలివేసుకుని ఒక్క వ్రేటుతో కంఠాన్ని నరికివేశాడు. తల ఊడి అతని చేతికొచ్చింది.
    దేవరకొండ సింహాసన మకుటధారి అయిన ఆ పిన వేదగిరి తల ఆ వీరకిశోరానికి కందుకప్రాయమైంది. చుట్టూ చేరిన సైనికులు రెప్పపాటులో జరిగిన ఈ ఘోరానికి నిశ్చేతులయ్యారు. అన్ని వందలమంది కసితో విసిరినా ఆయుధాల మధ్య సోమదేవుని శరీరమేమైనదో కనిపించలేదు. రవి అస్తమించాడు.
    ఆ రాత్రికి రాత్రి వార్తలు కొండవీడు చేరాయి. తన సోదరుడి తల కొట్టినందుకు అలిగి పినవేదగిరి తమ్ముడు లింగమనీడు భీషణంగా ప్రతిజ్ఞచేశాడు. "కోమటి వేముని తల త్రుంచి కొండవీడును నేలమట్టం చేయనిదే స్నానం చేయను."
    లింగమనీడు కొండవీడు మీదకు ఎత్తి వచ్చాడు.
    కొండవీటిలో పరిస్థితులు మరింత అధ్వాన్నమైపోయాయి. రాచడేమును, తురగా రామయ్యల మీద సవిరం మల్లయ్య తిరగబడ్డాడు. అతనికి ప్రజల అండదండలు దొరికాయి.
    సవిరం ఎల్లయ్య మీద కోపంతో అతని భార్య ప్రసవించగానే వురిటిపన్ను వసూలు చేసి తీరాలని రామయ్య పథకం వేసుకుని కూర్చున్నాడు.
    ఒక ప్రక్కనుండి కొండవీడును ఆక్రమించటం ప్రారంభించాడు లింగమనీడు. రాజుమీద విసుగెత్తిపోయిన ప్రజలు ఆ స్థితిలో కూడా రాజుకు చేయూత నివ్వలేదు. ఈ పరిస్థితి లింగమనీడుకు బాగా ఉపయోగించింది. పన్నులు వసూలు చేసి వస్తున్న తురగా రామయ్య సవిరం ఎల్లయ్యకు ఒంటరిగా చిక్కాడు. రామయ్య తల మట్టి కరిచింది. భారత యుద్ధంలో శకునిలాంటి రామయ్య పది పాలనలో తలదూర్చిన దుష్ఫలితం చరిత్రలో చెరపటానికి వీలులేకుండా నిలిచిపోయింది. అది తరువాతి రాజుల పాలనకు గుణపాఠమైంది.
    రామయ్య మరణంతో దుర్గ రక్షణ భారం రాచవేముడు స్వీకరించాడు. దుర్గాలలో సైన్యాన్ని నింపి, అగడ్తలలో నీరు నింపి ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు.
    అదే మంచి అదను. సవిరం ఎల్లయ్య కొంతమంది వీర బలి ప్రజలను ప్రోగుచేసుకుని రాచవేమునిమీద దాడి చేశాడు. ఆ దాడిలో దురాశా పిశాచం అంతరించింది. సవిరం ఎల్లయ్య విజయోత్సాహంతో విజృంభించాడు.
    ఈ విషయాలేవీ వేమకు తెలియలేదు. ఆమె తన గదిలో కూర్చుని వీణ వాయించుతోంది. కొండవీడు గండ కత్తెరలో పడిందని తనూ విన్నది. లింగమనీడు కొండవీటిని ముట్టడించాడనీ తెలుసు. కాని యివన్నీ తను చిన్నతనం నుండీ చూస్తున్న మామూలు గొడవలే ననుకొంది. ఆ సమయంలో శ్రీనాధయ్యా, పెద్దియజ్వా అంతఃపురాన్ని ప్రవేశించారు. వేమాంబను మాట్లాడించటానికి వారిద్దరికీ నోరు రాలేదు. శిలా ప్రతిమల్లా నిలచివున్న ఇద్దరినీ చూచి ఆమె ఏదో ఘోరం జరిగిందని ఊహించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS