Previous Page Next Page 
మంచివాడు పేజి 39

ఆ మాటకు ఆమె ఉలిక్కి పడింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
భాస్కరుకు ఆమెను చూస్తుంటే జాలి వెయ్యలేదు.
"మొగుడి కళ్ళు కప్పి పారిపోయి వస్తున్నావు గదూ?"
"కాదు...కాదు..." గట్టిగా దాదాపు అరిచినట్టే అన్నది. అంతలోనే దుఃఖం పొర్లుకొచ్చింది. రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.
భాస్కరుకు ఈసారి జాలివేసింది. అందమైన ఆడపిల్ల అలా ఏడుస్తుంటే చూడలేక పోయాడు.
"ఊరుకో! నేనేమీ అడగనులే?" అన్నాడు జాలి ఉట్టిపడే స్వరంతో.
ఆమె కళ్ళు తుడుచుకుంది. తలెత్తి భాస్కరు ముఖంలోకి చూసి "అసలు సంగతి చెప్పమంటారా?" అంది.
"నీ ఇష్టం !"
"నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. ఆ సంగతి తెలిస్తే మీరు అంత కఠినంగా మాట్లాడరు. నాకు అన్యాయం జరుగుతూ వుంటే తల వంచి వుండలేక పారిపోయి వచ్చాను. నా నూరేళ్ళ జీవితాన్ని అయినవాళ్ళే నాశనం చేయడానికి సిద్ధపడ్డారు. నాకు అమ్మా, నాన్నా లేరు. మాది బందరు దగ్గిర ఓ చిన్న పల్లెటూరు. ఊరు పేరెందుకులెండి. మా మేనమామ ఇంట్లో పెరిగాను. స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నాను. మా మామ తన భార్య పోరు పడలేక నన్ను తన బావమర్దికి ఇచ్చి పెళ్ళి చెయ్యడానికి నిశ్చయించు కున్నాడు. వాడు వట్టి బడుద్దాయి. పొట్టకొస్తే అక్షరం ముక్కలేదు. నల్లగా మొరటుగా తుమ్మ మొద్దులా వుంటాడు. అతనంటే నాకు అసహ్యం. నేను ఎంత ఏడ్చినా, మొత్తుకున్నా లాభం లేకపోయింది. అందుకే పారిపోయి వచ్చాను." చివరి మాటలు అంటున్నప్పుడు ఆమె కంఠం దుఃఖంతో బొంగురు పోయింది!
భాస్కరుకు బోలెడంత జాలి వేసింది.
అపరంజి బొమ్మలా వుంది. చూస్తూ చూస్తూ ఈ పిల్ల గొంతు కొయ్యడానికి ఎలా సిద్ధపడ్డాడో ఆ మేనమామ!
"ఎక్కడి కెళతావ్? ఎవరైనా తెలిసిన వాళ్ళు వున్నారా!"
"లేరు. ఎక్కడికెళ్ళాలో నాకే తెలియదు." కళ్ళలో నీరు తిరిగింది.
భాస్కరు ఆలోచనలో పడ్డాడు.
"నీ పేరేమిటి?"
"అమల"
అమల! ఎంత బాగుంది పేరు. అందానికి తగ్గ పేరు. పాపం! ఈ పరిస్థితుల్లో వ్యక్తిత్వం గల ఏ ఆడపిల్లయినా యిలాగే చేస్తుంది.
"మరి హయిదరాబాద్ లో ఎక్కడి కెళతావు?"
ఆ పిల్ల అయోమయంగా, దిగులుగా భాస్కరు ముఖంలోకి చూసింది.
"నాతో వస్తావా?"
"మీతోనా" బెదిరిపోతూ ప్రశ్నించింది.
"ఏం నేనంత దుర్మార్గుణ్నిగా కనిపిస్తున్నానా" నవ్వుతూ అన్నాడు భాస్కరు.
ఆ అమ్మాయి మాట్లాడలేదు.
"నన్ను పెళ్ళిచేసుకొంటావా?"
ఆ అమ్మాయి చివ్వున తలెత్తి చూసింది ఓ క్షణం.
"మీకు నన్ను చూస్తుంటే ఎగతాళిగా వుందా?" చేతుల్లో ముఖం దాచుకొని మళ్ళీ వెక్కి వెక్కి ఏడవసాగింది.
"అమలా! నేను ఎగతాళి చెయ్యడం లేదు. నిజమే చెబుతున్నాను. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నా హృదయాన్ని పోగొట్టుకున్నాను. నా కలల్లోని రాజకుమారివి నువ్వే! నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను" ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
ఆమె ఓ క్షణం నమ్మలేనట్టు భాస్కరు ముఖంలోకి చూసింది. భాస్కరు ముఖంలో ఆమెకు ఏం కన్పించిందో, మరుక్షణంలో కళ్ళు సంతోషంతో మిలమిల మెరిసిపోయాయి.
భాస్కరు కన్నీటితో తడిచిన ఆమె చెంపల్ని తుడిచాడు. హైదరాబాద్ వెళ్ళగానే రిజిష్టర్ మారేజ్ చేసుకుని తర్వాత తండ్రికి ఉత్తరం రాయడానికి నిశ్చయించుకున్నాడు.
బయటికెళ్ళి ఆమెకు టికెట్ కొనుక్కొచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS