ఆ వెలుగులో,
తనవాళ్ళు కొందరు సీట్లకి అడ్డదిడ్డంగా, కొందరేమో సీట్ల మధ్య ఇరుక్కుపోయి, కానరావటంతో మళ్ళీ ఆడవాళ్ళంతా వక్కసారిగా గొల్లుమన్నారు.
ఆ వెలుగులోనే వాళ్ళవాళ్ళని పైకి తీయటానికి ప్రయత్నించారు.
అగ్గిపుల్ల ఆరిపోయింది.
అతను రెండో అగ్గిపుల్ల వెలిగిస్తూ "మీ దగ్గర అగ్గిపెట్టె వుంటే బయటకి తియ్యండి. ఇంక నా అగ్గిపెట్టెలో నాలుగే పుల్లలు వున్నాయి" అంటూ ముందు జాగ్రత్తతో చెప్పాడు.
దురదృష్టమేమిటంటే, ఆ బస్సులో ఎక్కినవాళ్ళ ఎవరి జేబుల్లో అగ్గిపెట్టెగాని, సిగరెట్ లైటర్ గాని లేవు. నిండు అగ్గిపెట్టె ఒకతని జేబులో మాత్రం వుంది. అతనెవరో కాదు, ఆ బస్సు డ్రైవరే. అతని ప్రాణాలు అంతక్రితమే అనంత వాయువుల్లో కలిసిపోవటం వల్ల తన జేబులో అగ్గిపెట్టె వుందని చెప్పే అవకాశం అసలే లేదు.
మోహన్ రావుకి మంచి ఆలోచన వచ్చింది.
"ఏవండీ మీరొకసారి ఇలా వచ్చి మరో అగ్గిపుల్ల వెలిగించి ఇక్కడ చూపిస్తే నా బ్యాగ్ ఎక్కడ వుందో చూస్తాను."
మోహన్ రావు మాట పూర్తి చెయ్యక ముందే మరొక ఆయన గయ్యిన లేచాడు. "చాలు చాల్లేవయ్యా చస్తూంటే సందె మంత్రం అంట. అలావుంది నీ వరస. ఇక్కడ చావు బ్రతుకుల్లో ఉన్నవాళ్ళ సంగతి చూడాల్సింది పోయి బ్యాగ్ కనపడలేదు వెతుక్కుంటానంటా వేమిటి?"
"బ్యాగ్ వెతుక్కోటానికి కాదండీ అగ్గిపుల్ల వెలిగించమంది, నా బ్యాగ్ లో టార్చిలైటు వుంది. బ్యాగ్ కనపడితేకాని, టార్చిలైటుని తియ్యటానికి వీలుకాదు." అంటూ వివరించాడు మోహనరావు.
"టార్చిలైటులో బ్యాటరీలు వున్నాయా?" అంత ప్రమాదంలో కూడా కొంటె కుర్రాడెవరో పెద్ద కంఠం వేసుకుని మరీ అడిగాడు.
"క్రొత్త టార్చిలైటు అది నిక్షేపంగా వెలుగుతుంది." మోహనరావు చెప్పాడు.
చేతిలో అగ్గిపెట్టె వున్న తను మూడో అగ్గిపుల్ల వెలిగించి మోహనరావు దగ్గరకి వచ్చాడు.
నాలుగో అగ్గిపుల్లా, ఐదో అగ్గిపుల్లా ఖర్చు అయ్యాయి. అప్పుడు కనిపించింది మోహనరావు బ్యాగ్ సీటు క్రిందకి పడివుంది ఆ బ్యాగ్.
మోహనరావు బ్యాగ్ అందుకున్నాడు.
ఆ చీకట్లోనే బ్యాగ్ లోకి చెయ్యి పోనిచ్చి, బ్యాగ్ లో వున్న వస్తువులని అటూ ఇటూ కెలికి మొత్తానికి టార్చిలైటుని పట్టుకో గలిగాడు.
మరో నిమిషంలో,
టార్చిలైటు ప్రకాశవంతంగా వెలిగింది.
18
బస్సు అంత ప్రమాదానికి లోను అయినా,
బస్సులో వున్న కొందరు చాలా చిన్న చిన్న గాయాలతో క్షేమంగానే వున్నారు.
అయితే,
బాగా వున్నవాళ్ళు ఎనిమిది మంది, గాయాలు తగిలినవాళ్ళు నలభై ఎనిమిది మంది. ఆ నలభై ఎనిమిది మందిలో ఏడెనిమిది మంది అప్పటికే మరణించి వున్నారు. పది మంది స్పృహ లేకుండా పడివున్నారు. మిగతావాళ్ళు చేతులు విరిగి కాళ్ళు విరిగి పూర్తిగా పైకి లేవలేని పరిస్థితిలో కొందరు మూలుగుతూనూ, కొందరు బాధ భరించలేక ఏడుస్తూనూ వున్నారు.
అక్కడికి,
సమయానికి ఏ దేముడూ వచ్చి రక్షించలేక పోయినా, మోహనరావు చేతిలోవున్న టార్చిలైటు వాళ్లకి వెలుగు చూపటానికి ఆధారమయింది.
బాగా వున్నవాళ్ళు చకచకా రంగంలోకి దిగారు. మోహనరావు కుడిచేతికి దెబ్బ తగలటం వల్ల, ఆ చేతిని శరీరానికి గట్టిగా నొక్కి పట్టివుంచి ఎడమ చేతితో టార్చీ వెలిగించి చూపిస్తూ వుంటే బస్సులో వున్న ఒక్కొక్కరినీ బయటకి తీసుకువచ్చి రోడ్డు మీద పడుకోపెట్టటం మొదలుపెట్టారు మిగతా వాళ్ళు.
