ఆరోజున ఎలెక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయింది.
నరకంలో మంటల్లాగా మంటలు లేచాయి.
నాలుగొందల మంది సజీవ దహనం అయ్యారు.
ఏడుపులు -- పెడ బొబ్బలు
దృశ్యం మారింది.
ధియేటరు ట్రాజెడీకి కారణమయిన వాళ్ళందరూ మంత్రి గారి ఇల్లు చేరారు.
ముడుపులు చేతులు మారాయి.
"భయపడకండి . ఎన్ క్వయిరీ కమిషన్ వేయిస్తాను. అంతకంటే ఏమీ లేదు ." అన్నారు మంత్రి గారు అభయం ఇస్తూ.
బ్రహ్మానంద భారితులయిపోయారు అధికారులు.
రాజకీయవేత్తలు "చేద్దాం " అన్నారంటే అది చూద్దాం అని అర్ధం చేసుకోవాలట.
అట్లాగే ఎన్ క్వయిరీ కమీషన్ అంటే కంటి తుడుపు చర్య అనీ, దాని వల్ల ఎవరి తలా తెగిపడదనీ మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతివాడికీ అర్ధమయిపోయింది గదా.
ఎన్ని పార్టీలు ప్రభుత్వాలు రాలేదూ -
ఎన్నెన్ని ఎన్ క్వయిరీ కమీషన్లు వేయలేదూ-
ఏ ఎన్ క్వయిరీ కమీషన్ వల్ల నన్నా ఏ రాజకీయ వేత్త కెరీర్ అన్నా దెబ్బ తిన్నదని ఎప్పుడన్నా విన్నామా?
మళ్ళీ దృశ్యం మారింది.
థియేటర్ మంటలు ఆకాశాన్ని అంటున్నాయి. పక్కనే ఆకాశ హర్మంలాంటి పది అంతస్తుల భవంతి ఒకటి వుంది.
దాని బాల్కనిలో ఆరేసిన బట్టలు అంటుకున్నాయట!
రూల్సుకి విరుద్దంగా అంత పెద్ద బిల్డింగుకి ఒకే ఒక్క మెట్ల దారి మాత్రమే వుంది. ఒకే ఒక్క లిప్టు వుంది ! కారణం!
అంతటా ఆవరించి ఉన్న అవినీతి ! ముడుపులు!
ఫైరింజన్లు వచ్చాయి. అంత ఎత్తుకి వెళ్ళే నిచ్చెన లాంటిది వాళ్ళ దగ్గర వుంది. దానిపై భాగాన చిన్న కంపార్టుమెంటు లాంటిది ఉంది.
దాన్లో ఇద్దరు ఫైర్ సర్వీస్ మెన్ వున్నారు.
"పదో అంతస్టుకు పోదాం ముందు" అన్నాడు వాళ్ళలో ఒకడు మతలబుగా . కేశూభాయ్ ప్లాట్ పదో అంతస్తులో వుందని అతనికి తెలుసు.
నిచ్చెన పదో అంతస్తులో ఒక ప్లాట్ దగ్గరికి వెళ్ళింది.
అది చూడగానే పోయిన ప్రాణాలు లేచి వచ్చినల్తుగా పరిగెత్తుకువచ్చాడు కేశూభాయ్. అతను కరోర్ పతి. అతని వెనకే అతని కుటుంబ సభ్యులు వచ్చారు.
"మనిషికి పది లక్షలు ఇస్తే మిమ్మల్ని రక్షిస్తాం" అన్నారు ఫైర్ ఫైటర్లు . బేరం పెడుతూ.
"ఇది అన్యాయం" అని కేశూ భాయ్ అనబోతుండగానే నిచ్చెన పక్కకి జరిగిపోవడం మొదలెట్టింది.
"సరే సరే సరే -- ముందు మమ్మల్ని రక్షించండి " అన్నాడు కేశూభాయ్ ఏడుపు గొంతుతో.
తను అచ్చు వేయిస్తున్న వెయ్యి రూపాయల దొంగనోట్లతో మనిషికి పదిలక్షలు కాదు -- ముప్పయ్ లక్షల చొప్పున ఇచ్చే సామర్ధ్యం అతనికి వుంది.
మళ్ళీ దృశ్యం మారింది.
ఒక మధ్యతరగతి మనిషి.
కూతురి పెళ్ళి కోసం కడుపు మాడ్చుకుని కూడా పెట్టిన డబ్బు విత్ డ్రా చేద్దామని బ్యాంకుకి వెళ్ళాడు.
వెయ్యి రూపాయల కట్టలు తీసుకుని పట్టుబట్టల షాపుకి వెళ్ళాడు.
బట్టల తాలుకూ బిల్లు పే చేయగానే పోలీసులు షాపులో ప్రవేశించారు.
"దొంగనోట్ల చలామణీ కింద కేసు బుక్ చేస్తున్నాం" అన్నారు పోలీసులు.
కూతురి పెళ్ళి కోసం కూడబెట్టిన డబ్బు అనబోయాడు ఆర్తిగా.
"కేసు పెడితే మీరు ఇప్పుడు అత్తారింటికి వెళ్ళాల్సి వస్తుంది కదా?" అన్నారు వాళ్ళు అలహస్యంగా.
"ఏం చెయ్యను నేను?"
"ఆ దొంగనోట్లు మీ దగ్గర ఉంటే డేంజరు - మాకు ఇచ్చేయండి - మేం మార్చుకుంటాం . ఆ పైన మీరొక లక్ష ఇస్తే చాలు ."
"నన్ను నిలబెట్టి అమ్మినా నాలుగు రూపాయలు రావు" అన్నాడు అతను జీరపోతున్న గొంతుతో.
"అయితే కేసు తప్పదు."
"కాళ్ళు పట్టుకుంటాను స్వామీ"
నన్ను వదిలెయ్యండి.
కూతురి పెళ్ళా? నీ కూతురు బావుంటుందా?" అన్నాడొక పోలీసు సరసంగా.
సహనం నశించి అతని చెంప చెళ్ళుమానేటట్లు కొట్టాడు ఆ మధ్యతరగతి మనిషి మర్నాడు పొద్దున్నే పేపర్లో ప్రముఖంగా రెండు వార్తలు వచ్చాయి.
ఒకటి పట్నంలోని పోలీసు స్టేషను లో లాకప్ డెత్ హతుడు. ఒక మధ్యతరగతి మనిషి.
కేసు : దొంగనోట్ల చలామణి.
రెండు:అదే సదరు మధ్య తరగతి మనిషి తాలుకూ కూతురి అరెస్టు.
కేసు : డ్రగ్ ట్రాఫికింగ్.
దృశ్యం మారింది.
మినిస్టరు గారి ఇల్లు.
యెల్లో జర్నలిస్టు - సెన్ "శేషన్' కులాసాగా జారగిలబడి కూర్చుని వున్నాడు.
"వాట్ సార్! నిప్పులాంటి నిజాలన్నీ పేపర్లో కేక్కిస్తే ప్రభుత్వం పరువుపోతోంది కదా! ఏం చేద్దాం?" అన్నాడు మతలబుగా.
"ఏం నిజాలు ?" అన్నాడు మినిస్టరు జాగ్రత్తగా.
"అంతా ఇన్వెస్ట్ గేట్ చేశా. మధ్యతరగతి మనిషి అమాయకుడు.
అతని మీద దొంగనోట్ల కేసు పెట్టారు.
అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. దొంగనోట్ల చలామణీ అన్నదే దొంగకేసు. అయినా అడిగిన లంచం ఇవ్వలేదని అరికాళ్ళలో చావుదెబ్బలు కొట్టారు. ఏరో ప్లేన్ ట్రీట్ మెంటు. ఐస్ ఫ్రూట్ ట్రీట్ మెంటూ -- ది వర్క్స్ అవన్నీ మీకు తెలిసినవె కదా! క్షణానికొక చావు చావలేక ఆత్మహత్య చేసుకున్నాడు అతను. అతని కూతురి మీద అన్యాయంగా డ్రగ్ ట్రాఫికింగ్ కేసు బుక్ చేశారు ."
"ఇంకేం తెలుసు ?" అన్నాడు మినిస్టరు . నిశితంగా చూస్తూ .
