రాజు వైపు చూసింది సృష్టి. "ఇన్ స్ట్రూమెంటు పాడయిపోయినట్లుగా ఉంది. మనం కోరిన దృశ్యాలకు బదులుగా ఇంకేవో సీన్లు కనబడుతున్నాయ్" అంది.
"డిఫెన్స్ డీల్సు సృష్టీ! ఇవి మనం చూడాల్సినవే!" అన్నాడు రాజు.
"మూడు వేల కోట్ల డీల్ కదా! పది పర్సెంటుకి తగ్గేది లేదు." అంటున్నాడు మినిస్టరు.
"ఇంతకు ముందు ఉండిన మంత్రికి మూడు పర్సెంటే ఇచ్చాం" అంటున్నాడు ఆ మనిషి.
అదోలా నవ్వాడు మినిస్టరు.
"దానికి దీనికి తేడాలేదూ? మూడు పర్సెంటు కమీషన్ అనేది పనికి వచ్చే ఆయుధాలకు. మరీ పనికిరాని ఆయుధాలకు -- పేలని గుళ్లకూ కనీసం పది పర్సెంటు లేకపోతే గిట్టుబాటు అవున్తుందా- మధ్యలో ఎన్ని నోళ్ళు తినాలీ!" అంటున్నాడు మినిస్టరు.
ఎవరి ప్రమేయం లేకుండా సీన్ దానంతట అదే మారింది.
వార్ ప్రంట్!
యుద్దరంగం !
హిమాలయ పర్వతసానువులు కనబడుతున్నాయి.
ఎముకలు కోరికేస్తున్న చలిపులి!
కొండ మీద బల్లపరుపుగా ఉన్న ఒక బండ.
ఆ బండ మీద అతి ప్రమాదకరమైన యాంగిల్ లో నిలబెట్టండి ఉంది ఒక భారీ శతఘ్ని.
దాని వెనక నిలబడి వున్నాడు ఒక సైనికుడు.
క్షణం పాటు కళ్ళు మూస్తే శత్రుమూకలు బార్డరు దాటి భారతదేశాన్ని కబళించడానికి వచ్చేస్తాయేమో అన్నంత జాగ్రత్తగా కనిపెట్టి చూస్తున్నాడు.
అదే టైంలో --
అతని మనోఫలకం మీద -
అతని పల్లె -
అందులో ఒక గుడిసె -
ఆ గుడిసెలో వుండే గుడ్డి తల్లీ మెదిలారు.
"ఎప్పుడు తిరిగి వస్తావురా నాయనా! అంటోంది గుడ్డి తల్లి ఆర్తిగా.
సైనికుడి మనోఫలకం మీద దృశ్యం మారింది.
తన తల్లి లాంటి కోటానుకోట్ల తల్లులని కన్నతల్లీ , అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మా, చాల పెద్దమ్మ అయిన భారతమ్మ కనబడింది.
అటువైపు ఆ తల్లి -
ఇటు వైపు ఈ తల్లి.
ఏ తల్లి ముఖ్యం అన్న సమస్య అతనికే నాడూ లేడు.
ఈ గుడ్డే తన తల్లి.
తను ఈ గడ్డకి ముద్దు బిడ్డ !
ఆ సైనికుడికి -- తన కర్తవ్యం ఏమిటో తెలుసు.
తన బాధ్యత ఏమిటో కూడా తెలుసు.
దేశరక్షణ అనే మహా యజ్ఞంలో తను ఒక సమిధని తెలుసు.
తనలాగే తన సాటి సైనికులు ఎందరెందరో ప్రాణాన్ని తృణప్రాయంగా భావిస్తూ నిరంతరం దేశం కోసం శ్రమిస్తున్నారని తెలుసు.
కానీ --
తనకి తెలియనిది ఒకే ఒక్క విషయం !
తను ఏ ఫిరంగి తాలుకూ శక్తిని నమ్ముకుని ఉన్నాడో ఏ ఫిరంగిని గురిపెట్టి శత్రువుల వ్యూహాన్ని వమ్ము చేద్దామనుకుంతున్నాడో !
ఆ ఫిరంగిలోని గుళ్ళు, నాసిరకంవని అతనికి తెలియదు. టెస్టులలో నానాదేశాలూ తిరస్కరించగా, ఆయుధాల వ్యాపారులు మంత్రులకు, అధికారులకు , బ్రోకర్ల ద్వారా ముడుపులు ఇచ్చి మనకు అంటగట్టిన గుళ్ళు అవి అని! సుదూరంలో-
శత్రుమూకలు కనబడ్డాయి.
ఫిరంగి పేల్చాడు సైనికుడు. ధడ్ అని బలహీనంగా చిన్న శబ్దం !
తుస్సుమన్న తారాజువ్వలాగా కొద్ది అడుగుల దూరం గాల్లోకి ఎగసి అంతలోనే చతికిలపడిపోయింది గుండు.
అప్పటికే శత్రువుల ట్యాంకులు కాంపు దగ్గరికి వచ్చి కాల్పులు మొదలెట్టాయి.
ఒక గుండు మన సైనికుడి మీద పడింది.
ఫిరంగితో సహా అతని శరీరం తుత్తునియలు అయిపొయింది.
"ఎప్పుడు వస్తావురా నా తండ్రీ! అని కలవరిస్తోంది పల్లెలో అతని గుడ్డి తల్లి. అతనింక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని ఆమెకి తెలియదు.
శీను మళ్ళీ మొదటికి వచ్చింది.
మళ్ళీ మినిస్టరు గారి ఇల్లు.
ఆయుధాల బ్రోకర్లు.
"ఎవరూ కొనని ఫిరంగి గుళ్ళు మీరు కొన్నందుకు మా కంపెనీ చాలా హాపీగా వుంది సర్! ఈసారి మీ కమీషన్ ఇంకా మూడు శాతం పెంచుతున్నాం. మీ స్వేస్ బాంకు ఖాతాలో డబ్బు జమ చెయ్యమంటారా?"
"అయిదు అకౌంట్లు ఉన్నాయ్- వుండండి " అని తన ఎలెక్ట్రానిక్ ఆర్గనైజర్ లో నెంబరు చూసి, ఆ అకౌంటులోకి ట్రాన్స్ ఫర్ చేయండి " అని ఒక నెంబరు ఇచ్చి , "వందేమాతరం" అని నవ్వాడు అదొక జోక్ అయినట్లుగా.
గుండెలు మందినట్లయింది రాజుకి.
అతని కళ్ళనుంచి విస్పులింగాలు కురిశాయి.
దృశ్యం మళ్ళీ మారింది.
మంటలు -- మంటలు -- మంటలు
అదొక సినిమా దియేటర్ !
ప్రేక్షకుల భద్రతకు ఎన్ని విధాల భంగం కలగవచ్చునో అన్ని విధాలుగా నియమాలని అతిక్రమించి తేనే తుట్టి లాగా కట్టిన థియేటరు కాంప్లెక్సు అది.
నగరంలో నడి బొడ్డున ఉంది.
అందులోనే ఒక షాపింగు కాంప్లెక్సు , ఒక హాస్పిటలు , రెండు థియేటర్లు వగైరా వగైరా.
అగ్నిప్రమాదాలు సంభవిస్తే -- ప్రేక్షకులు తప్పించుకుని బయటకు రాలేని విధంగా ఒక పద్మవ్యూహంలాగా కట్టారు ఆ ధియేటరుని.
అది కట్టేటప్పుడే మునిసిపల్ అధికారులు అడ్డు చెప్పవలసినది.
దానికి ఇంకా ఎక్స్ టెన్షన్లు కడుతున్నప్పుడయినా కూలగొట్టవలసినది.
కానీ -- ఎప్పుడూ ఎవరికి అందాల్సిన ముడుపులు వాళ్ళకి అందుతూనే వుండబట్టి -- మునిసిపల్, పోలీసు, కమర్షియల్ టాక్సులు, మొదలైన ఏ డిపార్ట్ మెంటు అధికారులూ కూడా ఇదేమిటని అడిగిన పాపాన పోలేదు.
