ఇప్పుడు శశాంక వెడుతున్న సమయంలో ఆమె గట్టిగా ఆలోచిస్తున్నది ఒక వేళ మాట తప్పితే శశాంకని బెడ్ పైకి ఎలా రప్పించుకోవాలా అని మాత్రమే.
రేక్ లోని కవరందుకుని ఓ ఫోటో బయటకు లాగింది.
ధనుష్కోటిని శశాంక చంపుతుండగా తీసిన ఫోటో అది.
** ** **
సిటీలోని ఓ మారుమూల ప్రాంతం...
ప్రభుత్వాలెన్ని మారినా, ప్రణాళికలెన్ని అమలులోకి వచ్చినా వాటి నీడే అసలు పడనట్టు ఎటు చూసినా మురికివాడలే కనిపించే ఆ ప్రదేశంలో ఓ పెద్ద ఆటో వర్క్ షాప్.
సుమారు అరెకరం వైశాల్యం గల ఆ స్థలం ఒకప్పుడు ఎవరిదో. అందులోని పాడుబడిన భవంతిలాంటి ఇంటిలో జరిగే చీకటి వ్యవహారాలేమిటో, పూర్తిగా పోలీసులకు తెలియకపోయినా ఆ ఇంటి ఆవరణలో వున్న రిపేర్లు చేయబడుతున్న కార్లు, స్ప్రే చేయబడుతున్న రంగులూ చూసి అక్కడ పరిసరాల్లో నివసించే ఏ వ్యక్తయినా చెప్పగలడు. దానికి అధిపతి అయిన రాజ్ కుమార్ దాదా ఎలాంటి ప్రమాద భరితమైన వ్యక్తో... ఆ స్థలాన్ని ఆక్రమించి ఏ విధంగా అతడు సొంతం చేసుకున్నాడు?... కాని చిత్రమేమిటంటే సామాన్యుడెవరూ నోరు విప్పడు... అక్కడ జరిగే చాలా అనర్థాల్ని, హత్యల్ని చూసి కూడా తెలియనట్టు వెళ్ళిపోతుంటారు.
సరిగ్గా ఒంటి గంటన్నర ప్రాంతంలో రాజ్ కుమార్ దాదా అనుచరులిద్దరూ హైకోర్టు ప్రాంతంలోని ఓ కారును దొంగిలించి తీసుకొచ్చారు.
ఆగిన ఎంబాసిడర్ ని చూస్తూ ఆ రోజు టార్గెట్ ని పూర్తిచేసిన అనుచరులిద్దర్నీ అభినందించాలని ముందుకొచ్చాడు రాజ్ కుమార్.
"దాదా" రొప్పుతున్న ఓ అనుచరుడు మెరుపులా నిలబడ్డ దాదాని చేరి అన్నాడు. "మైసయ్య ఈ రోజు మన కొంప ముంచాడు."
మైసయ్య అక్కడికి కారెత్తుకు వచ్చిన ఇద్దరు అనుచరుల్లో ఒకడు. "నేను కారు స్టార్ట్ చేయబోతుండగా ఓ బీట్ కానిస్టేబుల్ అనుమానించి దగ్గరకు వస్తుంటే రాములూ దిగిపో అంటూ వాడికి వినబడేటట్టు నా పేరుపెట్టి పిలిచాడు. రాములు తల వంచుకున్న మైసయ్యని చూసి మండిపడుతూనే చెప్పుకు పోయాడు." ఫుట్ పాత్ మీద నిలబడి చుట్టూ చూడు బే అంటే, ఇలాంటి వెధవ పని చేసి అప్పుడు వేగంగా కారులోకొచ్చి కూర్చున్నాడు..." కానిస్టేబుల్ కి ఓ ఆర్టీసి బస్సు అడ్డమొచ్చి మధ్యలో ఆగడంతో నేను కారును ముందుక్కదిలించాను గాని, పేరు వినిపించి నన్ను గుర్తుపట్టాడేమో అని అనుమానంగా వుంది."
"బేవ్ కూఫ్" గొంతు కర్కశంగా పలికిన మరుక్షణం రాజ్ కుమార్ అరచేయి వేగంగా మైసయ్య మెడని తాకింది. అంతే, అంత బలిష్టంగా వున్న మైసయ్య మెడ నరికిన కోడిలా రెండే రెండు క్షణాలు గిలగిలా కొట్టుకుని నేలపైబడి కళ్ళు తేలేశాడు.
డి.సి.పి. అమీర్ సిటీలో అడుగుపెట్టడంతో అప్పటికే చాలా అడ్డా (దాదాగిరికి నిలయమైన ప్రదేశాలు)లు ఇరకాటంలో పడ్డాయి... అందుకే రాజ్ కుమార్ అంత ఆవేశపడింది.
"దాదా... వీడు చచ్చిపోయాడు."
"పెద్ద నష్టం లేదు బే... శవాన్ని హుస్సేన్ సాగర్ లో తోసేసి వాడి పెళ్ళానికి ఓ అయిదు వేలిచ్చేయండి, బడ్డీకొట్టు పెట్టుకుంటుంది" తీర్పు చెప్పిన వెంటనే మైసయ్య శవం ఓ కారు డిక్కీలో పడేశారు.
అప్పటికే పోలీసు రికార్డ్స్ లో ఇరుక్కున్న రాములు ఇప్పుడేం కొంప మునుగుతుందో అని భయపడుతుంటే, భయం లేదు నేనున్నాను అన్నట్టు చూసి ఆగిన అంబాసిడర్ ని చేరి పరిశీలనగా గమనించసాగాడు.
నెలకి పదివేల దాకా సమీపంలోని పోలీసు స్టేషన్ కి "హఫ్తా (మామూళ్ళు) ఇచ్చే చాలా పలుకుబడిగల రాజ్ కుమార్ ఇప్పుడు ఆలోచిస్తున్నది, వీలైనంత వేగంగా పోలీసుల దృష్టిలో పడిన ఆ కారు రంగు మార్చి, మరో రాష్ట్రానికి తరలించేయాలని, సుమారు అయిదేళ్ళుగా తనను ఆశ్రయిస్తూ బ్రతికిన మైసయ్యనే ఓ గూండా ఒక చిన్న తప్పుకి ప్రాణాలు కోల్పోయిన విషయం ఇందాకే మరచిపోయాడు.
సరిగ్గా అప్పుడు వినిపించింది "ఎక్స్ క్యూజ్మీ."
వెనుదిరిగిన రాజ్ కుమార్ సాలోచనగా చూశాడు శశాంకని.
"నా పర్సనాలిటీ చూసి నేనో పోలీసాఫీసర్నని కంగారుపడకు మిస్టర్ రాజ్ కుమార్..." సరాసరి రాజ్ కుమార్ ని చేరాడు. అక్కడ పని చేస్తున్న వ్యక్తులంతా గూండాలని ముందే తెలిసిన శశాంక రాజ్ కుమార్ ని గుర్తు పట్టడానికి పెద్ద శ్రమ పడలేదు. "ఓ కారు కావాలి... లోపల మాటాడుకుందామా" తనే నడిచాడు.
ఓ చిన్న హాలులోకి శశాంకతోపాటు అడుగుపెట్టిన రాజ్ కుమార్ "ఇటురండి" అంటూ క్రిందికి మెట్లున్న ఓ నేలమాళిగ చూపించాడు.
చిన్న ద్వారాన్ని దాటి లైటు వెలిగించిన రాజ్ కుమార్ గమనించలేదు. శశాంక అప్పటికే తలుపుకి బోల్ట్ వేయడాన్ని.
రాజ్ కుమార్ నోరు తెరిచి ఏదో అడగబోయాడు. వినే సహనం లేని శశాంక పిడికిలితో అతని పెదవులపై ఎంత బలంగా గుద్దేడూ అంటే అతడికి మెదడు నరాలన్నీ కదిలి కళ్ళు బైర్లు కమ్మాయి.
బలాన్ని కూడగట్టుకోబోతున్న రాజ్ కుమార్ కి అవకాశం యివ్వకుండా మోకాలితో పొట్టలో వేగంగా పొడిచేసరికి అంత బలిష్టుడూ విస్త్రాణగా చతికిలబడిపోయాడు.
"చెప్పు" రాజ్ కుమార్ ని నేలపైకి ఈడ్చి గొంతు పట్టుకున్న శశాంక "ఎందుకు? నా భార్య కృపని ఎందుకు చంపావు... చెప్పు" అంటూ చేతుల్ని బిగించాడు...
ఇక్కడ శశాంక పొరబడింది తాను ఓ కారు కొనే నెపంతో లోపలికి సునాయాసంగా అడుగుపెట్టానని...కాని శశాంక ఎవరూ? ఎందుకొచ్చిందీ వెంటనే గుర్తించిన రాజ్ కుమార్ అతడిని అనుసరిస్తూనే తన అనుచరులకి హెచ్చరించాడు. అయితే కృపని నిజంగానే హత్య చేసిన రాజ్ కుమార్ ఈ క్షణాన వూహించనిది శశాంకలోని ఇంతటి శక్తిని.
