Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 41

 

    కేసూభాయ్ దొంగనోట్లు వేయించడంలో సాయం చేసింది మీరే. అది మీ సొంతానికి కాదనుకోండి -- పార్టీ ఫండ్సు కోసం దొంగనోట్లు వేయించారా- ఇంక ఫ్రెండ్సు కోసం డ్రగ్ ట్రాఫికింగ్ చేయిస్తున్నారు. డ్రగ్ ట్రాఫికింగ్ కి మీరే కింగ్ పిన్ ....ఇకపోతే మీ సొంతానికి ......."
    "ఇంతకీ ఏమంటావ్?"
    నవ్వాడు యెల్లో జర్నలిస్టు.
    "ఎలెక్షన్లు వస్తున్నాయ్ -- చివరి క్షణంలో మీరు చడీ చప్పుడు కాకుండా పార్టీ మారబోతున్నారు. ఇన్నాళ్ళ నుంచీ కాకిగోలలాగా ఏ పార్టీని తిట్టారో, ఆ పార్టీ నాయకుడి కాళ్ళు నాకి పదవి దక్కంచుకోబోతున్నారు. ఇప్పుడు మీరు పదవి వెలగబెడుతున్న ప్రభుత్వం ముణిగిపోతున్న పడవ అని మీకు తెలుసు. ప్రతిపక్షనాయకుడు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నిలబడి అతన్ని ఓడిస్తానని పైకి ప్రగల్భాలు పలుకుతున్నారు గానీ, లోపాయికారీగా ఆయనతో మంతనాలు జరుపుతూనే వున్నారు. మీరేం చేసినా ప్రజల కోసమే చేస్తారు కదా మంత్రి వర్యా!" అన్నాడు వ్యంగ్యంగా.
    "ఏం కావాలి ?" అన్నాడు మంత్రి.
    'చెప్పవలసిన వాళ్ళతో చెప్పి నాకు ఒక పెట్రోలు బంకు ఏజెన్సీ ఇప్పించండి! అన్నాడు యెల్లో జర్నలిస్టు.
    రాజు వైపు చూసింది సృష్టి.
    రాజు ముక్కుపుటాలు పెద్దవయ్యాయి.
    ఆ రిపోర్టర్ అన్నది నిజమే.
    చేసే ప్రమాణాలు అన్నీ ప్రజల పేరు మీదే గానీ, ప్రజల బాగోగులు పట్టించుకునే పోలిటీషియన్ ఒక్కడూ ఉండడు" అని గబగబ బటన్లు నొక్కింది సృష్టి.
    చకచక దృశ్యాలు మారాయి.
    కొన్ని పార్టీలు చీలిపోతున్నాయి.
    చీలినవి మరి కొన్నిటితో కలుస్తున్నాయి.
    కలిసిన కొత్త పార్టీలు విడిపోతున్నాయి.
    పాత పార్టీల ముక్కలతో కలుస్తున్నాయి.
    కొన్ని పార్టీలలో కేవలం ఒకే ఒక నాయకుడు ఉన్నాడు. ఏక సభ్య పార్టీలు అవి!
    ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం?
    కుంభకోణాలు -- పవర్ పాలిటిక్స్ వెన్నుపోట్లు.
    పవర్ కోసం పరుగులు -- డబ్బు కోసం విన్యాసాలు.
    పవర్ కోసం డబ్బు.
    డబ్బు కోసం పవరు.
    అంతే తప్ప -- ఈసోకాల్ద్ ప్రజానాయకులలో ఒక్కడు -- ఒక్కడంటే ఒక్కడు కూడా ప్రజల పేరుతొ పాపాలు చేయడమే తప్ప ప్రజల కోసం ఆలోచించిన పాపాన పోవడం లేదు.
    పొరపాటున ప్రజల గురించి ఆలోచించిన వాడు పవర్ పాలిటిక్సు లో నిలబడలేకపోతున్నాడు. "ఈ దేశాన్ని దేవుడే రక్షించాలి" అన్నాడు ఆవేశంగా.
    "సరే ! దేవుడి సంగతి యెట్లా ఉందొ చూద్దాం రా! అంది సృష్టి.
    వెంటనే ఒక మోడరన్ బాబా కనబడ్డాడు. అతనికి స్విట్జర్లాండ్ లో ఆశ్రమం వుంది. అతనికి మెర్సిడేస్ బెంజ్ కారు వుంది.
    కారు లేకపోతే కాలు కదపడు. ఊరు దాటాలంటే విమానం కావాలి. అందుకని సొంతానికి విమానం ఒకటి కొనుక్కున్నాడు భక్తులిచ్చిన విరాళాలతో.
    బాబాగారి అనుగ్రహ భాషణం క్రిస్టల్ క్లియర్ గా వినబడుతుంది .
    "ఈ సృష్టిలో సర్వమైన అశాంతితికీ కోరికలు కారణం. కోరికలని జయించండి. కోరికలని జయించడం అంటే కార్లు కొనుక్కోవడం మానమనీ, క్లబ్బులకి వేళద్దనీ కాదు. మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూనే, మీ వుద్యోగాలు ,మీరు చేసుకుంటూనే భగవంతుడిని దర్శించడానికి ప్రయత్నించండి. భగవంతుడిని డైరెక్టుగా దర్శించడం అసంభవం! భక్తుడికీ, భగవంతుడికీ అనుసంధానంగా వుండేవాడు గురువు. అందుచేత గురువుని సేవిస్తే దేవుణ్ణి సేవించినట్లే. గురువు పట్ల అచంచలమైన విశ్వాసం వుండాలి. గురు బ్రహ్మ గురుర్విష్ను, గురు ర్దేవో మహేశ్వర ....గురుస్సాక్షాత్ పరబ్రహ్మ.....
    "గురుగురుగుగురుగురుగురు" అంటూ అరిగిపోయిన రికర్డులాగా అక్కడే ఆగిపోయింది దృశ్యం.
    "చూస్తున్నావా రాజూ!" అంది సృష్టి.
    గబగబ దృశ్యాలు మారుతున్నాయి. మనిషిని దేవుడి లెవలుకు తీసుకేళ్ళాల్సిన మతం మదంగా మారి మనిషిని మరుగుజ్జుగా, రాక్షసుడిగా మార్చడం -- మతం అన్నది రాజకీయ రాక్షసుల చేతిలో మంత్రదండంలా ఉపయోగపడటం , మత మౌడ్యం, కులాల కుమ్ములాటలు , మతాల మారణహోమం -- కుహనాసెక్యూలరిజం - సెలక్టివ్ సెక్యూలరిజం ..... వీటికి తోడుగా హేతువాద మౌడ్యం!
    ఒకదాని కొకటి సంబంధం లేని సీన్లు.
    లంచం ఇస్తే గానీ ఆపరేషను చేయనంతున్నాడు డాక్టరు.
    ఆపరేషన్ కోసం ఆటోలో వెళ్తున్నవాడు రాజకీయ రాక్షస క్రీడ అయిన రాస్తారోకోలో ఇరుక్కుని దారిలోనే మరణించాడు.
    మెడిసిన్ పరీక్షల్లో మార్కులు తారుమారై అత్తెసరు మార్కులు తెచ్చుకునే మినిస్టరు గారి అమ్మాయి లిస్టులో ఫస్టు వచ్చింది.
    ఆ పిల్ల మెడికల్ కాలేజీకి వెళ్ళడానికి గానూ ఎక్స్ ప్రెస్ రైలుని ప్రత్యేకంగా ఆ స్టేషన్ లో ఎనిమిది నిమిషాలు అపుతున్నారు.
    "లాభం లేదు...... మనకి కనబడాల్సిన రాముడి మడుగు ఏరియా తప్ప మిగతా అంతా కనబడుతున్నది ఇందులో అబ్బ! చెడు తాలుకూ విశ్వరూపాన్ని చూసినట్లుగా లేదూ?" అంది సృష్టి.
    సాలోచనగా తల పంకించాడు రాజు.
    "పద రాముడు మడుగు దగ్గరికి మనమే వెళ్దాం!" అంది సృష్టి. అని, అంత లోనే మరి వీళ్ళసంగతి ?" అంది నిఖిల్ , నిత్య వైపు చూస్తూ.
    అప్పటికే నిఖిల్ మళ్ళీ మామూలు మనిషయ్యాడు . మాట వచ్చేసింది.
    "మేమూ మీతో బాటే ! పదండి పోదాం " అన్నాడు.
    నిఖిల్ కి ఆ అడవి అంతా కొట్టిన పిండి. అతను కొండ గొర్రెలా చకచక ముందు దారి తీస్తుంటే. అతని వెనకే నడిచారు మిగతా ముగ్గురూ.
    ఒక కొండకొమ్ము దగ్గర ఆగిపోయండు నిఖిల్.
    "అదిగో ! అదే రాముడి మడుగు!" అన్నాడు.
    కళ్ళార్పకుండా చూస్తోంది సృష్టి.
    అక్కడ నుంచి కనబడుతోంది చాలా పెద్ద సరస్సు ఒకటి.
    ఆ సరస్సు మధ్యన లంకలాగా వుంది కొంతమేర.
    బంగారు కాంతులీనుతున్న ఆ లంక మీద కొన్ని ఇళ్ళ లాంటివి వున్నాయి.
    "రాముడి మడుగు మధ్యలో లంక -- కాలంలో వెనక్కి వెళ్తున్నామా?" "రామాయణంలోకి వెళ్ళి పోతున్నామా?" అంది సృష్టి అపనమ్మకంగా.
    టైం చూసుకున్నాడు రాజు.
    రాత్రి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS