Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 40

అభినయ్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని వున్నాడు. తల్లి స్వయంగా వడ్డించి కొసరి కొసరి తినిపిస్తుంది.
"ఈ అనందం నాకు శాశ్వతం కావాలి బాబూ"
 అభినయ్ చేత తన భర్త ఎలాంటి పనులు చేయిస్తుందీ ఆమెకు తెలుసు.
"నేను పూర్తిగా మారిపోయాను అమ్మా"
"నాకు చాలా ఆనందంగా వుంది. పశ్చాతాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఇకమీదట అయినా నా బిడ్డవు అనిపించుకో. సాటిమనిషి గర్వపడేలా బతుకు. ఈ అంతస్థు ఐశ్వర్యం, పదవులు శాశ్వితం కావు బాబూ."
"నామీద ఎనలేని ప్రేమాభిమానాలను కురిపించే నీ మనసు నాకు తెలుసు.
నీవంటి తల్లి తప్పుచేసింది అని ఎవరయినా అంటే విని నేను భరించగలనా అమ్మా?
ఆమాట వసుమతి హృదయాన్ని పిడుగుపాటులా తాకింది.
కొద్దిక్షణాలు మౌనం....
భరించరాని  నిశ్శబ్దం తరువాత....
"నో... నా తల్లిమీద నింద వేసినవాళ్ళు ఎవరయినా సరే... నాకు కోపం వస్తే ఏం జరుగుతుందో చేసి చూపిస్తాను" అన్నాడు కసిగా.
"ఏమిటిబాబూ నువ్వు అనేది... ఇప్పుడేగా నాకు మాట ఇచ్చావు. ఇంతలోనే ఏమైంది? నువ్వు హంతకుడివి అయితే నేను భరించలేను."
"నన్ను క్షమించు అమ్మా... నా తల్లిని నిందించిన దాని నాలుక చేరేస్తాను. దానినే పతితగా మార్చివేస్తాను. ఈ అభినయ్ పగ ఎలాంటిదో రుచి చూపిస్తాను" అంటూ విసురుగా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచాడు.
వసుమతి మొహం వివర్ణమయింది.
కారుమబ్బులు కమ్మినట్టు మనసు అంత చీకటి అయింది.
"ఎవరుబాబూ.... అంత మాట అన్నది?"
"ఒక అనామకురాలు... నన్ను ఎగతాళిచేసి రెచ్చగొట్టింది. ఫలితం అనుభవిస్తుంది.
పవిత్రమూర్తి అయిన నా తల్లిపై నిందవేసిన  దాని బతుకు నిందలపాలు కాబోతుందని తెలియదు దానికి" అభినయ్ కోపంగా అన్నాడు.
వసుమతి గుండె బరువెక్కింది.
"ఈ తల్లిమీద ఏమాత్రం గౌరవం వున్నా ఆమె మాటలను గురించి పట్టించుకోకు. ఎవరో ఏదో అన్నారని నీ మనసు కష్ట పెట్టుకోకు. వెంటనే మరచిపోబాబూ" అంటూ పొంగుతున్న దుఃఖాన్ని తట్టుకోలేక లోపల గదిలోకి వెళ్ళి బావురుమన్నదామె.
తల్లి ఏడుపు స్పష్టంగా వినిపిస్తుంది అతనికి.
అభినయ్ పెదవులపై వ్యంగ్యమైన నవ్వు మెదిలి మాయం అయింది.
తల్లి మాటలలో ధ్వనించిన అపశృతిని గ్రహించకపోలేదు అతను.
కాస్తో, కూస్తో వున్న ధైర్యం కాస్తా దిగజారిపోవడంతో అమృతభాండం బ్రద్దలై విషజ్వాలలు చిందినట్టయింది.
కసి, ద్వేషం!
ఎవరిమీద కోపాన్ని చూపాలో అర్ధంకాక తన గదిలోకి వెళ్ళి కసిగా రమ్  బాటిల్ ను ఎత్తి గటగటా తాగేశాడు.గొంతును మండిస్తూలోనికి వెళ్ళిన రమ్ ఏమాత్రం కూడా మండుతున్న అతని హృదయాన్ని చల్లబరచలేకపోయింది.
నిషా అతని నషాళానికి ఎక్కినా అతని హృదయ ఫలకం పైనుంచి ఇంకా మాతృమూర్తి రూపం చెదిరిపోలేదు.   

                                                     *    *    *    *
రాకెట్ స్పీడ్ తో వస్తున్నా కారుని రియర్ వ్యూ మిర్రర్ లో చూసిన ఏ.సి.పి వీరేష్ తన కారును స్లో చేశాడు.
అతని పక్కగా దుమ్ము రేపుకుంటూ దూసుకుపోయింది ఆ కారు .
ఆ కారు తనను దాటిపోగానే ఉలికిపడ్డాడు అతను.
సగం తెరిచివున్న అద్దంలోనుంచి కారు వెనకసీట్లో గింజుకుంటున్న యువతి రూపం అస్పష్టంగా కనిపించింది. ఏదో గోల్ మాల్ జరుగుతుంది అన్న అనుమానం రావడంతో వెంటనే కారు స్పీడ్ పెంచాడు ఏ.సి.పి వీరేష్.
పోలీసు కారు వెంబడించడం గమనించిన కారులోని వ్యక్తులు కారు వేగాన్ని పెంచారు.
దాంతో వీరేష్ అనుమానం మరింత బలపడింది.
నగర వీధులనుదాటి నిర్మానుష్యంగా వుండే కులీకుతుబ్ షా టూంబ్స్  దగ్గర ఆగింది కారు. వెంటనే తలుపులు తెరుచుకోవడం ఇరవై ఐదేళ్ళ  పరువంలోవున్న అందమైన అమ్మాయిని బయటకు లాగడం క్షణాలమీద జరిగిపోయాయి.
ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్న యువతిని భూజన వేసుకున్న నలుగురు గూండాలు సమాధుల మద్యకు దారితీశారు. డ్రయివర్ తో కలసి మరో ఇద్దరు మాత్రం కారుదగ్గరే నిలబడిపోయారు.
కారు ఆపి వీరేష్ కిందకు దిగాడు.
రివాల్వర్ తీసి ఆ ముగ్గురినీ లొంగిపోమని ఆదేశించాడు.
అతని ఛాలెంజ్ కు సమాధానంగా వున్న చోటినుంచి ముగ్గురూ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి వీరేష్ మీదకు దుమికారు. ఆ అదటుకు రివాల్వర్ కింద పడిపోయింది.
"మర్యాదుగా లొంగిపోండి" తనను రౌండ్ చేసిన ఆ ముగ్గురివేపు తీక్షణంగా చూస్తూ అన్నాడు.
నీ అరుపులకు, రివాల్వర్ చప్పుళ్ళకు బెదిరిపోయి నీ కాళ్ళపై పడి లొంగిపోవడానికి మేం చేతకాని దద్దమ్మలం కాదు... అంటూనే ముగ్గురూ కోరస్ గా పగలబడి నవ్వారు.
ఏ.సి.పి వీరేష్ లో ఆవేశం పెల్లుబికింది.
గూండాలు నిలుచున్న తీరు చూస్తుంటేనే అర్ధం అయింది వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ తెలిసినవాళ్ళని... తను మాత్రం తక్కువ తిన్నావా అన్నట్టు పొజిషన్ తీసుకుని ఊహించనంతవేగంగా వాళ్ళను ఎటాక్ చేశాడు వీరేష్.
వాళ్ళలో ఎవరూ తీసిపోవడం లేదు. తమ శక్తియుక్తుల మేరకు ఆ గూండాలు వీరేష్ ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూనే వున్నారు.
పైటింగ్ చేస్తూనే సమాధుల మధ్యకు చేరారు. సమాధులకు అవతల ఆ యవతి దీనాలాపాలు వీరేష్ గుండెను పిండిచేస్తున్నాయి. ఎంతటి దారుణానికి గురి అవుతున్నదో కనుల ముందు స్పష్టంగా కనిపిస్తూనే వుంది. ఆమె ఒంటిమీద బట్టలన్నీ దాదాపు పీలికలైపోయాయి. బ్రాని కూడా తెంపేసి మదించిన ఆంబోతుల్లా ఆమెపైబడి ఇష్టం వచ్చినట్టు అందినచోట ముద్దులను పెడుతూ, గోళ్ళతో రక్కుతున్నారు. పశుబలం కల వాళ్ళతో ఆమె తన మానం కాపాడుకోవడం కోసం శక్తివంచన లేకుండా ప్రతిఘటిస్తూనే వుంది.
వీరేష్ పిడికిలిపోటు సూటిగాపోయి ఒకడి కంఠంమీద తగలడంతో వెర్రికేక పెట్టాడు. అదే వూపులో మరొకడి తొడల మధ్య మోకాలితో కిక్ చేయడంతో రెండు అరచేతులతో తొడలను అదుముకుంటూ నేలకు ఒరిగిపోయాడు. మూడవవాడిని రెండు చేతులతో పట్టి ఎత్తి విసరివేయడంతో ఒక సమాధిపై పడి తలచిట్లి స్పృహ తప్పిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS