Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 39


    మనోహర్ నవ్వి -


    "మరోసారి వస్తాను. గుడ్ నైట్" అంటూ కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.


    సారధి ఆమెని లోపలికి తీసుకొస్తుంటే లక్ష్మిపతి కంగారుగా.....


    "ఏమిటిది? ఏమైంది?" అడిగాడు. సారధి సమాధానం చెప్పలేదు.


    భారతిని పొదివి పట్టుకొని మెల్లగా, పడగ్గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు.


    అతని వెనకనేవచ్చిన మేనమామకేసి చూసి సన్నగా నవ్వాడు సారథి.


    "భారతి చాలా అదృష్టవంతురాలు మావయ్యా,  ఓ నాగుపాము కాటేయబోతున్న సమయంలో ఓ దేవుడు కాపాడాడు. షి ఈజ్ రియల్లీ లక్కీ" అన్నాడు.


    "వివరంగా చెప్పు"


    మనోహర్ తనకి చెప్పిన విషయాల్ని తరువాత తను చూసిన దాన్ని వివరంగా చెప్పాడు సారథి.


    లక్ష్మిపతి పళ్ళు పటపట మని కొరికాడు.


    "రాస్కెల్. రిపోర్టిచ్చి వాడి కాళ్ళు విరిపించేస్తాను" అన్నాడు.


    "వాడి పళ్ళు ఎలాగూ అతను ఊడగొట్టేశాడు. రిపోర్టు ఇచ్చి ఇప్పుడు మనం మన అమ్మాయిని అల్లరి చేసుకోవడం అవుతుంది. అదీ కాక అత్తయ్యకి తెలీడం మరీ ప్రమాదం కదూ!"


    ఆయన భృకుటి ముడి పడింది. రెండు క్షణాలు ఆలోచించి.....


    "అవును నిజమే" అన్నాడు. అక్కడే నిలబడి వున్న బాలయ్యని చూశాడు సారధి.


    "అమ్మగారు ఇంటికొచ్చినా ఏమీ జరగనట్టే ఉండాలి. ఓ నిమ్మకాయని కోసి పట్టుకురా" అన్నాడు సారధి.


    బాలయ్య సమాధానం చెప్పకుండా పరుగులాంటి నడకతో వెళ్ళి పోయాడు.


    లక్ష్మీపతి కళ్ళలో సన్నని నీటి పొరలు తొంగి చూస్తున్నాయి.


    ఆయన మనసు ఎలా తల్లడిల్లిపోతున్నదీ సారథి ఊహలకందని విషయం ఏమీ కాదు.


    భారతి ఎంత డిసిప్లిన్ గర్లో ఆయనకి బాగా తెలుసు.


    ఆ రాస్కెల్ తో అసలు ఎలా కలిసిందీ వెళ్ళిందీ అంతుచిక్కలేదు. ఏదో కారణం ఉండి ఉంటుందని మాత్రం ఆయన నమ్ముతున్నాడు.


    బాలయ్య నిమ్మకాయ చెక్కల్ని తీసుకొచ్చాడు.


    ఓసారి మేనమామ కేసి చూసి సారధి మెల్లగా భారతి నోరు తెరచి నిమ్మకాయ రసాన్ని నోట్లో పిండాడు.


    భారతి వికారంగా మొహాన్ని పెట్టి రెండు గుటకలు వేసింది.


    "ఆ వెధవ నా కొడుకు ఎవడో చూపెట్టుబాబూ, ముక్కలుగా నరికి పోగులా వేస్తాను" అన్నాడు బాలయ్య.


    "అంత పనీ జరిగిపోయింది బాలయ్యా, ఇంకెప్పుడూ భారతి జోలికి వాడు రాడులే" అన్నాడు సారధి.


    "అమ్మగారొచ్చి చూస్తే తంటా వస్తుంది బాబు" అన్నాడు బాలయ్య దిగులుగా.


    "ఏం ఫరవాలేదు. ఆమె వచ్చేసరికి ఎలాగూలేటవుతుంది. అత్తయ్య భారతి గదిలోకి రాకుండా నేను చూసుకొంటాను" అన్నాడు సారధి.


    లక్ష్మిపతి తల వూపాడు.


    గదిలో లైటు తీసేసి బెడ్ లైట్ వేసి గది తలుపుల్ని దగ్గరగా చేరగిల వేసి కిందికి వచ్చేశారు వాళ్ళు.


    లక్ష్మీపతి భోజనం చేసి హాల్లో కూర్చున్నాడు. సారధి తను అత్తయ్యతో కలిసి తింటానని చెప్పాడు.


    టైం పది కావస్తోంది.


    ఒకళ్ళతో ఒకళ్ళు ఏమిటో మాట్లాడాలని వుంది. కానీ ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు.


    లక్ష్మీపతి నాలుగు సిగరెట్లు వరుసగా కాల్చాడు.


    తన బిడ్డకి జరగబోయిన అవమానానికి ఆయన మనసు బుసకొడుతోంది.


    కానీ చిన్నవాడైనా సారధి మాటలకి మన్నించక తప్పడం లేదు.


    పదిన్నరవుతోండగా లలితాంబ వచ్చింది.


    వాళ్ళిద్దర్నీ చూసి.....


    "ఇంకా పడుకోలేదా?" అని అడిగింది.


    "నీకోసమే ఎదురుచూస్తున్నా అత్తయ్యా" అన్నాడు సారధి.


    "దేనికి?"


    "నాకు ఆర్డర్స్ వచ్చినాయి. నువ్వు చేసిన ఈ మేలుని జీవితంలో మరచిపోను."


    లలితాంబ మొహం ప్రసన్నంగా మారింది.


    "ఈ అభిమానం వుంటే చాలు" అని పక్కనే నిలబడి బాలయ్యని చూసి......


    "అమ్మాయి ఏం చేస్తోంది?" అని అడిగింది.


    "ఇప్పటి వరకు చదువుకొని పడుకున్నారమ్మా!" అన్నాడు బాలయ్య.


    లలితాంబ "రెండు నిమిషాలు......" అంటూ మేడమెట్లుకేసి నడవబోయింది. లక్ష్మీపతి సారధికేసి చూశాడు.


    "అత్తయ్యా" పిలిచాడు సారధి.


    ఆమె వెనక్కి తిరిగి -


    "ఏమిటి?" అంది.


    "నేను రేపు వెళ్ళిపోతున్నాను."


    "ఓ.కే" అని రెండుమెట్లు ఎక్కింది.


    "అదేమిటత్తయ్యా బాగా అలసిపోయినట్టుగా ఉన్నావు. మళ్ళీ ఆ మెట్లన్నీ ఎందుకు ఎక్కడం. భోజనం చేసి పడుకోక" అన్నాడు.


    "అమ్మాయిని చూడాలని" అంది.


    "నిద్రపోతోంది కదా"


    "ఎంత లేటయినా సరే, దాన్నోసారి చూసి రావడం నా కలవాటు. నీకు తెలీదా ఆ సంగతి"


    సారధి నవ్వాడు.


    "నీకు భారతంటే ఎంత ప్రేమో నాకు తెలీకపోతే కదా! నాకు ఆకలిగా వుంది. నాకు ఉద్యోగం వచ్చిన ఆనందంతో నీతో కలిసి భోజనం చెయ్యాలని ఎదురుచూస్తూ కూర్చున్నాను. ముందు భోజనం చేద్దాం రా అత్తా" అని ఆమెని చెయ్యి పట్టుకుని కిందికి తీసుకొచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS