ఒక చెయ్యి పూర్తిగా స్వాధీనంలో లేకుండా బెణికి, ఇంక ఏ చిన్న గాయమూ కాకుండా కాస్త క్షేమంగా వుంది. ఒక్క మోహనరావు మాత్రమే.
మోహనరావు బస్సు యాక్సిడెంట్ కు గురి అయింది అని మాత్రం గుర్తించాడు. బాధతో కుడిచెయ్యి విలవిలలాడుతూ వుంటే నెప్పి భరించలేక, ఎడమచేత్తో కుడిచేతిని గట్టిగా పుచ్చుకుని సీటు వెతుక్కొని కూర్చున్నాడు.
కొద్దిసేపు తరువాత మోహనరావు బుర్ర పనిచేయటం మొదలుపెట్టింది.
"మామయ్యా! అత్తయ్యా!" అంటూ ఒకటి రెండుసార్లు పిలిచాడు మోహనరావు.
పార్వతీ, శివరావు పలికే స్థితిలో లేనందువలన వాళ్ళ దగ్గరనుంచీ సమాధానం రాలేదు.
మోహనరావు ఆ చీకట్లో గ్రహించలేదుగానీ, ఆ విసురుకి రెండు సీట్లుకి ఇవతలకి వచ్చిపడ్డాడు. అతనికి ఆ చీకట్లో ఎవరిదో కాలు మరెవరిదో చెయ్యి తగిలాయి.
వాళ్ళు చనిపోయారో స్పృహ తప్పివున్నారో తెలియదు గానీ, ప్రస్తుతానికి మాట్లాడే స్థితిలో మాత్రం లేరు.
మోహనరావు లేచి నడవబోయే సరికీ, అతని కాలు వెళ్ళి ఎవరికో తగిలింది. దాంతో అతను ఎగిరి గంతేసినంత పనిచేసి ముందుకు తూలి పడ్డాడు! ఆ పడటంతో బెణికిన చెయ్యి విరిగినంత పనయింది. మొహానికి చిన్న గాయం కూడా అయింది. అలాగే ఆ చీకట్లో తడుముతూంటే, మనుషులు తేలుస్తున్నారు. కానీ, దాంట్లో అత్తయ్య ఎవరో, మామయ్యా ఎవరో మాత్రం తెలియలేదు. మరోసారి "అత్తయ్యా మామయ్యా!" అరిచి చూశాడు. కించిత్ ప్రయోజనం కలుగలేదు.
అందరూ కేకలు ఏడ్పులూ ఆపండి!" బస్సులో వున్న ఎవరో గట్టిగా అరిచి చెప్పారు.
ఆయన మాట ఎవరూ వినిపించుకోకపోగా, ఆడవాళ్ళు మరికాస్త కంఠం పెంచి ఏడవటం మొదలుపెట్టారు.
"మీరంతా ముందా కేకలూ, ఏడ్పులూ ఆపితే ఏం చెయ్యాలో చెబుతాను." ఒకటికి రెండుసార్లు అరిచిమరీ చెప్పాడు ఇందాక అరిచిన ఆయన.
ఆయన అరుపుకి ఈతఫా కాస్త ఫలితం కనిపించింది. అరుపులూ కేకలూ ఆగిపోయాయి. చిన్నగా మూల్గులూ, ఏడ్పులూ బదులు వెక్కటం మాత్రం వినిపించసాగాయి.
బస్సు ప్రమాదానికి లోనయిందని మనందరికీ తెలుసు. మనలో బాగున్నవాళ్ళు జాగ్రత్తగా ముందుగా బస్సులోంచి క్రిందకి దిగి ఆ తరువాత లోపలి వారిని బయటికి తీసుకురావాలి. మీ దగ్గర ఎవరిదగ్గరయినా టార్చ్ లైట్ వుందా?" ఆ చెప్పినాయిన కాస్త తెలివిగలాయన లాగున్నాడు. ధైర్యమూ, ఉపాయమూ, కర్తవ్యమూ చెప్పి టార్చ్ లైటు అడిగాడు.
"నా దగ్గర వుంది!" బస్సులో ఎవరో అరిచారు.
"ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే వెలిగించు" అన్నాడు వెంటనే ఆయన.
"టార్చ్ లైటు అయితే వుంది. దానిలో బ్యాటరీలు లేవు." మెల్లగా చెప్పాడు ఇందాకటతను.
నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్థితి ఏమిటంటే ఇదే.
వాళ్ళ మాటలు అలా జరుగుతూండగా మోహనరావుకి గుర్తువచ్చింది తన బ్యాగ్ లో టార్చ్ లైటువున్న సంగతి. తన దగ్గర టార్చ్ లైటు వున్న సంగతి ముందే చెప్పకుండా బ్యాగ్ కోసం తడమసాగాడు.
బ్యాగ్ సీట్ల మధ్యనే పడిందో, ఎగిరివెళ్ళి ఇంకా దూరంగా పడిందో కానీ, మోహనరావు తడిమిచూసినంతలో మాత్రం కానరాలేదు.
మోహనరావుకి ఏం చెయ్యాలో పాలుపోలేదు.
చుట్టూ, బీడీ, సిగరెట్ త్రాగడం దుర్ వ్యసనమే కావచ్చు, కానీ సిగరెట్ త్రాగే ఒకాయన జేబులో అగ్గిపెట్టె వుండటంతో, ఆ అగ్గిపెట్టెలో అరడజను పుల్లలే వుండటం అంతవరకూ అదృష్టమే. బస్సుకి యాక్సిడెంట్ కి అగ్గిపెట్టె ఎగిరివెళ్ళి అల్లంత దూరాన పడక పాంటు జేబులో క్షేమంగా వుండటంతో సిగరెట్ త్రాగే అతను అగ్గిపెట్టె జేబులో నుండి తీసి అగ్గిపుల్లని వెలిగించాడు.
కొద్దిపాటి వెలుగు అయినా, బస్సులోపల చాలా భాగాలకి ప్రసరించింది.
