అటువంటి దృశ్యం చూడవలసి వస్తుందని ఆమె ఊహించక పోవడం వలనేమో తన కొడుకుమీద నమ్మకంగా సరాసరి గదిలోకి అడుగు పెట్టింది.
అతనని తట్టి లేపింది తల్లి. అభినయ్ కనురెప్పలు భారంగా విచ్చుకున్నాయి.
ఎదురుగా ఏదో ఆకారం....
ఈ ప్రదేశంలో తను చూడకూడని వ్యక్తి.... కళ్ళు నులుముకుని మరీ చూశాడు ఎవరిదో గుర్తించిన మరుక్షణం ఉలికి పడ్డాడు
"అమ్మా.... నువ్వు ఇక్కడుకు వచ్చావా? బెడ్ మీదనుంచి దిగుతూ అన్నాడు.
"ఈ రోజు నీ పుట్టిన రోజురా" అన్నదామె
ఆమె ముఖంలో ఎలాంటి భావమూ పొడసూపలేదు. అభినయ్ తల్లివైపు రెప్ప వేయకుండా చూశాడు. అతని కనిలలో నీటి పొర తళుక్కు మన్నది.
'తన మీద ఎంతటి ప్రేమ.... ఈ తల్లిని తను అనుమానించి, మూడురోజులుగా ఇంటికి సయితం వెళ్ళకుండా తనను ఎంత క్షోభ పెట్టానో కదా" అని బాధపడింది అతని హృదయం.
"నన్ను మన్నించు అమ్మా... నా పుట్టినరోజునే మరచిపోయాను. నిన్ను రాకూడని చోటుకు రప్పించి నీ మనసుకు కష్టం కలిగించాను" అన్నాడు అభినయ్.
"బిడ్డమీద మమకారానికి హద్దులు వుండవు. ఆ మమకారమే నన్ను ఇక్కడకు రప్పించింది. నీ పుట్టినరోజు నువ్వు మరచిపోయినా గుర్తు చేయటానికి నేను ఇంకా బ్రతికే వున్నాను కదరా! వెళ్ళి స్నానం చేసిరా.... గుడికి వెళదాం" అన్నది వసుమతి.
ఏమనుకున్నాడో ఏమో, మారు మాట్లాడకుండా తల వూపి బాత్ రూమ్ కు వెళ్ళాడు.అంతవరకూ లోపల వున్న యువతి బట్టలు వేసుకుని.... నిర్లక్ష్యంగా ఆ గదిలోనుంచి బయటకు వెళ్ళిపోయింది.
అభినయ్ స్నానంచేసి వచ్చేటంతవరకూ వసుమతి అలానే నిలబడి వుంది ఆమె కనులు చెమ్మగిల్లి వున్నాయి.
"అమ్మా..." అన్న పిలుపుతో వాస్తవంలోకి వచ్చింది.
తెల్లటి దుస్తులతో మల్లెపూవులా మెరిసిపోతున్న అభినయ్ ముందుకు వంగి తల్లి పాదాలకు నమస్కరించాడు.
"నిండు నూరేళ్ళు బ్రతుకుతావురా చిట్టితండ్రీ.... ఈ తల్లి దీవినే నీకు శ్రీరామరక్ష అవుతుంది"
అభినయ్ గుండె బరువు తగ్గినట్టయింది.
"ప్రతి కన్నతల్లి ఆశీర్వాదానికి అంత శక్తి వుందో లేదో నాకు తెలియదు కానీ నా తల్లి ఆశీర్వాదం మాత్రం ఆ ఆయుష్షు పెంచుతుంది అనే నమ్మకం నాకు వుందమ్మా"
"పేదరికం, ఆకలి మంటలు తెలియకుండా పెరిగావు. డబ్బు దుర్వస్యనాలకు బానిసను చేస్తుంది. నీ అలవాట్లును దూరం చేసుకుని ఈ తల్లి ఆశలకు ప్రతిరూపంగా జీవించాలి నువ్వు" అశ్రువులు జారిపడ్డాయి ఆమె కనులవెంట.
"ఈ జీవితం మీద నాకూ విరక్తి పుట్టిందమ్మా....ఇక మీదట నిన్ను కంటతడి పెట్టనీయను"
"గుడికి వెళదాం పదరా కన్నా"
అభినయ్ తల వూపి తల్లితో బయలు దేరాడు.
అసలు గుడిపేరు ఎత్తితేనే రానని మొరాయించేవాడు. మౌనం వహించడమే కాకుండా వస్తానని బయలు దేరడంతో ఆ మాత్రం దానికే ఆ తల్లి హృదయం పొంగిపోయింది.
బిర్లామందిర్ దగ్గర కారు ఆగింది.
తల్లితో కలసి బయటకు అడుగు పెట్టిన అభినయ్ దృష్టి అప్పుడే ఆగిన మరొక కారులోనుంచి దిగుతున్న ఆనందరావుపై పడింది.
అప్పటికే అతని అనుచరులు కూడా అభినయ్ ను చూశారు.
"సార్... మన రవితేజను జైలుపాలు చేసిన విరోధి ఒంటరిగా దొరికాడు వేసేయమంటారా?"
తల అడ్డంగా వూపాడు ఆయన.
అతని అనుచరులలో నిరుత్సాహం తొంగి చూసింది.
ప్రత్యర్దులు ముందుకు అడుగు వేస్తే తమా రంగంలోకి సిద్దంగానే డాష్ బోర్డులో రివాల్వర్ వుందో లేదోనని తడిమి చూసుకున్నాడు అభినయ్.
"నేను ఇక్కడే వుంటాను.... నువ్వు త్వరగా పూజ ముగించుకుని వచ్చెయ్"
"దైవదర్శనం పాపప్రక్షాళనం లాంటిది__ నువ్వూ రాబాబూ"
"వద్దమ్మా... నాకు గురువు, దైవం అన్నీ నువ్వే... నువ్వు పూజ చేయించి వస్తే చాలు నా దైవం నన్ను కరుణించినట్టే "
ఆ మాటలకు వసుమతి మనసు ఆనందంతో నిండిపోయింది.
బిర్లామందిర్ మెట్లు ఎక్కసాగింది ఆమె.
అప్పటికే తన కొడుకు రవితేజ పేరుమీద ఆనందరావు అర్చన చేయిస్తున్నాడు.
వసుమతిని రెప్ప వేయకుండా చూశాడాయన.
ఆమె కనులలో విచిత్రమయిన మెరుపు.... మౌనంగా తల దించుకున్నది.
రవితేజ పేరున పూజ అయిపోగానే, అభినయ్ పేరున పూజ మొదలయింది. రవితేజ పుట్టినరోజు కూడా ఆ రోజే కావడం వలన ప్రతి సంవత్సరమూ ఆనందరావు కూడా తన కొడుకుతో వచ్చి పూజ చేయించేవాడు.
అయితే ఈ సారి ఆనందరావు ఒంటరిగా వచ్చాడు. వసుమతి కొడుకుతో వచ్చింది.
"వసూ... ఎలా వున్నావు నువ్వ.... సంవత్సరం గడిచేసరికి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినట్టు అనిపిస్తుంది. తలుచుకుంటుంటే పాతిక సంవత్సరాలు ఎలా వెనక్కు వెళ్ళాయో ననిపిస్తుందికదూ" ఆనందరావు ఆమెకు మాత్రమే వినిపిం చేటట్టు అన్నాడు.
వసుమతి బరువుగా నిట్టూర్చింది.
"మీరు ఎలా వున్నారు"
"నీకు తెలియని కొత్త విశేషాలు ఏమన్నాయి వసూ.... జయ చంద్ర నేనూ రాజకీయ శత్రువులమైపోయాం. మన పిల్లలకు అయినా శతృత్వం అంటకుండా చూద్దామని ప్రయత్నించి విఫలుడను అయ్యాను. అభినయ్ పన్నిన పన్నాగం వలన రవితేజ చేయని నేరానికి జైలుకు వెళ్ళాడు."
"నన్ను క్షమించండి. అన్నీ తెలిసినా, ఏమీ చేయలేనిదానిలా చూస్తూ ఉండిపోయాను" వసుమతి రుద్దకంఠంతో అన్నది.
"ఒకే తల్లిబిడ్డలు... తండ్రులు వేరు అయినా విచిత్రమయిన పరిస్థితుల్లో శత్రువులుగా మారిపోయారు. వాళ్ళను కలపడం ఎలా?"
"వద్దు... ఆ ప్రయత్నం చేయద్దు. నేనంటే అభినయ్ కు ఎనలేని ప్రేమ, గౌరవం వున్నాయి.
వాడి దృష్టిలో నేను పతితను కాలేను. నా ప్రాణం వున్నంత వరకు వాడికి ఈ నిజం తెలియడానికి వీలులేదు" అభ్యర్దిస్తున్నట్టు అంది వసుమతి.
అంతలో పూజారి ప్రసాదం తెచ్చి ఇచ్చాడు.
వాళ్ళ సంభాషణ ఆగిపోయి, ఇద్దారూ దూరమయ్యారు.
ముందుగా వసుమతి పూలసజ్జతో గుడిమెట్లు దిగి వెళ్ళిపోయింది.
అభినయ్ కారు కనుమరుగయ్యేవరకూ ఆనందరావు చూస్తూనే వుండిపోయాడు.
అయన కంటి ముందు జైలు కటకటాల వెనుక దీనవదనంతో నిలబడి వున్నా రవితేజ మొఖం మెదలడంతో హృదయం బరువు యెక్కి పోయింది.
భారంగా అడుగులు వేస్తూ బిర్లామందిర్ మెట్లు దిగసాగాడు ఆనందరావు.
కొడుకును విడిపించే మార్గాలను గూర్చి ఆలోచిస్తూ వెళ్ళి కారులోకూర్చున్నాడు. అతని ఆలోచనలతో నిమిత్తం లేకుండా కారు ముందుకు కదిలింది.
* * * *
