Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 39


    వీరేష్ అందించిన గ్లాసు మంచినీళ్ళను గడగడ తాగేశాడు.
    వీరేష్ కు నిజానిజాలు వెలికి వస్తున్నాయనే తృప్తి కలిగింది.
    టేబిల్ మీద ముందుగా ఏర్పాటు చేసిన ప్లాస్కు తీసి కప్పులో కాఫీ పోసి అతని చేతికిచ్చాడు వీరేష్.
    రవి అర్థం కానట్టు అయోమయంగా చూశాడు.
    "బాధపడకు! ముందు కాఫీ తాగు రవీ! తరువాత చెబుదువుగాని..." భుజం తట్టాడు వీరేష్.
    జంకుతూనే కాఫీ తాగిన తరువాత రవికుమార్ స్థిమిత పడ్డాడు. అక్కడి పరిసరాలకు, వ్యక్తులకు కొద్దిగా అలవాటు పడ్డాడు.
    ఇన్ స్పెక్టరు ఇప్పుడతనికి ఆప్తుడిలా కనిపించాడు.
    "మిగిలింది చెప్పమంటారా సార్?" తనంతట తానుగా అడుగుతున్న రవికుమార్ ని చూసి వీరేష్ చిరునవ్వు నవ్వి తల ఊపాడు.
    "పుస్తకాలు అద్దెకిచ్చే వ్యక్తితోపాటు, మరి ఐదుగురు ఒక కారులో అక్కడకు వచ్చారు. మైకంలో ఉన్న అందరు ఆడపిల్లల బట్టలు ఊడదీశారు. వాళ్ళంతా ఒక్కొక్క అమ్మాయిని...."
    చెప్పడం ఆపి భారంగా శ్వాస తీశాడు.
    "డాక్టరు ముందు, పోలీసు ఆఫీసరు ముందు ఏదీ దాచనక్కరలేదు. ధైర్యంగా చెప్పు రవీ!" అతన్ని ప్రోత్సహిస్తూ అన్నాడు వీరేష్.
    వాళ్ళంతా ఆడపిల్లలను ముద్దు పెట్టుకున్నారు. తరువాత..." రవికుమార్ గుటకలు మింగుతున్నాడు.
    అతను పడుతున్న అవస్థ అర్థమయింది వీరేష్ కు. అతని మనసు పూర్తిగా పరిపక్వత చెందలేదు. వచ్చీరాని వయసులో, అతనికి సెక్స్ గురించి పూర్తిగా తెలియకపోవడంతో జరిగింది చెబుతూ తను ఉద్రేకానికి లోనవుతున్నాడని గ్రహించాడు.
    "కాస్త ఆగు రవీ అంటూ వీరేష్ వీడియో ఆన్ చేశాడు. టీ.వీ. తెర మీద వస్తున్న దృశ్యాలను కుతూహలంగా చూడసాగాడు రవి.
    అతనిలో క్రమేణా వస్తున్న మార్పును వీరేష్ గమనించాడు.
    "రవీ! సెక్స్ మీద కోరిక అనేది అన్ని జీవరాసులకూ వుంటుంది. అది భౌతిక ధర్మం. అయితే అది యుక్తవయసు వచ్చాక జరిగితేనే సంపూర్ణమైన కామ క్రీడగా గుర్తిస్తారు. సెక్స్ వ్యామోహం పరస్పర అంగీకారంతో, సమాజ కట్టుబాట్లతో జరిగినప్పుడు అది ఫలవంతం అవుతుంది. మన తల్లిదండ్రులు పరస్పర అంగీకారంతో సమాజ కట్టుబాట్ల నడుమ పెళ్ళి చేసుకుని కాపురం చేయడం వలనే మనందరం పుట్టాం! ఇప్పుడు తెలిసిన విషయాల గురించి, నువ్వు చూసిన వాటి గురించి ఉద్రేక పడక, సిగ్గుపడక జరిగింది జరిగినట్టు చెప్పు!" సెక్స్ విజ్ఞానాన్ని బోధిస్తూ అన్నాడు ఇన్ స్పెక్టర్ వీరేష్.
    రవికుమార్ స్థిమిత పడ్డాడు. అతని ముఖంలో గాని, భాషలో గాని, ఆలోచనలో గాని ఇదివరకటి ఉద్రేకం లేదు. మామూలు స్థితికి వచ్చాడు.
    "సార్! తరువాత వాళ్ళంతా ఆడపిల్లలను పాడుచేశారు. దానంతటినీ పుస్తకాలు అద్దెకిచ్చే వ్యక్తి వివిధ భంగిమలలో వీడియో తీశాడు. నేను వద్దని వారిస్తే కత్తి తీసి బెదిరించారు. ఈ విషయాలు ఎవరికీ చెప్పవద్దని, కొన్నాళ్లు నన్ను దూరంగా పారిపొమ్మని హెచ్చరించారు. వాళ్ళు నా ప్రాణం తీస్తారని భయపడి పారిపోయాను." రవికుమార్ ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తున్నది.
    వీరేష్ ముఖంలో విజయోత్సాహం చోటుచేసుకుంది.
    ఆ నవల ఎవరు రాశారో వీరేష్ కు అర్థమయింది. అది యువతరాన్ని ఉర్రూత లూరించి పాపులర్ అయిన నవల! ఆ నవలలో చివరకు విలువలు ఎలా ఉన్నా అంచెలంచెలుగా చెప్పిన సెక్స్ కథనం యువతను పెడమార్గాన నడిపించిందనటానికి రవికుమారే నిదర్శనం.
    తెలిసీ తెలియని వయసులో రవికుమార్ మీద ఆ నవల తన ప్రభావాన్ని చూపింది. అతన్ని నేరస్తుణ్ణి చేసింది. ముక్కుపచ్చలారని ఒక కన్నెపిల్ల బలైపోయింది. ఒక మాస్ బ్లూ ఫిల్మ్ తయారయింది.
    మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల జీవితాలు ఏయే దేశాలలో, ఎందరికి కనువిందు చేయనున్నాయో, చేస్తున్నాయో....
    ఇదంతా పథకం ప్రకారం జరిగిందే! రవికుమార్ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఒక ముఠా ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చు.
    పుస్తకాలను అద్దెకిచ్చే వ్యక్తి చిరునామా తెలుసుకున్నాడు ఇన్ స్పెక్టర్ వీరేష్.
    "యూ బ్లడీ స్క్రౌండ్రల్స్...." కట్టలు తెంచుకుని వస్తున్న అతని ఆవేశానికి నిదర్శనంగా అతని బులెట్ మోటార్ సైకిల్ ముందుకు దూకింది.


                                              *    *    *    *


    ఆ గదిలో స్పృహ లేకుండా పడి ఉన్నాడు సమ్రాట్. గదిలో కాల్చి పారేసిన సిగరెట్ పీకలు చిందర వందరగా పడి ఉన్నాయి. టేబుల్ మీద ఖాళీ లిక్కర్ సీసాలు....
    గది బయట అనూష తలుపు కొడుతున్నా విస్కీ మత్తులో పడి ఉన్న సమ్రాట్ కు అదేమీ వినిపించడం లేదు.
    అనూష స్వరం పెంచి సమ్రాట్ ను పిలిచింది.
    లీలగా వినిపిస్తున్న ఆమె గొంతు విన్న సమ్రాట్ లో చలనం కలిగింది. పక్కమీద భారంగా కదిలాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
    అతి ప్రయత్నంమీద లేచి తూలుతూ వెళ్ళి టేబుల్ మీద పడిపోయాడు. ఖాళీ లిక్కరు సీసాలు నేలమీద పడి పగిలిపోయాయి.
    ఆ క్షణంలో అనూషకు అతను ఒక మానసిక రోగిలా కనిపించాడు. మొదట అతని తల్లిదండ్రులు అతని పరిస్థితిని చెబితే తను నమ్మలేదు. కాని ఇప్పుడు ప్రత్యక్షంగా అతని పతనాన్ని చూసింది. అతడింతటి పిరికివాడనుకోలేదు తను!
    అతని పరిస్థితి చూస్తే, అతని తల్లిదండ్రులు పడుతున్న ఆందోళన అర్థమౌతున్నది.
    "సమ్రాట్! ఎందుకు మీరిలా మీలో మీరే బాధపడతారు? అసలు మీకేమయింది? ఎవరో మిమ్ము సాధించాలని ప్రయత్నించినంత మాత్రాన బెంబేలు పడిపోతారా? ధైర్యంగా ఉండండి. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది." అనూష అతనికి ధైర్యం చెప్పజూసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS