నా ఆలోచనలు ఒక కొలిక్కి రాలేదు. ఐనా అలా ఆలోచిస్తూనే వున్నాను.
దీర్ఘంగా...
19
"నేను మొదటి నుంచీ మొత్తుకుంటూనే వున్నాను సార్! మీరే నా మాట పెడచెవిన పెట్టారు." అహోబిలం అన్నాడు.
"ఏమిటీ పెడచెవిన పెట్టానా? ఇంకా నయం ఎడం కాలు పెట్టానన్నావు కాదు. నీవేదన్నా చెప్పదలుచుకుంటే తిన్నగా, ముక్కుసూటిగా చెప్పు! అంతేకాని, ఇలా పెడచెవి, ఎడం కాలు, తొర్రి ముక్క అంటే మాత్రం నాకు మా చెడ్డ చిరాకు వస్తుంది." ఇన్ స్పెక్టర్ వర్ధనరావు విసుక్కుంటూ అన్నాడు.
"అదికాదు సార్!"
"అదికాదు, ఇదికాదు. ఏది కాదో చెప్పు! వూరికినే నాన్చకు." మరోసారి కోప్పడ్డాడు వర్ధనరావు.
"నా ఉద్దేశ్యం ఏమిటంటే సార్! వాళ్ళు మోసగాళ్ళు, పారిపోయారూ అని. రెండో రోజులు మన నమ్మకం కోసం పోలీస్ స్టేషన్ కి వచ్చారు సంతకాలు పెట్టారు. సమయం చూసుకున్నారు. కాళ్ళకి బుద్ధి చెప్పారు. వాళ్ళు నిండా మోసగాళ్ళు సార్! మన కళ్ళుగప్పి పారిపోయారు. ఇదంతా పెద్ద నాటకం."
"ఆపేయ్! ఇంక ఆపేయ్! 'హెడ్ కానిస్టేబుల్ కావటానికి అర్హత ఏమిటంటే, హెడ్డు లేకపోవటమే.' అన్నాడు వెనకటి నీలాంటివాడే. కుర్రాళ్ళిద్దరూ చూడటానికి చాకుల్లా వున్నా ఉత్త అమాయకులు. వాళ్ళు జైల్లో వుంటాం దేముడా! అని మొత్తుకున్నారా? లేదా? వజ్రాల రహస్యం చేధించడానికి బాస్ ని పట్టడానికి నేనే వాళ్ళని వదిలివేశాను. వాళ్ళు ఈ మూడు రోజులూ బుద్ధిమంతుల్లాగా వచ్చి మనకి కనపడి సంతకం పెట్టి వెళ్ళారు.
ఉన్నట్టుండి రెండురోజులబట్టి కనబడటంలేదు. అందువలన నీవు వాళ్ళని అనుమానిస్తున్నావు. ఏ నేరస్తుడయినా తనని అనుమానించేలాగా వెధవ పని చేస్తాడా? నా ఐడియా ఏమిటంటే, ఆ బాస్ గాడే వీళ్ళని ఎత్తుకెళ్ళి వుంటాడు.
ఓ ప్రక్క బాస్ గాడి ఫోను, మరోప్రక్క వీళ్ళు మాయంకావటం, మరొక ప్రక్క ముకుందదాస్ వజ్రాల గురించి అదేపనిగా మనకి కబుర్ల మీద కబుర్లు చేయటం, మనకి ఫోన్ల మీద ఫోన్ లు చేయటం. ఇదంతా చూస్తూంటే నీకేమనిపిస్తోంది?" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు తను చెప్పవలసింది చెప్పి, అభిప్రాయం అడిగాడు.
మీరే చెప్పారు గదా సార్!" వినయంగా అన్నాడు అహోబిలం.
"తను చెప్పింది ఏమిటో ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి అర్థంకాలేదు. తనకి అర్థంకాలేదని చెబితే బాగుండదు కదా! పోనీ అర్థమయినట్లు తల పంకిద్దామంటే, అహోబిలం అన్నదేమిటో నిజంగానే అర్థంకాలేదు. ఇలా అర్థమయ్యీ కాని భాష అంటే ఆయనకీ మహా ఒళ్ళుమంట. కానీ, ఇలాంటి సమయంలో ఒళ్ళుమంట అయినా, కళ్ళుమంట అయినా బయట పడకూడదు కాబట్టి, చాలా తెలివి ప్రదర్శిస్తూ__
"నేను చెప్పానయ్యా, నిజమే! కానీ, ఎప్పుడూ కూడా మాట్లాడేటప్పుడు చాలా నైస్ గా ఒక తీరు తెన్నూ వుండేటట్లు మాట్లాడాలి. మీరే సెలవిచ్చారు, మీరు అప్పుడు అలా అన్నారు, మీరు ఇప్పుడు ఇలా అన్నారు, అంటే ఏం బాగుంటుంది. ఎవరు ఏమన్నారన్నది చెప్పాలి. చెప్పి అదేమిటీ అని అడగాలి. ఊ! ఇప్పుడు చెప్పు! ఇందాక ఏమిటి అన్నావ్?" అన్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
"మీరే చెప్పారుగదా సార్! అని అన్నాను అంతేసార్!" అహోబిలం వినయంగా అన్నాడు.
"అదేనయ్యా! అదే కూడదు అన్నాను. నేను చెప్పింది ఏమిటో ముక్కుసూటిగా చెప్పి మాట్లాడు. డొంక తిరుగుడు మాటలు ఇప్పుడే వద్దని చెప్పాను కదా!" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు గద్దిస్తూ అన్నాడు.
కానిస్టేబుల్ అహోబిలానికి విషయమేమిటో గబుక్కున గుర్తుకు వచ్చింది.
"వాళ్ళు నాటకాలు ఆడలేదని, నిజంగా వాళ్ళేదో ఆపదలో వున్నారని మీరు చెప్పారు గదా సార్! నిజంగా అదే జరిగి వుంటుంది. మీ మాటే నిజం సార్! వాళ్ళు నాటకాలు ఆడే మనుషులు కాదు సార్!" వినయంగా సెలవిచ్చాడు.
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు చింతపిక్కలాంటి కళ్ళు తళుక్కుమన్నాయి "హమ్మయ్య దారిలోకి వచ్చావయ్యా! ఇలా చాలా ముక్కుసూటిగా చెప్పాలి" మెచ్చుకోలుగా అన్నాడు.
పైకి ఒక వెర్రినవ్వు నవ్వి, "ఇప్పటికి నేను బ్రతికి బయట పడ్డాను" అనుకున్నాడు అహోబిలం.
"మనం ఈ విషయం చాలా సీరియస్ గా ఆలోచించాలి." సీరియస్ గా ముఖంపెట్టి చెప్పాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
