Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 39

   
    మాధవ్ గురుదేవ్ మాట్లాడింది ఎలా వుందంటే నోరుమాట్లాడుతుంటే నొసలు ఎక్కిరించాయి అన్నట్లు వుంది. మాధవ్ గురుదేవ్ గౌరవంగ మీరు అంటూ నాన్నగారుఅంటూ మాట్లాడుతున్నా ఆమాటల్లో ప్రేమ ఆప్యాయత గౌరవం లోపించినట్లు తెలిసి పోతూనే వుంది.    
    కొడుకు అలా అనేసరికి "అవునులే ఏదో నాభ్రమ." నవ్వుతూ అన్నారు రంగమార్తాండగారు.    
    "పోనీ ఒకసారి పట్నం నుంచి డాక్టరుని పిలిచిపిస్తే ఏం పోయింది!" అనాలనుకున్న సతీదేవి సగం మాట పూర్తి చేయక ముందే మాధవ్ గురుదేవ్ అందుకుని "ఊ....నాకు తెలుసు ఏం చేయవలసిందీను." గుర్రుగచూస్తూఅన్నాడు.    
    సతీదేవి నోరు మూసుకుంది.    
    "రాత్రి అయ్యగారు సరీగ నిద్రపోలేదు ఆయాసంగ వుంది. ఊపిరి ఆడనట్లు బాధగా వుంది అని రాత్రంతా అంటూనే వున్నారు" నౌకరు చెప్పాడు.    
    "అయ్యో" అంది సతీదేవి ఆదుర్దాగా మాధపు గురుదేవు "ఊ" అని మొహం తిప్పుకున్నాడు.    
    "రాత్రి తిన్న భోజనం సరీగ అరగలేదు. అందుకని అలా అయింది కంగారు పడేది ఏమీ లేదు." రంగమార్తాండగారు మన వడిని మరింత దగ్గరగ తీసుకుంటూ అన్నారు.    
    "ఈ వయసులో రాత్రిళ్ళు భోజనం ఏమిటి, ఏ పాలో పళ్ళో తీసుకుని అర్దాకలితో వుంటే ఏరోగాలూ రావు," మాధవ్గురుదేవ్ అన్నాడు.    
    "నీవు చెప్పింది యింకొకరి విషయంలో నిజమేరా మాధవా! నా శరీర స్థితి నీకు తెలిసిందే కదా! పాలు తాగితే పడదు. పళ్ళు తీసుకుంటే విరోచనాలు యింక ద్రవపదార్ధాలు ఎలా తీసుకోను! నీవు ఎప్పుడూ అనేవాడివి గుర్తులేదా! నాన్న గారూ! మీరెందుకు లేనిపోని బాధలు పడతారు! మీశరీరానికి భోజనం అయితేనే పడినప్పుడు భోజనమే చేయండి" అనేవాడిని.    
    "అవును అనేవాడిని. రోజురోజుకీ వయసు మీద పడి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి అంటున్నాను." మాధవ్ గురుదేవ్ అన్నాడు.    
    "అరిగినా అరగక పోయినా అన్నమే నా శరీరానికి అమృతం ఈ రోజు నుంచీ భోజనం తగ్గించి తింటానని "రంగమార్తాండగారు అన్నారు.    
    ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఈ విషయంలో కొద్దిసేపు వారి మధ్య పొడిగ పొడిగ మాటలు జరిగాయి.    
    "నీతో ఓ ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను మాధవ్!" మాటల మధ్యలో రంగ మార్తాండగారు అన్నారు.    
    "ఇప్పుడు చెపుతారా! అందరిని బైటికి వెళ్ళమంటాను" ఆదుర్దాగా అడిగాడు మాధవ్ గురుదేవ్.    
    "ఉహూ" అని కొంసేపు ఆలోచించి "త్వరలోనే బహుశా రోజుల్లోనే చెపుతాను. మనది చిన్నాచితకా ఎస్టేట్ కాదు కదా. నీతో చాలా చర్చించాలి. చాలా పెద్ద భారం అయినా నీకు గాక ఎవరికీ చెపుతాను, దీన్ని గురించే రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నాను." రంగ మార్తాండగారు చెప్పారు.    
    "ఈ ముసలాడికి దీనికింత ఆలోచన ఎందుకు. చచ్చే వయసు మీద పడింది. చావు తెలివి ఆలోచనలు కాకపోతే!" లోలోపల అనుకున్న మాధవు గురుదేవు "మీరు ఊరికే ఆలోచించి లేనిపోని తలనొప్పి తెచ్చుకోకండి. మీ వయసు, మీ ఆరోగ్యం విషయం మర్చిపోకండి."అన్నాడు ఓ పక్కగుర్తు చేస్తూ మరో పక్క మర్యాదగా.    
    రంగమార్తాండగారు ఊ అని కూడా అనలేదు. ఆ విషయాన్ని వదిలేసి "రాణి ఎలా వుంది?" అన్నాడు.    
    "నన్నేనా!" అంటూ ఓ అడుగు ముందుకు వేసింది కీర్తి.    
    "రాణి యిక్కడే వుంది మామయ్యగారూ!" అంది సతీదేవి.    
    "ఏదమ్మా యిలారా!" రంగమార్తాండగారు అన్నారు.    
    ఆయన దగ్గరకు వెళ్ళకుండా కీర్తి అంది "నాకు భయం బాబూ!"    
    "భయం ఎందుకు?" సతీదేవి నవ్వుతూ అంది.    
    "ఏమో" సిగ్గుతో మెలికలు తిరుగుతూ చెప్పింది కీర్తి.    
    యాత్రల కెళ్ళిన ముసలాయన గురించి రాణి గురించి కొన్ని ప్రశ్నలు వేసి గతం గురించి కొన్ని విషయాలు తనే చెప్పుకు పోయి ఆ తర్వాత మనవడితో కబుర్లు చెప్పటంలో పడి పొయ్యాడు రంగమార్తాండగారు.    
    ఇంకా అక్కడ ఎవరికీ ఏమీ మాట్లాడటానికి లేకపోయింది"    
    మాధవగురుదేవు కుర్చీలోంచి లేచాడు.    
    "కొద్దిసేపు చంద్రజిత్ ని యిక్కడే వుండనివ్వండిఅని" రంగమార్తాండగారు గట్టిగ అనడంతో చంద్రజిత్ ని అక్కడే వదిలేసి ఒకరి వెనక వొకరు ఆ గదిలోంచి బయటికి వచ్చేశారు.    
    ఆగదిలోంచి బయటికి వస్తూ కీర్తి చేసిన ఆపని ఎవరూ చూడలేదు.    
    కొన్ని అతి రహస్యమైన విషయాలను చిన్న కాగితంలో పొందు పర్చి అతిచిన్న మడతగ పెట్టబడ్డ దానిని నౌకరు కాళ్ళ దగ్గరగ వదిలి వచ్చింది కీర్తి.    
    నౌకరు ఓ అడుగు ముందుకు వేసి కాగితం మడత మీద కాలు పెట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS